పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ గోల చేసే సినిమా మళ్లీ రిలీజ్.. వచ్చే కలెక్షన్స్ ఏం చేస్తారంటే?
తెలుగు ప్రజల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హిట్లు ఫ్లాప్‌లు అంటూ తేడా లేకుండా ఎలాంటి క్రేజ్ తగ్గని హీరోగా తన సత్తా చాటుతున్నాడు. ఎన్ని ప్లాప్స్ వచ్చినా సరే ఫ్యాన్స్ మాత్రం తగ్గని ఏకైక హీరో ఆయన. పవన్ కల్యాణ్ ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. ఇటీవలే బ్రో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక ఈ మధ్య రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న నేపథ్యంలో పవన్ కల్యాణ్ మూవీ ఒకటి మళ్లీ థియేటర్లలో సందడి చేయనుంది.
శ్యాంబాబు పాత్రతో: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఓవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇండస్ట్రీలో జోరు చూపిస్తూ వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. అలా ఇటీవలే బ్రో సినిమా జూలై 28న విడుదలైంది. సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చింది. అలాగే శ్యాంబాబు పాత్రతో రాజకీయపరంగా వివాదం సైతం నెలకొంది.

ఆలస్యంగా మూవీ: ఇక పవన్ కల్యాణ్ బ్రో సినిమా కాకుండా హరి హర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు కూడా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రముఖ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరి హర వీరమల్లు సినిమాను రెండు పార్టులుగా విడుదల చేసేందుకు దర్శక నిర్మాతలు ఆలోచిస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అందుకే ఆ సినిమా కాస్తా ఆలస్యం కానుందని టాక్.

గుడ్ న్యూస్: ఇక హరీష్ శంకర్ డైరెక్షన్ లో ఉస్తాద్ భగత్ సింగ్, యంగ్ డైరెక్టర్ సుజీత్ తో ఓజీ చిత్రాలను లైన్ లో పెట్డాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఇదిలా ఉంటే తాజాగా పవన్ కల్యాణ్ అభిమానులకు ఓ గుడ్ న్యూస్ వెలువడింది. ఇటీవల పవన్ కల్యాణ్ నటించిన జల్సా, తొలి ప్రేమ సినిమాలు రీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో మూవీని మళ్లీ థియేటర్లలో ప్రదర్శించనున్నారు.
మెగా బ్రదర్ ప్రకటన: పవన్ కల్యాణ్, మీరా జాస్మిన్ జోడీగా నటించిన చిత్రం గుడుంబా శంకర్ (Gudumba Shankar). ఈ సినిమాను త్వరలో మళ్లీ విడుదల చేయనున్నారు. సుమారు 19 ఏళ్ల తర్వాత గుడుంబా శంకర్ సినిమాను ఆగస్టు 31న థియేటర్లలో మళ్లీ రిలీజ్ (Gudumba Shankar Re Release) చేస్తున్నారు. దీనికి సంబంధించిన విషయాన్ని పవన్ సోదరుడు మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.

ప్రతి రూపాయి అంకితం: "ఆగస్టు 31, సెప్టెంబర్ 1న గుడుంబా శంకర్ సినిమాను థియేటర్లలో తిరిగి విడుదల చేస్తున్నట్లు మేము సగర్వంగా ప్రకటిస్తున్నాం. జల్సా, ఆరెంజ్ టికెట్ అమ్మకాల ద్వారా వచ్చిన ప్రతి రూపాయిని ఎలాగైతే జనసేన పార్టీకి ఫండ్ గా ఇచ్చామో.. అలాగే ఈ చిత్రం ద్వారా వచ్చిన ప్రతి రూపాయిని జనసేన పార్టీకి అంకితం చేయబడుతుంది. అధికారిక పోస్టర్ వివరాలను త్వరలో తెలపుతాం" అని ట్వీట్ చేశారు నాగబాబు.

2004లో రిలీజ్: 2004లో విడుదలైన గుడుంబా శంకర్ చిత్రాన్ని వీర శంకర్ బైరిసెట్టి దర్శకత్వం వహించగా నాగబాబు నిర్మాతగా వ్యవహరించారు. సెప్టెంబర్ 2న పవన్ పుట్టినరోజు సందర్భంగా దానికి ఒకరోజు ముందే రీ రిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు వచ్చే ఆదాయాన్ని జనసేన పార్టికి ఇవ్వనున్నారు. కాగా ఈ సినిమాలో కిల్లీ కిల్లీ సాంగ్ ఎంత హైలెట్ అయిందో తెలిసిందే. ఈ పాటనే బ్రోలో కూడా రీమిక్స్ చేశారు.


Click it and Unblock the Notifications











