HariHara VeeraMallu Part 2: హరిహర వీరమల్లుకు సీక్వెల్.. పార్ట్ 2 టైటిల్ ఇదే!
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం హరిహర వీరమల్లు. దాదాపు ఐదేళ్ల పాటు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోని, ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి హరిహర వీరమల్లును ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు మేకర్స్. జూలై 24న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా పాజిటివ్ రివ్యూలు, మౌత్‌టాక్‌తో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. గత కొద్దినెలలుగా డల్‌గా ఉన్న థియేటర్లు.. వీరమల్లు రాకతో సందడి వాతావరణం నెలకొంది. జూలై 23న తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల్లో ప్రీమియర్స్ పడటంతో తెల్లార్లు పండగ వాతావరణం కనిపించింది. భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు, బ్యానర్లు, డ్యాన్స్‌లతో పవన్ అభిమానులు సందడి చేశారు.
కష్టపడి వీరమల్లును పూర్తి చేసిన పవన్
దాదాపు ఐదేళ్ల పాటు చడీ చప్పుడు లేకుండా, అసలు సినిమా విడుదలవుతుందా లేదా అన్న అనుమానాలు కలిగించింది హరిహర వీరమల్లు. ఈ సినిమాకు శ్రీకారం చుట్టిన డైరెక్టర్ క్రిష్ మధ్యలోనే తప్పుకోవడంతో పలు అనుమానాలతో పాటు వీరమల్లుపై భారీగా ట్రోలింగ్ జరిగింది. వీటన్నింటిని పటాపంచలు చేస్తూ పవన్ కళ్యాణ్ అన్ని రకాలుగా సినిమాను నిలబెట్టారు. జ్యోతికృష్ణకు దర్శకత్వ బాధ్యతలు అప్పగించి వెనుకుండి నడిపించారు. డిప్యూటీ సీఎంగా బిజీగా ఉన్నప్పటికీ సినిమాను త్వరగా పూర్తి చేసి నిర్మాతను ఆదుకోవాలనే ఉద్దేశంతో వీలున్నప్పుడల్లా షూటింగ్‌లో పాల్గొని వీరమల్లును పూర్తి చేశారు పవన్ కళ్యాణ్.

హరిహర వీరమల్లు బడ్జెట్ ఎంత?
హరిహర వీరమల్లులో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించారు. ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ దర్శకత్వం వహించారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం సుమారు 250 కోట్ల రూపాయల బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు. యానిమల్ ఫేమ్ బాబీ డియోల్, నర్గీస్ ఫక్రీ, నోరా ఫతేహి తదితరులు నటించారు. సత్యరాజ్, జిషుసేన్ గుప్తా, పూజిత పొన్నాడ, సచిన్ ఖేడేకర్, అనుపమ్ ఖేర్ తదితరులు కీలకపాత్ర పోషించారు. ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి స్వరాలు అందించగా.. వీఎస్ జ్ఞాన శంకర్, మనోజ్ పరమహంస సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు.
రెండు భాగాలుగా హరిహర వీరమల్లు
సినిమా సెట్స్ మీదకి వెళ్లినప్పుడే హరిహర వీరమల్లును రెండు భాగాలుగా విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. తొలి భాగం జూలై 24న విడుదల కాగా.. పార్ట్ 2 ఎప్పుడు రిలీజ్ అవుతుందంటూ అప్పుడే అభిమానులు డిస్కషన్ మొదలుపెట్టారు. హరిహర వీరమల్లు పార్ట్ 2పై పవన్ కళ్యాణ్ సైతం స్పందించారు. ఇప్పటికే పార్ట్ 2 షూటింగ్ 20 నుంచి 30 శాతం పూర్తయ్యిందని తెలిపారు. దీంతో పార్ట్ 2 ఎలా ఉండబోతోంది అన్న ఉత్కంఠ నెలకొంది. అసలు హరిహర వీరమల్లు పార్ట్ 2 టైటిల్ ఏంటీ? అన్న చర్చ కూడా జరుగుతోంది. దీనికి ఈ సినిమాలోనే మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.
పార్ట్ 2 టైటిల్ ఇదే
పార్ట్ 1 క్లైమాక్స్‌లో ఢిల్లీకి బయల్దేరిన వీరమల్లును అడ్డుకునేందుకు ఔరంగజేబ్ సిద్ధమవుతాడు. ఇద్దరి మధ్య భారీ పోరు ఖాయమని అనుకునేలోపే సినిమాకు శుభం కార్డ్ వేసేసారు. దీనికి ముందు హరిహర వీరమల్లు : యుద్ధభూమి అనే టైటిల్‌తో ఎండ్ కార్డ్ పడుతుంది. అసలైన యుద్ధం అప్పుడే చూడాలి అంటూ ప్రేక్షకుల్ని సస్పెన్స్‌లో పెట్టారు. కోహినూర్ వజ్రాన్ని దొంగిలించి తీసుకొచ్చే క్రమంలో వీరమల్లును ఔరంగజేబు ఎలా ఎదుర్కొన్నాడు? వీరిద్దరి మధ్య పోరాట సన్నివేశాలను సెకండ్ పార్ట్‌లో చూపించనున్నారు. ప్రస్తుతం హరిహర వీరమల్లు పార్ట్ 2 టైటిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











