పవన్ కల్యాణ్ భావోద్వేగం.. విజయ నిర్మల మరణానికి శ్రద్ధాంజలి
దర్శకురాలు, నటి, నిర్మాత విజయ నిర్మల ఆకస్మిక మృతి పట్ల జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. ఆమె మరణం సినీ పరిశ్రమకు తీరని లోటని సంతాప ప్రకటనలో పేర్కొన్నారు. సీనియర్ సినీ ప్రముఖురాలు విజయ నిర్మల అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ కాంటినెంటల్ హాస్పిటల్‌లో జూన్ 27 తేది తెల్లవారు జామున మరణించారు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆ క్రమంలోనే పవన్ కల్యాణ్ తన భావోద్వేగ సంతాప ప్రకటనలో..
ప్రముఖ నటి, దర్శకురాలు శ్రీమతి విజయనిర్మల గారు మరణం దిగ్భ్రాంతి కలిగించింది. కృష్ణ గారికి, నరేశ్ గారికి నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను. నటిగా, దర్శకురాలిగా విజయనిర్మల గారి ముద్ర చెరగనిది. మీనా, హేమాహేమీలు, రామ్ రాబర్ట్ రహీమ్ లాంటి విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించి ఈ విభాగంలో మహిళలు ప్రవేశించేందుకు స్ఫూర్తిగా నిలిచారు. విజయనిర్మల గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను అని తన సంతాప ప్రకటనలో తెలిపారు.

సినీ నటుడు వీకే నరేష్ తన తల్లి మరణం గురించి ట్వీట్టర్‌లో వెల్లడించారు. నా తల్లి భౌతిక కాయాన్ని నానక్‌రామ్ గూడలోని మా నివాసంలో ప్రజలు, అభిమానులు, సినీ ప్రముఖుల సందర్శనార్థం పెడుతున్నాం. 11 గంటలకు పార్ధీవ దేహాన్ని ఇంటికి తరలిస్తాం. విజయ నిర్మల గారి అంత్యక్రియలు జూన్ 28న నిర్వహిస్తాం. నా తల్లి మరణానికి సంబంధించి మరింత సమాచారం త్వరలోనే అందజేస్తాం అని నరేష్ మరో ట్వీట్ చేశారు.


Click it and Unblock the Notifications











