HariHara VeeraMallu: హరిహర వీరమల్లు రిలీజ్.. ఏఎం రత్నంకు ఊహించని షాక్
దాదాపు ఐదేళ్లు ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి హరిహర వీరమల్లు సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు దర్శక నిర్మాతలు. జూలై 24న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లో తొలి పాన్ ఇండియా సినిమాగా ఇది నిలవనుంది. సెట్స్ మీదకు వెళ్లినప్పటి నుంచి నేటి వరకు వీరమల్లుకు ఏదో ఒక ఆటంకం ఎదురవుతూనే ఉంది. తాజాగా రిలీజ్‌కు నాలుగు రోజుల ముందుకు ఈ చిత్ర నిర్మాణ ఏఎం రత్నంకు ఊహించని షాక్ తగిలింది. ఈ వివరాల్లోకి వెళితే..
కోహినూర్ చుట్టూ డ్రామా
మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దాదాపు రూ.250 కోట్లకు పైగా బడ్జెట్‌తో స్టార్ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం హరిహర వీరమల్లు చిత్రాన్ని నిర్మించారు. రెండు భాగాలుగా నిర్మితమైన ఈ సినిమా తొలి భాగాన్ని జూలై 24న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. భారతదేశాన్ని మొఘల్ చక్రవర్తులు పరిపాలిస్తున్న కాలంలో కోహినూర్ వజ్రం చుట్టూ జరిగే యుద్ధంగా హరిహర వీరమల్లును తెరకెక్కించారు. ఇందులో పవన్ కళ్యాణ్ వీరమల్లు అనే పవర్‌ఫుల్ రోల్ పోషిస్తున్నారు.

కోట శ్రీనివాసరావు చివరి చిత్రం
హరిహర వీరమల్లులో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ ఇందులో ఔరంగజేబు పాత్ర పోషిస్తున్నారు. నోరా ఫతేహి, నర్గీస్ ఫక్రీ, సత్యరాజ్, జిషుసేన్ గుప్తా, పూజిత పొన్నాడ, సచిన్ ఖేడేకర్, అనుపమ్ ఖేర్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల కన్నుమూసిన నట దిగ్గజం కోట శ్రీనివాసరావు కూడా ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషించారు. హరిహర వీరమల్లు ఆయన చివరి సినిమా కావడం గమనార్హం. ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించగా.. వీఎస్ జ్ఞాన శంకర్, మనోజ్ పరమహంస సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు.
వీరమల్లును రిలీజ్‌కు సిద్ధం చేసిన పవన్
హరిహర వీరమల్లును తొలుత స్టార్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి టేకప్ చేశారు. అయితే కరోనా, లాక్‌డౌన్, పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో షూటింగ్ నత్తనడకన సాగింది. ఈ ఆలస్యం కారణంగా క్రిష్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుని జ్యోతికృష్ణకు మెగాఫోన్ అప్పగించారు. దీంతో ఆయన అందరినీ సమన్వయం చేసుకుంటూ షూటింగ్‌ను గాడిలో పెట్టారు. ఈలోపు పవన్ కళ్యాణ్ కూడా తీరిక చూసుకుని షూటింగ్‌లో పాల్గొని, డబ్బింగ్ వర్క్ కూడా పూర్తి చేశారు. పలుమార్లు వీరమల్లు రిలీజ్ వాయిదాపడి జూలై 24కు చేరుకుంది. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్లు, పవన్ కళ్యాణ్ లుక్‌కు మంచి రెస్పాన్స్‌తో పాటు సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
టికెట్ రేట్ల పెంపుకు ఏపీ సర్కార్ అనుమతి
నిర్మాత విజ్ఞప్తి మేరకు హరిహర వీరమల్లు సినిమా టికెట్ రేట్ల పెంపుకు ఏపీ ప్రభుత్వం అనుమతించింది. సింగిల్ స్క్రీన్‌లో 100 నుంచి 150 రూపాయలు, మల్టీప్లెక్స్‌లలో 200 వరకు పెంచుకోవచ్చని ఉత్తర్వుల్లో తెలిపింది. సినిమా రిలీజైన 14 రోజుల వరకు పెంచిన ధరలు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. అన్ని పరిస్ధితులు సానుకూలంగా ఉన్న సమయంలో వీరమల్లు నిర్మాత ఏఎం రత్నంకు ఊహించని షాక్ తగిలింది. రత్నం మీద తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్‌లో రెండు డిస్ట్రిబ్యూషన్ సంస్థలు ఫిర్యాదులు చేశాయి.
మా బాకీలు చెల్లించండి
ఏఎం రత్నం గతంలో గోపీచంద్‌తో నిర్మించిన ఆక్సిజన్ సినిమాకు 2.6 కోట్ల రూపాయలు తమకు బకాయి పడ్డారని ఏషియన్ ఎంటర్‌ప్రైజెస్ పేర్కొంది. అలాగే ముద్దుల కొడుకు, బంగారం చిత్రాలకు తమకు 90 లక్షల రూపాయలు చెల్లించాలని మహాలక్ష్మీ ఫిల్మ్స్ ఫిర్యాదు చేసింది. తాజాగా ఏఎం రత్నం నిర్మించిన హరిహర వీరమల్లు రిలీజ్‌కు ముందే తమకు రావాల్సిన మొత్తం చెల్లించాలని ఆ సంస్థలు ఛాంబర్‌ను అభ్యర్ధించాయి. ఇందుకు నైజాం ఏరియాలో ఇతర డిస్ట్రిబ్యూటర్లు తమకు సహకరించాలని వారు కోరారు. లేదంటే సినిమాను అడ్డుకుంటామని వారు హెచ్చరిస్తున్నారు. మరి ఈ వివాదాన్ని ఏఎం రత్నం ఎలా పరిష్కరిస్తారో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











