వారాహి విజయ యాత్రకు పవన్ కల్యాణ్ శ్రీకారం.. విప్లవ వీరుడు చేగువీరా పుట్టిన రోజే ఎందుకంటే?
గోదావరి జిల్లాలో వారాహి యాత్ర నేపథ్యంలో జనసేన పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బుధవారం అన్నవరం రత్నగిరిపై కొలువైన శ్రీ సత్యదేవుని దర్శించుకొన్న అనంతరం భక్తిశ్రద్దలతో పూజలు నిర్వహించారు. జనసేన వారాహి విజయ యాత్ర ఈ ప్రాంతం నుంచే ప్రారంభమవుతున్న నేపథ్యంలో శ్రీ స్వామి వారి దర్శనంతో యాత్రకు శ్రీకారం చుట్టారు. పవన్ కళ్యాణ్ దేవుని దర్శనం కోసం వస్తున్నారని తెలుసుకుని జనసేన కార్యకర్తలు, వీర మహిళలు, అభిమానులు అశేషంగా కొండ వద్ద బారులు తీరారు. ఈ యాత్రకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
అన్నవరంలోని ఆలయానికి ఉదయం 10 గంటలకు రత్నగిరి శ్రీ సత్యదేవుని సన్నిధికి పవన్ కల్యాణ్ చేరుకొన్నారు. తొలుత సత్యదేవుని సన్నిధిలోని త్రిమూర్తులకు, ఆ తర్వాత సత్యదేవుడి పాదాల చెంత స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామి వారికి తన మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ధ్వజస్తంభం సమీపంలో ఆలయ అర్చకులు పవన్ కళ్యాణ్‌కు వేదాశీర్వచనాలు అందచేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ సత్యదేవుని పటం అందించారు.

విప్లవ వీరుడు చేగువీరా పుట్టిన రోజునే పవణ్ కల్యాణ్ వరాహి యాత్రను గోదావరి జిల్లాలో ప్రారంభించడం విశేషంగా మారింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని నేతలు, కార్యకర్తలు మాట్లాడుతూ.. బానిస సంకెళ్లను తెంచే ఆలోచనలకు భౌగోళిక హద్దులుండవు.. విశ్వ మానవుడిగా నీవు మారితే సమస్త మానవాళి ఆక్రందనలు నీకు వినిపిస్తాయి అని క్యూబా విప్లవ యోధుడు చేగువేరా పిలుపునిచ్చారు. అర్జెంటీనాలో పుట్టి, క్యూబా దేశంలో బానిసత్వపు నీడలో మగ్గిపోతున్న పీడిత ప్రజల పక్షాన గెరిల్లా పోరాటం చేసి, తుదకు బొలీవియా పోరాటంలో వీర మరణం పొందిన చేగువేరా స్ఫూర్తి సదా స్ఫూర్తిదాయకం అని అన్నారు.

చేగువీరా గురించి పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ఆయనలోని యోధుడిని నేను ప్రత్యేకంగా అభిమానిస్తాను. చేగువేరా జయంతి అయిన నేడు, జనసేన వారాహి విజయ యాత్రను మొదలుపెట్టడం యాధృచికం. ప్రజా పోరాటాల్లో జనసేన పార్టీకు ఆ విప్లవ యోధుడి తెగువే స్ఫూర్తి. జయంతి సందర్బంగా చేగువేరాకు నా తరఫున, జనసేన పార్టీ పక్షాన విప్లవ నివాళులర్పిస్తున్నాను అని పవన్ కల్యాన్ పేర్కొన్నారు.

పవన్ కల్యాణ్ వారాహి యాత్ర ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రత్తిపాడు నియోజకవర్గంతో మొదలుపెట్టి, పిఠాపురం, కాకినాడ, కాకినాడ రూరల్, ముమ్మిడివరం, అమలాపురం, పీ గన్నవరం, రాజోలు తర్వాత నరసాపురం, పాలకొల్లు, భీమవరం నియోజకవర్గాల్లో యాత్ర ఉంటుంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఇతర నియోజకవర్గాల్లో యాత్ర రూట్ మ్యాప్ ను స్థానిక పార్టీ నేతలు చర్చించి ఖరారు చేస్తారు. 11 నియోజకవర్గాల్లో మొదటిగా యాత్ర జరగనున్నది.


Click it and Unblock the Notifications