Pawan Kalyan ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ప్రారంభం.. భారీ పోలీస్ స్టేషన్ సెట్లో పవర్ స్టార్!
గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత హరీష్ శంకర్, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కాంబినేషన్ ఎప్పుడెప్పుడా అనే అభిమానులకు శుభవార్త. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కల సాకారమయ్యే క్షణాలు మొదలయ్యాయి. ఢిల్లీ పర్యటనలో బిజీగా గడిపి వచ్చిన పవన్ కల్యాణ్.. అభిమానులకు సర్‌ప్రైజ్ ఇస్తూ.. నేరుగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగులో భాగమయ్యారు. ఆ సినిమా వివరాల్లోకి వెళితే..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ ద్వయం ఉస్తాద్ భగత్ సింగ్ కోసం రెండోసారి చేతులు కలిపారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవి శంకర్ యలమంచిలి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్‌కు జోడీగా అందాల భామ, ధమాకా ఫేమ్ శ్రీలీల నటిస్తున్నది.

గత డిసెంబర్‌లో పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం పూజా కార్యక్రమాలతో జరుపుకొని ఘనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. బుధవారం (ఏప్రిల్ 5వ తేదీ) నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలైంది. ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి రూపొందించిన అద్భుతమైన పోలీస్ స్టేషన్ సెట్‌లో మొదటి షెడ్యూల్ జరుగుతున్నది. కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్న ఈ షెడ్యూల్‌లో పవన్ కళ్యాణ్‌తోపాటు ఇతర ముఖ్య తారాగణం పాల్గొననున్నారు.
పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కలయికలో ఇప్పటిదాకా వచ్చింది ఒక్క 'గబ్బర్ సింగ్' సినిమానే అయినప్పటికీ.. ఆ సినిమా సృష్టించిన ప్రభంజనం కారణంగా వీరి కలయికలో వస్తున్న రెండో సినిమా ఉస్తాద్ భగత్ సింగ్‌పై అప్పుడే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా గబ్బర్ సింగ్‌ని మించేలా, అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా అద్భుతమైన చిత్రాన్ని అందించాలని దర్శకుడు హరీష్ శంకర్ పట్టుదలగా ఉన్నారు.

ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం కోసం అత్యుత్తమ సాంకేతిక బృందం పని చేస్తోంది. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. 'గబ్బర్ సింగ్' ఘన విజయంలో దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ఎంతటి కీలక పాత్ర పోషించిందో తెలిసిందే. మరోసారి ఆ స్థాయి సంగీతంతో అలరించడానికి దేవి శ్రీ ప్రసాద్ సిద్ధమవుతున్నారు. ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్ గా ఆనంద్ సాయి, ఎడిటర్ గా ఛోటా కె.ప్రసాద్ పని చేస్తున్నారు. అయానంక బోస్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. రామ్-లక్ష్మణ్ ద్వయం ఈ చిత్రంలో యాక్షన్ సన్నివేశాలకు కొరియోగ్రఫీ చేస్తున్నారు.

రచన, దర్శకత్వం: హరీష్ శంకర్ ఎస్
నిర్మాతలు: నవీన్ ఎర్నేని, రవి శంకర్ యలమంచిలి
బ్యానర్: మైత్రి మూవీ మేకర్స్
సీఈవో: చెర్రీ
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫీ: అయనంకా బోస్
ఎడిటింగ్: చోటా కే ప్రసాద్
ప్రొడక్షన్ డిజైనర్: ఆనంద్ సాయి
ఫైట్స్: రామ్-లక్ష్మణ్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: రావిపాటి చంద్రశేఖర్, హరీష్ పాయ్
పీఆర్వో: లక్ష్మీవేణుగోపాల్


Click it and Unblock the Notifications











