హైకోర్టుకు పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విస్తరణతో పాటు సైబర్ నేరాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. ముఖ్యంగా సెలబ్రిటీల పేరు, ఫోటోలు, వాయిస్‌ను అనుమతి లేకుండా వాడుతూ డీప్‌ఫేక్ వీడియోలు తయారు చేయడం ఇటీవలి కాలంలో తీవ్ర ఆందోళనకు దారి తీస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్ డీప్ ఫేక్ బరిన పడ్డారు. దీంతో ఈ అంశంపై గట్టి చర్యలకు దిగారు. ఇంతకీ ఏం జరిగిందంటే?
ఏఐతో 'ఫేక్ సినిమా'..
అకీరా నందన్ అనుమతి లేకుండా ఏఐ సాయంతో ఏకంగా 56 నిమిషాల పాటు ఒక వీడియోను 'సినిమా' రూపంలో రూపొందించి యూట్యూబ్‌లో విడుదల చేయడం కలకలం రేపింది. ఈ వీడియోలో అకీరా నందన్‌ను హీరోగా చూపిస్తూ లవ్ స్టోరీ పేరిట తప్పుడు కంటెంట్ క్రియేట్ చేయడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై కాకినాడ రూరల్ సర్పవరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది.

నిందితుడి అరెస్ట్
ఫిర్యాదు అందుకున్న పోలీసులు వేగంగా స్పందించారు. అకీరా నందన్‌ను లక్ష్యంగా చేసుకుని డీప్‌ఫేక్ వీడియో తయారు చేసిన నిందితుడిని గంటల వ్యవధిలోనే అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ మద్దినేని వెంకటరమణగా నిందితుడిని గుర్తించారు. వైద్య వృత్తికి దూరంగా ఉన్న అతడు ఏఐ టెక్నాలజీని ఉపయోగించి అకీరా నందన్‌పై అనుమతి లేకుండా వీడియో రూపొందించినట్లు పోలీసులు తేల్చారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించారు. ఈ కేసులో మరెవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.
హైకోర్టులో అకీరా నందన్ పిటిషన్
మరోవైపు ఈ వ్యవహారంపై అకీరా నందన్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన పేరు, ఫేస్, వాయిస్‌ను ఏఐ ద్వారా దుర్వినియోగం చేయడాన్ని వెంటనే నిలిపివేయాలని, ఇప్పటికే సోషల్ మీడియాలో ఉన్న కంటెంట్‌ను తొలగించాలని కోర్టును కోరారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి డీప్‌ఫేక్ కంటెంట్ క్రియేట్ చేయకుండా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అలాగే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు, డిజిటల్ కంటెంట్ క్రియేటర్లపై కఠిన నియంత్రణ చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.
ఇంతకుముందు పవన్ కళ్యాణ్‌తో పాటు నాగార్జున, ఐశ్వర్యారాయ్, అభిషేక్ బచ్చన్, అమితాబ్ బచ్చన్, కరణ్ జోహార్, అనిల్ కపూర్, సునీల్ గావస్కర్ వంటి పలువురు ప్రముఖులు కూడా డీప్‌ఫేక్ వీడియోలపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తాజాగా డిప్యూటీ సీఎం కుమారుడినే టార్గెట్ చేయడంతో సెలబ్రిటీల కుటుంబ సభ్యుల భద్రతపై మరోసారి దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది.
ఈ నేపథ్యంలో పోలీసులు ప్రజలకు కీలక సూచనలు చేస్తున్నారు. డీప్‌ఫేక్ కంటెంట్‌ను నమ్మవద్దని, షేర్ చేయవద్దని, అనుమానాస్పద వీడియోలు కనిపిస్తే వెంటనే పోలీసులకు లేదా సైబర్ క్రైమ్ విభాగానికి సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. ఏఐ టెక్నాలజీని దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేస్తున్నారు. ఈ ఘటనతో మరోసారి డిప్ ఫేక్ అంశం, సెలబ్రెటీల పర్సనల్ రైట్స్ పై చర్చ ప్రారంభమైంది.


Click it and Unblock the Notifications











