34 ఏళ్ల తర్వాత అతనిని కలిసిన పవన్ కళ్యాణ్.. ఆ ఫోటోతో ఎమోషనల్ పోస్ట్
సినిమాలతో కెరీర్ ఆరంభించి పవర్‌స్టార్‌గా కోట్లాది మంది అభిమానాన్ని సంపాదించారు పవన్ కళ్యాణ్. ప్రజల కోసం కెరీర్‌ను వదిలిపెట్టి రాజకీయాల్లోకి దూకిన ఆయన జనసేన పార్టీని స్థాపించారు. పదేళ్ల పాటు ఎన్నో కష్టాలు, అవమానాల్ని భరించి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. తాను డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టి పాలనలో తనదైన ముద్ర వేస్తున్నారు. కష్టపడితే ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎప్పటికైనా విజయం లభించి తీరుతుందని పవన్ నిరూపించారు. అయితే ఆయనలో ఈ కసి పెరగడానికి పవన్ తీసుకున్న మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ కూడా ఒక కారణమని పలువురు చెబుతుంటారు.
మార్షల్ ఆర్ట్స్‌తో పవన్ వైవిధ్యం
ఇంట్లో ఖాళీగా ఉండటంతో పవన్ కళ్యాణ్ జీవితాన్ని నిలబెట్టేందుకు చిరంజీవి ఆయనను సినీరంగంలోకి తీసుకురావాలని భావించారు. ఇందుకోసం అవసరమైన శిక్షణను కూడా ఇప్పించారు మెగాస్టార్. తన బలాలు, బలహీనతలపై పవన్ కళ్యాణ్‌కు ముందు నుంచి అవగాహన ఉంది. తనకు డ్యాన్స్ అంతగా రాదని, గొప్ప నటుడిని కాదని ఆయనే ఆ రోజుల్లోనే గుర్తించారు. ఇదే విషయాన్ని పలు వేదికల మీద స్వయంగా ఒప్పుకున్నారు. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే తనకంటూ ఏదో ఒక ప్రత్యేకత ఉండాలని బలంగా నమ్మారు. అదే మార్షల్ ఆర్ట్స్. అప్పటి వరకు తెలుగు చిత్ర పరిశ్రమలో డ్యాన్స్, ఫైట్స్ , నటించేవాళ్లు ఎంతో మంది ఉన్నారు. కానీ తొలిసారిగా మార్షల్ ఆర్ట్స్ వంటి సబ్జెక్ట్‌ను టాలీవుడ్‌కు పరిచయం చేశారు పవన్ కళ్యాణ్.

మార్షల్ ఆర్ట్స్‌కు యూత్ ఫిదా
ఆయన యూత్ ఐకాన్ కావడం వెనుక మార్షల్ ఆర్ట్స్ కీలకపాత్ర పోషించింది. తన తొలి సినిమా అక్కడ అమ్మాయి - ఇక్కడ అబ్బాయిలో తొలిసారిగా తన మార్షల్ ఆర్ట్స్ విన్యాసాలు చూపించిన పవన్ .. తమ్ముడు మూవీని దాని చుట్టూనే తిప్పారు. ఖుషీలోనూ చైన్, కత్తితో ఆయన చేసే విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత పలు చిత్రాల్లో తన మార్షల్ ఆర్ట్స్ ప్రావీణ్యాన్ని చూపించారు పవన్ కళ్యాణ్. ఇటీవల విడుదలైన హరిహర వీరమల్లు చిత్రంలో మరోసారి ఆయన స్టంట్స్ చేశారు. అంతేకాదు.. స్వయంగా తానే యాక్షన్ కొరియోగ్రఫి చేశారు.
షిహాన్ హుసైనీ నుంచి శిక్షణ
పవన్ కళ్యాణ్‌కు షిహాన్ హుసైనీ మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ ఇచ్చారు. ఇటీవలే ఆయన బ్లడ్ క్యాన్సర్‌తో కన్నుమూశారు. పవన్ కళ్యాణ్ ఎంతో పట్టుబట్టి తన వద్ద మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారని.. స్టార్ హీరో తమ్ముడైనప్పటికీ సామాన్యుడిలాగే ఉండేవాడని షిహాన్ బతికున్న రోజుల్లో చెప్పేవారు. ఆయన వద్ద పవన్ కళ్యాణ్‌తో పాటు ఎంతో మంది మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకున్నారు. షిహాన్ మరణం తర్వాత ఈ మార్షల్ ఆర్ట్స్ స్కూల్‌ను రెన్షి రాజా అవర్ నడుపుతున్నారు. దాదాపు 34 సంవత్సరాల తర్వాత తనకు సీనియర్ అయిన రెన్షిని కలుసుకున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
34 ఏళ్ల తర్వాత మిత్రుడితో ప్రాక్టీస్
34 ఏళ్ల తర్వాత రెన్షి రాజాని కలవడం చాలా సంతోషంగా ఉందని.. 1990లలో ఆయనకు నాకు సీనియర్ అని పవన్ తెలిపారు. అప్పట్లోనే ఆయన బ్లాక్ బెల్ట్ సాధించారని.. కానీ తాను ఇంకా గ్రీన్ బెల్ట్‌లోనే ఉన్నానని జనసేనాని చెప్పారు. షిహాన్ కరాటే స్కూల్‌కు రెన్షి రాజా సారథ్యం వహిస్తున్నారని తెలిసి గర్వంగా ఉందని.. నా గురువు దార్శనికతను రాజా ముందుకు తీసుకెళ్తున్నారని పవన్ కళ్యాణ్ ప్రశంసించారు. తన మిత్రుడిని కలుసుకున్న సందర్భంగా రెన్షితో కలిసి మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తున్న ఫోటోలను పవన్ షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











