ఎలాగైతేనేం పవన్ స్టామినా బయటపడింది.. సంబరాల్లో మునిగిన మెగా ఫ్యాన్స్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టామినా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వరుసగా సినిమాలు ఫెయిల్ అయినప్పటికీ క్రేజ్ తగ్గలేదు. ఎన్నో ఏళ్ల తర్వాత 'అత్తారింటికి దారేది' సినిమా సూపర్ డూపర్ హిట్ సాధించి పవన్ కళ్యాణ్ పవర్ ఏంటో చూపించింది. ఈ సినిమా తర్వాత కూడా కొన్ని సినిమాలు హిట్ సాధించగా, మరికొన్ని డిజాస్టర్‌గా నిలిచాయి. ఇలాంటి డిజాస్టర్‌లలో ఒకటి 'అజ్ఞాతవాసి'.
ఈ 'అజ్ఞాతవాసి' సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించగా.. కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్లుగా నటించారు. గతేడాది సంక్రాంతికి భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఊహించని రీతిలో నెగెటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. మొదటి రోజు మంచి కలెక్షన్స్ వచ్చినప్పటికీ ఆ తర్వాత సినిమాకు ఆదరణ లభించలేదు.

ఇదే సినిమాను హిందీలో 'ఎవడు 3' పేరుతో రీమేక్ చేశారు. బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేక పోయిన ఈ సినిమా యూట్యూబ్‌లో మాత్రం సెన్సేషన్‌గా నిలిచింది. ఇప్పటికే 100 మిలియన్ వ్యూస్ దాటేసి రికార్డు స్థాయిలో వ్యూస్ రాబడుతోంది. ఎవడు 3 పేరుతో హిందీలోకి డబ్ చేసిన గోల్డ్ మైన్స్ టెలీ ఫిల్మ్స్ సంస్థ దీనిని యూట్యూబ్‌లో విడుదల చేసింది. గత ఏడాది అక్టోబర్ నెలలో ఈ మూవీని డబ్బింగ్ చేసి యూట్యూబ్‌లో పెట్టగా వంద మిలియన్ వ్యూస్ వచ్చాయి. దాదాపు 4.6 లక్షల లైక్స్ వచ్చాయి. దీంతో మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.
అజ్ఞాతవాసి సినిమా అనంతరం రాజకీయాల్లో బిజీ అయ్యారు పవన్ కళ్యాణ్. ఈ ఏడాది జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోకసభ ఎన్నికల్లో పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఆయన స్థాపించిన జనసేన పార్టీ ఒక్క అసెంబ్లీ స్థానాన్ని మాత్రమే గెలుచుకుంది. దీంతో పవన్ మళ్ళీ సినిమాల్లోకి రాబోతున్నాడంటూ ప్రచారం మొదలైంది.


Click it and Unblock the Notifications











