Peddi: రియల్ స్టోరీతో పెద్ది.. రామ్ చరణ్ క్యారెక్టర్‌కు అతడే ఇన్‌స్పిరేషన్!
టాలీవుడ్‌లో భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న సినిమాల్లో 'పెద్ది' ఒకటి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా, 'ఉప్పెన'తో సంచలన విజయాన్ని అందుకున్న బుచ్చి బాబు సనా (Buchi Babu Sana) దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాపై ఇప్పటికే ఇండస్ట్రీలో భారీ హైప్ నెలకొంది. ముఖ్యంగా గత కొన్ని నెలలుగా బాక్సాఫీస్ వద్ద పెద్ద సినిమాల లేమి కనిపిస్తున్న నేపథ్యంలో, ఈ సినిమా రిలీజ్ కోసం ప్రేక్షకులు, ట్రేడ్ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఈ సినిమా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది.
ఇక రిలీజ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ, మూవీ మేకర్స్ ప్రమోషన్ల జోరు పెంచుతున్నారు. ఇప్పటికే ఆర్ట్ డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్, ఫైట్ మాస్టర్లు మీడియాతో మాట్లాడి సినిమాపై ఆసక్తికర విషయాలను పంచుకోగా, ఇప్పుడు స్వయంగా దర్శకుడు బుచ్చిబాబు రంగంలోకి దిగడం సినిమాపై మరింత హైప్ తీసుకొచ్చింది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో 'పెద్ది' కథ వెనుక ఉన్న అసలు స్ఫూర్తి గురించి ఆయన చెప్పిన విషయాలు ఆసక్తికరంగా మారాయి.

ఇటీవల బుచ్చిబాబు ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ క్రమంలో పెద్ది సినిమా అసలు బ్యాక్ డ్రాప్ ఏంటో వివరించారు. తన స్వగ్రామంలో 'పెద్ది రాజు' అనే ఒక యువకుడు ఉండేవాడట. అతను సాధారణంగా కూలి పనులు చేస్తూ జీవనం సాగించేవాడు. అయితే అతనికి క్రీడలపై అసాధారణ ప్రతిభ ఉండేదని దర్శకుడు వెల్లడించాడు. ముఖ్యంగా క్రికెట్, వాలీబాల్ వంటి ఆటల్లో అతను అద్భుతంగా ఆడేవాడని, మ్యాచ్‌ల సమయంలో పని మాన్పించి మరీ అతడిని తీసుకెళ్లి ఆడించేవాళ్లమని గుర్తుచేసుకున్నాడు. అతని ప్రతిభకు ఆకర్షితులై, కొన్నిసార్లు డబ్బులు కూడా ఇచ్చి మ్యాచ్‌లలో పాల్గొనేవాళ్లమని తెలిపారు.
ఆ యువకుడు ఒంటిచేత్తో మ్యాచ్‌లను గెలిపించే స్థాయిలో ప్రతిభ చూపేవాడని, అతన్ని చూసినప్పుడల్లా "ఇదో గొప్ప కథ అవుతుంది" అన్న భావన కలిగేదని బుచ్చిబాబు వెల్లడించాడు. అదే ఆలోచన నుంచి 'పెద్ది' పాత్ర పుట్టిందని, పూర్తిగా అతని జీవితం నుంచి స్ఫూర్తి తీసుకుని కథను నిర్మించానని చెప్పారు. ఇక ఈ కథ రూపుదిద్దుకున్న విధానం కూడా ఆసక్తికరమే. తన గురువు సుకుమార్ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత, ఒక ఆలయంలో కూర్చొని ఈ కథను పూర్తి చేశానని బుచ్చిబాబు తెలిపాడు.
"ఈ కథను రామ్ చరణ్ ఎలాంటి మార్పులు లేకుండా ఒప్పుకోవాలి" అని దేవుడిని కోరుకున్నానని, తాను కోరుకున్నట్లే చరణ్ ఒక్క కరెక్షన్ కూడా చెప్పకుండా కథను అంగీకరించాడని చెప్పాడు. ఇక సినిమాలో రామ్ చరణ్ పాత్ర గురించి మాట్లాడుతూ, ఆయన ఒక బెల్లం ఫ్యాక్టరీలో పని చేసే సాధారణ కుర్రాడిగా కనిపిస్తాడని వివరించాడు. అయితే ఆ పాత్రలో ఉన్న భావోద్వేగాలు, పోరాటం, మాస్ ఎలిమెంట్స్ అన్ని కలిపి చరణ్ పెర్ఫార్మెన్స్‌ను మరో స్థాయికి తీసుకెళ్తాయని నమ్మకం వ్యక్తం చేశాడు. "ఇలాంటి పాత్రలో చరణ్‌ను మళ్లీ చూడడం కష్టం. నేను కూడా ఇలాంటి కథను మళ్లీ రాయలేను" అని దర్శకుడు చెప్పడం సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది.
మొత్తంగా చూస్తే, 'పెద్ది' ఒక సాధారణ కథ కాకుండా, నిజ జీవితానికి దగ్గరగా ఉన్న భావోద్వేగాల సమ్మేళనంగా తెరకెక్కిన సినిమా అని స్పష్టమవుతోంది. రియల్ లైఫ్ ఇన్‌స్పిరేషన్‌తో రూపొందిన ఈ కథ, మాస్ ఎలిమెంట్స్‌తో కలిసిపోతే బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పుడు ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications




