Peddi Pehelwan Glimpse Review: ఆటే నా పొగరు.. పెద్ది పహిల్వాన్‌గా రామ్ చరణ్ విశ్వరూపం
బుచ్చిబాబు సానా దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న మూవీ పెద్ది. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్ కుమార్, టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతిబాబులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. రామ్ చరణ్ పుట్టినరోజు, శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని పెద్ది సినిమా నుంచి పెద్ది పహిల్వాన్ గ్లింప్స్ విడుదల చేశారు మేకర్స్. ఇది ఎలా ఉంది? అభిమానులను అలరించిందా లేదా? అనేది పరిశీలిస్తే..
వృద్ది సినిమాస్, ఐవీవై ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్‌పై కిలారు వెంకట సతీష్, ఇషాన్ సక్సేనాలు పెద్ది సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దివ్యెందు శర్మ, విజి చంద్రశేఖర్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ విజేత, మ్యూజిక్ మ్యాస్ట్రో ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. రత్నవేలు కెమెరామెన్‌గా, నవీన్ నూలీ ఎడిటర్‌గా సేవలందిస్తున్నారు. జానీ మాస్టర్ కొరియోగ్రఫి అందిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్‌లు సమర్పిస్తున్నాయి. ఏప్రిల్ 30వ తేదీన పెద్ది సినిమా వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది.

రామ్ చరణ్ తన పాత్ర కోసం ఎలా ట్రాన్స్‌ఫార్మ్ అయినది ఈ గ్లింప్స్‌లో చూపించారు. సిక్స్ ప్యాక్ బాడీతో రగ్గ్‌డ్ లుక్‌లో చెర్రీ అసలు సిసలు పహిల్వాన్‌లా కనిపించారు. ఆంజనేయుడిలా గాధ, వ్యాయామానికి ఉపయోగించే భారీ ఆయుధంతో చరణ్ కుస్తీ కోసం కసరత్తు చేయడం, ఆవేశంగా ప్రత్యర్ధులపైకి దూసుకెళ్లే సీన్‌ను అద్భుతంగా చిత్రీకరించారు దర్శకుడు బుచ్చిబాబు సానా. ఈ గ్లింప్స్‌లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది రామ్ చరణ్ పలికిన డైలాగ్స్. కుస్తీ అంటే బంతితో బ్యాట్‌కు ఎదురెళ్లే ఆట కాదురా.. ప్రాణంతో చావుకు ఎదురెళ్లే ఆట. చూడమ్మీ.. ఆటే నా పొగరు అంటూ చివరిలో చరణ్ చెప్పే డైలాగ్ అభిమానులపై హైప్‌ని పెంచేసింది.
రత్నవేలు సినిమాటోగ్రఫి చాలా రిచ్‌గా ఉండగా.. ఏఆర్ రెహమాన్ అందించిన నేపథ్య సంగీతం అదిరిపోయింది. ఇప్పటి వరకు పెద్ది సినిమా క్రికెట్ బ్యాక్‌గ్రౌండ్‌లో తెరకెక్కే సినిమా అని ప్రేక్షకులు భావించగా.. తాజాగా గ్లింప్స్‌తో పెద్ది కథ, హీరో క్యారెక్టర్‌పై క్లారిటీ ఇచ్చారు బుచ్చిబాబు. చూస్తుంటే రామ్ చరణ్ కెరీర్‌లోనే ఈ సినిమా డిఫరెంట్‌గా, ఒక మైల్ స్టోన్‌గా నిలిచిపోతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మాస్ లుక్‌లో రామ్ చరణ్, పాటలు, గ్రామీణ వాతావరణం, స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ ఈ పెద్ది సినిమాపై అంచనాలను పెంచేసింది.
రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ఈ మూవీ షూటింగ్‌ను పరుగులు పెట్టిస్తున్నాడు బుచ్చిబాబు. ఇటీవల పెద్ది షూటింగ్ సమయంలో రామ్ చరణ్ ఎడమ కంటికి గాయమైంది. దాంతో వైద్యులు సర్జరీ చేయించుకున్నారు. ఇంతటి బాధలోనూ ఆయన గంటలు తిరిగేసరికి షూటింగ్ సెట్‌లో పాల్గొన్నారు రామ్ చరణ్. ఇది వృత్తిపై ఆయన అంకిత భావాన్ని చాటుకున్నారు. అలాగే తన గాయంపై వస్తున్న వార్తలకు కూడా మెగా పవర్ స్టార్ చెక్ పెట్టారు. చెర్రీని చూసేందుకు అభిమానులు పెద్ది సెట్‌కు పెద్ద ఎత్తున పోటెత్తారు. చరణ్ వారందరితో మాట్లాడి సెల్ఫీలు దిగారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.


Click it and Unblock the Notifications
















