Bheemla Nayak Hindi Trailer: భీమ్లా నాయక్ హిందీ ట్రైలర్.. అక్కడ రెస్పాన్స్ ఎలా ఉందంటే!
ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో బాలీవుడ్ చిత్రాలకు మాత్రమే భారీ గుర్తింపు ఉండేది. అయితే, ఇప్పుడా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. దక్షిణాది చిత్రాలు కూడా దేశ వ్యాప్తంగా సత్తా చాటడంతో పాటు ఉత్తరాది సినీ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా కొన్ని రోజులుగా మన తెలుగు చిత్రాలు ఇండియన్ బాక్సాఫీస్‌పై దండయాత్ర చేస్తున్నాయి. ఇలా ఇప్పటికే పలు చిత్రాలు హిందీ ఆడియెన్స్ అభిమానాన్ని కూడా అందుకుని సత్తా చాటుకున్నాయి. దీంతో టాలీవుడ్ ఫిల్మ్ మేకర్లు అందరూ తెలుగు సినిమాలను హిందీలో విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే 'భీమ్లా నాయక్'ను కూడా డబ్బింగ్ చేస్తున్నారు.
తెలుగు సినీ ఇండస్ట్రీలో బడా హీరోలుగా వెలుగొందుతోన్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. టాలీవుడ్ హంక్ దగ్గుబాటి రానా కాంబినేషన్‌లో విలక్షణ చిత్రాల దర్శకుడిగా పేరొందిన సాగర్ కే చంద్ర తెరకెక్కించిన చిత్రమే 'భీమ్లా నాయక్'. మలయాళంలో సూపర్ డూపర్ హిట్ అయిన 'అయ్యప్పనుమ్ కోషియం' అనే సినిమాకు ఇది రీమేక్‌గా రూపొందింది. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే ఆధిపత్య పోరుతో నడిచే కథతో ఈ సినిమా రూపొందింది. విడుదలకు ముందే భారీ అంచనాలను ఏర్పరచుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 25వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 'భీమ్లా నాయక్' మూవీకి ఆరంభం నుంచే భారీ స్పందన దక్కుతోంది. ఫలితంగా విడుదలైన అన్ని ఏరియాల్లోనూ ఇది అదిరిపోయే కలెక్షన్లను రాబడుతోంది. దీంతో కేవలం రెండు రోజుల్లోనే యాభై కోట్ల రూపాయల షేర్‌ను రాబట్టుకుంది. అయితే, ఆ తర్వాత నుంచి ఈ సినిమా కలెక్షన్లు క్రమంగా డ్రాప్ అవుతున్నాయి. మొత్తంగా మొదటి వారం పూర్తయ్యే సరికి 'భీమ్లా నాయక్' మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 89.60 కోట్లు వసూలు చేసింది. అంటే మరో రూ. 18.40 కోట్లు వస్తేనే ఇది హిట్ స్టేటస్‌ను చేరుకుంటుంది.
ఇదిలా ఉండగా.. 'భీమ్లా నాయక్' మూవీని హిందీలో కూడా విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ఎప్పుడో ప్రకటించింది. అందుకు అనుగుణంగానే తాజాగా దీనికి సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు. గతంలో రిలీజ్ ట్రైలర్‌గా తెలుగులో విడుదల చేసిన దాన్నే హిందీలోకి డబ్బింగ్ చేసి వదిలారు. ఇందులో రానాకు, పవన్‌కు గంభీరమైన స్వరంతో కూడిన డబ్బింగ్ చెప్పించారు. దీంతో ఇక్కడిలాగే హిందీలోనూ దీనికి భారీ రెస్పాన్స్ వస్తోంది. మరీ ముఖ్యంగా ఇందులోని విజువల్స్, డైలాగ్స్ బాగున్నాయంటూ హిందీ ప్రేక్షకులు కామెంట్లు చేస్తున్నారు. దీంతో ఇది కాసేపట్లోనే వైరల్‌గా మారిపోయింది.
'భీమ్లా నాయక్' చిత్రాన్ని సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలతో పాటు దర్శకత్వ పర్యవేక్షణ చేశాడు. దీనికి ఎస్ థమన్ సంగీతం అందించాడు. ఇందులో పవన్ కల్యాణ్ సరసన నిత్యా మీనన్, రానాకు జోడీగా సంయుక్త మీనన్ నటించారు. రావు రమేష్, మురళీశర్మ, సముద్ర ఖని కీలక పాత్రలు చేశారు. ఇక, దీన్ని హిందీలో బి4యూ మోషన్ పిక్చర్స్ ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. హిందీ వెర్షన్‌కు సునీల్ షా, రాజా సుబ్రమణియన్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ రిలీజ్ డేట్ వివరాలు తెలియాల్సి ఉన్నాయి.


Click it and Unblock the Notifications











