హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. వేదిక ఎక్కడ? చీఫ్ గెస్ట్ ఎవరంటే?
టాలీవుడ్‌లో నెంబర్‌వన్ పొజిషన్‌లో ఉండి, కోట్లు సంపాదించే అవకాశంలో ఉండి కూడా ప్రజల కోసం కెరీర్‌ను పక్కనపెట్టారు పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్. జనసేన పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి దూకిన పవన్ తొలుత.. సినిమాలు, రాజకీయాలను బ్యాలెన్స్‌గా నడిపించారు. ఇలా అయితే కష్టమని గ్రహించిన ఆయన సినిమాలను పూర్తిగా పక్కనపెట్టి రాజకీయాలకే అంకితమై చివరికి తన లక్ష్యాన్ని సాధించారు. పవన్ ఎమ్మెల్యేగా గెలిచి, డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టినా ఫ్యాన్స్ బాగా నిరాశపడ్డారు. వెండితెరపై ఆయనను చూడలేమని అనుకున్నారు. వారి కోరిక తీర్చేందుకు గాను చేతిలో ఉన్న సినిమాలు పూర్తి చేయాలని పవర్‌స్టార్ భావించారు. దీనిలో భాగంగా హరిహర వీరమల్లును సిద్ధం చేశారు.
పవన్ కళ్యాణ్ చేతిలో మూడు సినిమాలు
పవన్ కళ్యాణ్ పూర్తిగా రాజకీయాల్లోకి వెళ్లడానికి ముందు ఆయన చేతిలో హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు ఉన్నాయి. వీటిలో వీరమల్లు అన్నింటి కంటే ముందు మొదలైంది. కరోనా, లాక్‌డౌన్, పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ కావడంతో వీరమల్లు బాగా ఆలస్యమైంది. మధ్యలో తను కమిటైన సినిమాలు పూర్తి చేయాలని పవన్ భావించినప్పటికీ డిప్యూటీ సీఎం హోదాలో ఉండి సినిమాలు చేస్తే తానే ప్రతిపక్షాలకి అవకాశం ఇచ్చినట్లు అవుతుందని ఆయన వెనక్కి తగ్గారు.

హరిహర వీరమల్లును కంప్లీట్ చేసిన పవన్
ప్రస్తుతం పరిస్ధితులన్నీ చక్కబడటంతో ముందుగా హరిహర వీరమల్లును కంప్లీట్ చేశారు పవన్ కళ్యాణ్. పగలు ప్రభుత్వ కార్యక్రమాలు, ఇతర వ్యవహారాలు చూసుకుంటూ రాత్రుళ్లు సినిమా పనిపట్టారు. ఖాళీ ఉన్నప్పుడల్లా సెట్‌లో వాలిపోయిన పవర్‌స్టార్ సినిమా షూటింగ్‌ను ఫినిష్ చేశారు. ఇక నాలుగు గంటలు ఏకధాటిగా డబ్బింగ్ చెప్పి వృత్తిపై, సినిమాపై తనకున్న అంకిత భావాన్ని చాటుకున్నారు. అన్ని అవాంతరాలను దాటుకుని హరిహర వీరమల్లు పార్ట్ 1 ఈ జూన్ 12న పాన్ ఇండియా స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.
జూన్ 12న హరిహర వీరమల్లు విడుదల
హరిహర వీరమల్లును మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం 200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా అనసూయ భరద్వాజ్ ఓ స్పెషల్ సాంగ్‌లో మెరిశారు. బాబీ డియోల్, ఫర్గీస్ నక్రీ, నోరా ఫతేహి, సత్యరాజ్. విక్రమ్‌జిత్, జిషుసేన్ గుప్తా, సచిన్ ఖేడేకర్ తదితరులు కీలపాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ విజేత ఎంఎం కీరవాణి ఈ సినిమాకు స్వరాలు సమకూరుస్తుండగా.. జ్ఞాన శేఖర్ వీఎస్, మనోజ్ పరమహంసలు సినిమాటోగ్రాఫర్లుగా వ్యవహరిస్తున్నారు. తొలుత ఈ సినిమాను క్రిష్ జాగర్లమూడి టేకప్ చేయగా అనివార్య కారణాలతో ఆయన తప్పుకుని జ్యోతికృష్ణ సీన్‌లోకి వచ్చారు.
హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక ఇదే
ఇదిలాఉండగా.. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషనల్ కార్యక్రమాలను వేగవంతం చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. అయితే ఇంతకీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడ? ఏపీలోనా? తెలంగాణాలోనా? చీఫ్ గెస్ట్ ఎవరు? అంటూ పవన్ ఫ్యాన్స్ తెగ ప్రశ్నిస్తున్నారు. దీనికి చిత్ర యూనిట్ చెక్ పెట్టనుంది. చెన్నైలో ఇటీవల వీరమల్లులోని ఓ పాటను రిలీజ్ చేసిన టీమ్.. తిరుపతిలోని ఎస్వీయూ తారకరామ గ్రౌండ్స్‌లో ఈ నెల 8న ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. దానికి ముందే రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుపతికి చేరుకుని తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. అయితే హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్ ఎవరన్ని ఇంకా తేలాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











