మీనాక్షిగా సౌజన్య చూస్తే అమ్మవారిని చూసినట్లనిపించింది.. తివ్రిక్రమ్ సతీమణి నృత్యరూపకంపై పవన్ కల్యాణ్ ప్రశంసల
కూచిపూడి నృత్యకారిణి, దర్శకుడు, రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమణి సౌజన్యా శ్రీనివాస్, ఆమె బృందం హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలోప్రదర్శించిన 'మీనాక్షి కల్యాణం' అనే నృత్య రూపకానికి ఆద్యంతం వీక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా మంత్రముగ్దుల్ని చేసింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ ఈ నృత్య రూపకాన్ని సమర్పించాయి.

మీనాక్షి కల్యాణం ఈవెంట్‌కు ప్రముఖ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్, సీనియర్ నటుడు, రచయిత తనికెళ్ల భరణి, నిర్మాతలు ఎస్. రాధాకృష్ణ, సూర్యదేవర నాగవంశీ, తెలంగాణ బాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత వసంతలక్ష్మి నరసింహాచారి, సంగీత దర్శకుడు తమన్ హాజరయ్యారు. అనిందిత మీడియా నిర్వహించిన ఈ కార్యక్రమంలో పారిశ్రామికవేత్తలు చుక్కపల్లి సురేష్, కె. సతీష్‌చంద్ర గుప్త తదితరులు పాల్గొన్నారు.
భమిడిపల్లి నరసింహమూర్తి రచించిన ఈ నృత్య రూపకానికి పేరుపొందిన నాట్యకారుడు పసుమర్తి రామలింగశాస్త్రి నృత్యాలు సమకూర్చగా, డీవీఎస్ శాస్త్రి సంగీతం అందించారు. మీనాక్షి, సుందరేశ్వరుల కల్యాణం వెనుక ఉన్న అద్భుతమైన గాథను ఈ రూపకం ద్వారా ప్రదర్శించారు. పార్వతిగా, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి తన భక్తురాలు విద్యావతికి పుట్టిన మీనాక్షిగా సౌజన్యా శ్రీనివాస్ ప్రదర్శించిన అభినయం, చేసిన నాట్యం ఆహూతులను అమితంగా ఆకట్టుకున్నాయి.
మీనాక్షి కల్యాణం నృత్య రూపకం ముగిసిన అనంతరం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, "సౌజన్యా శ్రీనివాస్ ప్రదర్శించిన 'మీనాక్షి కల్యాణం'ను స్టేజి మీద చూసే అవకాశం కలగడం నాకు లభించిన గౌరవంగా భావిస్తున్నాను. రచయిత భమిడిపల్లి నరసింహమూర్తి గారికీ, నాట్యకారులు పసుమర్తి రామలింగ శాస్త్రి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. పసుమర్తిగారు నృత్యాలు సమకూర్చిన నాట్య ప్రదర్శన చూడటం ఇది నాకు రెండోసారి. ఈ వేదిక (శిల్పకళావేదిక)పై సాధారణంగా సినిమా ఫంక్షన్స్ జరుగుతుంటాయనుకుంటాను. అయినప్పటికీ ఈ నృత్య రూపకానికి ప్రేక్షకుల స్పందన చూసి నాకు చాలా ఆశ్చర్యం వేసింది. మన మూలాలు, సంప్రదాయాలను గుర్తుంచుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం. మన సంస్కృతి, సంప్రదాయాలను, కళలను గౌరవించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కూచిపూడి లాంటి సంప్రదాయ కళలను పరిరక్షించుకొని భావితరాలకు అందించాలన్నారు.
ఈ సందర్భంగా మొత్తం బృందానికి అభినందనలు తెలియజేస్తున్నాను. మీనాక్షి పాత్రలో సౌజన్య చూస్తుంటే నిజంగా అమ్మవారిని చూసినట్లు అనిపించిందన్నారు.ఆ దేవుళ్లే మన ముందుకు వచ్చి నాట్యం చేశారా అనేటటువంటి అనుభూతి కలిగింది" అన్నారు.


Click it and Unblock the Notifications











