పవన్ కళ్యాణ్‌కు సర్జరీ... ఏపీ డిప్యూటీ సీఎంకి అసలేమైంది? మోడీ, చంద్రబాబు ఆరా
జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు సర్జరీ జరిగింది. ఈ మేరకు జనసేన పార్టీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. శుక్రవారం ఉదయం వివిధ శాఖల అధికారులతో పాలనాపరమైన అంశాలపై చర్చిస్తుండగా పవన్ కళ్యాణ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దాంతో అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకుని హుటాహుటిన హాస్పిటల్‌కు వెళ్లారు. ఆయనకు అక్కడ వైద్య పరీక్షలతో పాటు ఎంఆర్ఐ కూడా నిర్వహించారు.
వైద్యుల సలహా మేరకు శనివారం సాయంత్రం పవన్ కళ్యాణ్‌కు శస్త్రచికిత్స నిర్వహించారు. వారం నుంచి 10 రోజులపాటు విశ్రాంతి తర్వాత ఆయన అధికారిక కార్యక్రమాలలో పాల్గొనవచ్చని డాక్టర్లు తెలిపారు. అయితే దీర్ఘకాలం ఆయన తగిన జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుందని, పూర్తి స్వస్థత చేకూరడానికి ఎక్కువ కాలం పడుతుందని డాక్టర్లు చెప్పినట్లుగా జనసేన పార్టీ వెల్లడించింది. పవన్ కళ్యాణ్‌కు సర్జరీ నేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్ధితిపై పలువురు ప్రముఖులతో పాటు అభిమానులు, జనసేన కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. అయితే ఆయనకు ఏమైంది? ఎలాంటి సర్జరీ చేశారన్న వివరాలు మాత్రం జనసేన పార్టీ వెల్లడించలేదు.

పవన్‌కు సర్జరీ విషయం తెలుసుకున్న ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆయనతో మాట్లాడి ఆరోగ్యంపై ఆరా తీశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నాను. వారు అసాధారణమైన ధైర్యశాలి, ఆయన త్వరలోనే కోలుకుంటారని నాకు పూర్తి నమ్మకం ఉందని ప్రధాని ట్వీట్ చేశారు.
అటు టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పవన్ కళ్యాణ్ ఆరోగ్య వివరాలను తెలుసుకున్నారు. ఈ మేరకు ఆయన కూడా ట్వీట్ చేశారు. శస్త్ర చికిత్స అనంతరం పవన్ కళ్యాణ్ గారు కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా.. ఆయన త్వరగా శక్తిని పుంజుకుని, మనుపటి కంటే మరింత ఆరోగ్యంగా తిరిగి రావాలని ఆశిస్తున్నానని చంద్రబాబు ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఇకపోతే.. పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికి వస్తే.. గతేడాది హరిహర వీరమల్లు, ఓజీ సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన ఆయన ఇటీవల ఉగాదికి ఉస్తాద్ భగత్ సింగ్‌తో అలరించారు. ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఓ సినిమా చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇందుకోసం బాగా గడ్డం పెంచి, స్టైలీష్ లుక్‌లో ఆకట్టుకుంటున్నారు పవన్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్‌లో సురేందర్ రెడ్డి బిజీగా ఉన్నట్లుగా తెలుస్తోంది. పూర్తి స్థాయిలో స్క్రిప్ట్ రెడీ చేసి త్వరలోనే సెట్స్ మీదకి ఈ సినిమాను తీసుకెళ్లాలని సురేందర్ రెడ్డి భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్లానింగ్‌తో అనుకున్న టైకి సినిమాను కంప్లీట్ చేసే వారికి ఖచ్చితంగా అవకాశం ఇస్తానని ఉస్తాద్ భగత్ సింగ్ ఈవెంట్‌లో పవన్ తెలిపిన సంగతి తెలిసిందే.
దీనితో పాటు ఓజీ 2ని సెట్స్ మీదకి తీసుకెళ్తారని గాసిప్స్ వైరల్ అయ్యాయి. అయితే ఈ వార్తలను పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ ఖండించింది. పవన్ ప్రస్తుతానికి ఎలాంటి కొత్త సినిమానీ అంగీకరించలేదు. ఏ ప్రాజెక్ట్ అయినా సరే అధికారికంగానే ప్రకటిస్తాం.. ఓజీ 2 గురించి పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రకటిస్తారని పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ పేర్కొంది.


Click it and Unblock the Notifications
