మేజర్ సినిమాపై పవన్ ప్రశంసల వర్షం.. సినిమా చూడలేదంటూనే స్పందన!
26 / 11 ముంబై దాడుల్లో మరణించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా మేజర్ అనే సినిమా రూపొందించిన సంగతి తెలిసిందే. అడవి శేష్ హీరోగా శశికిరణ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు ఇప్పటికే పలువురు ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకోగా తాజాగా పవన్ కళ్యాణ్ ఈ సినిమా మీద ప్రశంసల వర్షం కురిపించారు. ఆ వివరాల్లోకి వెళితే

సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా
అడవి శేష్ హీరోగా సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటించిన తాజా చిత్రం మేజర్. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను రూపొందించాడు దర్శకుడు శశికిరణ్ తిక్క. ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, జి మహేష్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మించాయి. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు. శోభిత దూళిపాళ్ల కీలక పాత్ర చేయగా.. ప్రకాశ్ రాజ్, రేవతి ముఖ్య పాత్రలు పోషించారు.

చిత్ర బృందానికి అభినందనలు
తాజాగా ఈ సినిమా మీద పవన్ కళ్యాణ్ ప్రశంసల వర్షం కురిపించారు. ఒక ప్రకటన విడుదల చేసిన పవన్ ముంబై మహానగరంలో 26 నవంబర్ 2008న ఉగ్రవాదులు చేసిన ఘాతుకాలను 26/11 మారణ హోమంగా ఈ దేశం గుర్తుపెట్టుకొందని అన్నారు. నాడు చేసిన కమెండో ఆపరేషన్ లో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ సాహసాలు, ఆయన వీర మరణాన్ని వెండి తెరపై 'మేజర్'గా ఆవిష్కరించిన చిత్ర బృందానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియచేస్తున్నానని పేర్కొన్నారు.

అందరికీ తెలియాలి
ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన తెలుసుకొని సంతోషించానన్న పవన్, అన్ని భాషలవారినీ మెప్పిస్తున్న ఈ బయోపిక్ మన తెలుగు చిత్రసీమ నుంచి రావడం ఆనందం కలిగించిందని అన్నారు. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ లాంటి సైనికాధికారులు, సిబ్బంది దేశ భద్రత కోసం ఎంతగా పోరాడుతున్నారో అందరికీ తెలియాలని అన్నారు. పార్టీ సంబంధిత వ్యవహారాల్లో తలమునకలై ఉండటంతో మేజర్ ఇంకా చూడలేదు. ఆ చిత్రానికి వస్తున్న స్పందన తెలుసుకొన్నాను. త్వరలోనే ఆ చిత్రం వీక్షిస్తానని అన్నారు.

హృదయ పూర్వక అభినందనలు
ఇక ఈ సినిమా హీరో, సోదరుడు అడివి శేష్ కి హృదయ పూర్వక అభినందనలు అని తెలిపారు. ప్రఖ్యాత రచయిత దివంగత అడివి బాపిరాజు గారి మనవడైన శేష్ సినిమాలో భిన్న శాఖలపై అభినవేశం ఉన్న సృజనశీలి అని పవన్ కొనియాడారు. తెలుగు సాహిత్యంపై మక్కువ, వర్తమాన అంశాలపై ఉన్న అవగాహన ఆయన మాటల్లో తెలుస్తుందని, ఇటువంటివారు మరింత మంది చిత్రసీమకు రావాలని ఆకాంక్షించారు.

మరిన్ని రావాలని
ఒక సాహసి కథను చలన చిత్రంగా మలచిన చిత్ర దర్శకుడు శశికిరణ్ కు శుభాకాంక్షలు, ఇటువంటి మంచి చిత్రాలు ఆయన నుంచి మరిన్ని రావాలని ఆకాంక్షిస్తున్నానని పవన్ పేర్కొన్నారు. ఇక అలాగే మేజర్ సినీ నిర్మాణంలో భాగస్వామి అయిన ప్రముఖ హీరో మహేశ్ బాబు కి, చిత్ర నిర్మాతలు శరత్ చంద్ర, అనురాగ్ రెడ్డిలకు నా అభినందనలు అని పవన్ పేర్కొన్నారు. ఈ చిత్రంలో నటించిన శ్రీ ప్రకాష్ రాజ్, శ్రీమతి రేవతి, సాయి మంజ్రేకర్, శోభిత ధూళిపాళ, మురళీ శర్మలకు, చిత్ర సాంకేతిక నిపుణులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు పవన్.


Click it and Unblock the Notifications











