అభిమాని కోరిక తీర్చి, రూ. లక్ష సహాయం అందించిన పవన్ కళ్యాణ్
క్యాన్సర్ వ్యాధితో బాధపుడుతున్న తన అభిమాని పాతకూటి బుడిగయ్యను జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పరామర్శించారు. మంగళవారం ఉదయం హైదరాబాద్‌లోని జనసేన కార్యాలయంలో బుడిగయ్య, ఆయన కుటుంబం పవర్ స్టార్‌ను కలిశారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అతడి ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులను ఆరాతీశారు. వైద్య ఖర్చుల నిమిత్తం రూ. లక్ష ఆర్థిక సహాయం అందించారు. తన అభిమాని త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్తిస్తూ వినాయక విగ్రహాన్ని బహూకరించారు.

ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం, అన్నసముద్రం గ్రామానికి చెందిన బుడిగయ్య... పవన్ కళ్యాణ్ వీరాభిమాని. గతకొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండటంతో కొంతకాలంగా మంచానికే పరిమితం అయ్యారు. పవన్ కళ్యాణ్‌ను చూడాలన్న తన కోరికను స్థానిక జనసేన నాయకులను తెలియజేయగా ఈ విషయం పార్టీ అధినేత దృష్టికి తీసుకొచ్చారు.

బుడిగయ్యను పరామర్శించేందుకు అన్నసముద్రం వస్తానని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఈలోగా అతడిని అంబులెన్స్‌లో ప్రశాసన్ నగర్లో జనసేన పార్టీ ప్రధాన కార్యలయానికి తీసుకొచ్చారు. వ్యాధి ఎంతకాలం నుంచి ఉంది? చికిత్స ఎక్కడ చేయిస్తున్నారు? అనే విషయాలను ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అడిగి తెలుసుకున్నారు. మంగళగిరిలోని ఎన్ఆర్ఐ ఆసుపత్రి వైద్యులతో తాను స్వయంగా మాట్లాడతానని పవన్ కళ్యాణ్ తెలిపారు. బుడిగయ్య ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు చూసుకోవాలని ఎర్రగొండపాలెం నుంచి జనసేన అభ్యర్థిగా నిలిచిన డాక్టర్ గౌతమ్‌కు సూచించారు.


Click it and Unblock the Notifications











