పెద్దిని అడ్డుకుంటే ఆమరణ నిరాహార దీక్ష చేస్తా.. నిర్మాత స్ట్రాంగ్ వార్నింగ్
తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం పెను సంక్షోభంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. పరిశ్రమకు కీలకమైన వేసవి సీజన్‌లో పెద్ద సినిమాల రిలీజ్‌లు లేక థియేటర్‌లను మూసివేసే పరిస్థితి నెలకొంది. పెద్ద సినిమాలన్నీ ఒక్కొక్కటిగా వాయిదాపడుతూ రావడం ఇండస్ట్రీని కుదిపేస్తోంది. సరిగ్గా ఇదే సమయంలో ఎగ్జిబిటర్లు, నిర్మాతల మధ్య పర్సంటేజ్ వివాదం తారాస్థాయికి చేరుకుంది. కొద్దిరోజుల క్రితం ఈ రచ్చ కారణంగా సినిమా థియేటర్లు బంద్ పాటించే పరిస్ధితులు తలెత్తడంతో సినీ పెద్దలు రంగంలోకి దిగి పరిస్ధితిని చక్కదిద్దారు. అయితే తాజాగా పర్సంటేజ్ వివాదం మళ్లీ మొదటికొచ్చింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది రిలీజ్‌కు ముందు ఈ వివాదం రేగడంతో నిర్మాతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
ఇటీవల పర్సంటేజ్ విధానం అమలుకు సంబంధించి 21 మందితో సబ్ కమిటీ ఏర్పాటు చేసినంది ఫిలిం ఛాంబర్. కమిటీ నివేదికను బట్టి పర్సంటేజ్ విధానం అమలు చేయడంపై నిర్ణయం తీసుకుంటామని నిర్మాతలు దిల్‌రాజు, సీ కళ్యాణ్‌లు వెల్లడించారు. సమస్య సర్దుబాటు అయ్యిందని సంతోషించేలోగా.. శనివారం పర్సంటేజ్ విషయానికి సంబంధించి హైదరాబాద్‌లోని తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్‌లో ఎగ్జిబిటర్లు సమావేశమయ్యారు. తమకు పర్సంటేజ్ ఇవ్వాల్సిందేనని తేల్చిచెప్పారు. తమ డిమాండ్‌కు ఒప్పుకుంటేనే థియేటర్లలో సినిమాలను ప్రదర్శిస్తామని వెల్లడించారు. పర్సంటేజ్ విధానం అమలుకు సంబంధించి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కమిటీ పలు దపాలు చర్చలు జరిగాయని.. హరిహర వీరమల్లు సినిమా టైంలో సమస్యలను సినీ పెద్దలు దృష్టికి తీసుకురాగా.. పరిష్కరిస్తామని చెప్పారు. కానీ ఏడాది కావొస్తున్నా ఇంకా ఈ విషయంలో ఎలాంటి పరిష్కారం చూపలేదని ఎగ్జిబిటర్లు మండిపడుతున్నారు.

రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమాను తాము అడ్డుకోమని .. పాత విధానం ప్రకారమే రిలీజ్ చేసుకోవచ్చని చెప్పాం. అయితే పర్సంటేజ్ విధానం అమలుని అప్పుడు 3 వారాల్లో చేస్తామని చెప్పి.. ఇప్పుడు మరో 3 వారాలు వాయిదా వేస్తున్నారని ఎగ్జిబిటర్లు ఆరోపిస్తున్నారు. అందుకే ఇకపై పర్సంటేజ్ విధానం ప్రకారమే సినిమాలు ఆడిస్తామని.. పెద్ది సినిమా అయినా లేక మరేదైనా సినిమా అయినా సరే పర్సంటేజ్ ఇవ్వాల్సిందేనని ఎగ్జిబిటర్లు తేల్చేశారు. 15 ఏళ్ల క్రితం థియేటర్లకు మంచి ఆదాయం ఉండేది.. కానీ ఇప్పుడు ఎగ్జిబిటర్లకు రెవెన్యూ రావడం లేదు. కానీ నిర్మాతలు మాత్రం 14 రకాలుగా ఆదాయం పొందుతున్నారు. పెద్ది సినిమాను అడ్డుకుంటున్నామని, గతంలో హరిహర వీరమల్లు సినిమాను అడ్డుకుంటున్నామని కొందరు వదంతులు పుట్టిస్తున్నారు. మా సమస్యలన్నీ చిరంజీవి గారితో ప్రస్తావిస్తామని ఎగ్జిబిటర్లు తెలిపారు.
పెద్ది సినిమాకు ముందు ఈ పంచాయతీ నేపథ్యంలో నిర్మాత నట్టి కుమార్ ఘాటుగా స్పందించారు. ఎగ్జిబిటర్లు ఏ నిర్ణయం తీసుకుంటారో మంగళవారం రాత్రి వరకు ఎదురుచూస్తాం. ఒకవేళ ఏ నిర్ణయం తీసుకోకుండా పెద్ది సినిమాను ఆపాలని నిర్ణయం తీసుకుంటే బుధవారం నాడు 10 గంటలకు తెలుగు ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో ఆమరణ నిరాహార దీక్షకు నేను కూర్చొంటాను. పెద్ది సినిమా సెటిల్‌మెంట్‌కు సంబంధించి 26 రాత్రి నాటికి మీరు డెసిషన్ తీసుకోకపోతే నేను బుధవారం నాడు దీక్షకు కూర్చొంటాను. డిస్ట్రిబ్యూటర్ బాగుండాలి, ప్రొడ్యూసర్ బాగుండాలి. రూల్ పాస్ చేసినట్లుగా పర్సంటేజ్‌కు సంబంధించి ఒక శాశ్వత పరిష్కారం చూద్దామని నట్టి కుమార్ అన్నారు.
100 శాతం మీ అందరినీ చిరంజీవి గారి దగ్గర కూర్చోబెడతా, మాట్లాడిస్తా.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాయలసీమలోని ఒక్కో దగ్గరి నుంచి ఐదుగురు చొప్పున రండి.. నేను చిరంజీవి గారితో కూర్చోబెడతా, ఆయనతో మాట్లాడిస్తా. 100 శాతం సెట్ చేస్తా.. కానీ ఈ విధంగా మళ్లీ మీరు ఛాంబర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మీటింగ్ పెట్టడం అనేది కరెక్ట్ కాదేమో. ఇది ఎందుకు చెబుతున్నానంటే ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ అని చెప్పి అక్కడ మాట్లాడిన వారిలో లీజు ఓనర్స్ ఉన్నారు. వాళ్లని కూడా నేను తప్పుబట్టడం లేదు. దిల్‌రాజు గారు, సునీల్ గారు అందరూ కలిసి ఓ నిర్ణయం తీసుకున్నారు. ఛాంబర్‌లో సురేష్ బాబు గారు నిర్ణయం తీసుకున్నారు.. దానికి వ్యతిరేకంగా వెళ్లడం అనేది ఎంత వరకు కరెక్ట్ అని నట్టి కుమార్ ప్రశ్నించారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఎగ్జిబిటర్ల పర్సంటేజ్ సమస్యను సినీ పెద్దలు ఎలా పరిష్కరిస్తారో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications


