పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలుపుపై అనుమానమా? నా ఆస్తి మొత్తం పందెం, ఎవరికైనా దమ్ముందా? వర్మ బస్దీమే సవాల్!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో హాట్ టాపిక్‌గా మారిన సెగ్మెంట్ పిఠాపురం. టాలీవుడ్ అగ్ర కథానాయకుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేయడంతో ఈ నియోజకవర్గం పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. గత ఎన్నికల్లో గాజువాక, భీమవరం నుంచి పోటీ చేసిన జనసేనాని.. రెండు చోట్లా ఓడిపోయారు. ఈసారి మాత్రం వ్యూహాత్మకంగా పిఠాపురాన్ని ఎంచుకున్నారు. కాపు సామాజికవర్గంతో పాటు మెగాభిమానులు పెద్ద సంఖ్యలో ఉండటంతో బాగా ఆలోచించి పిఠాపురం నుంచి పవన్ బరిలో నిలిచారు.
ఆయన కోసం మెగా ఫ్యామిలీ, సినీ పరిశ్రమ కదిలొచ్చింది. నాగబాబు, వరుణ్ తేజ్, సాయిథరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, జానీ మాస్టర్, ఆర్కే సాగర్ తదితరులు ప్రచారం నిర్వహించారు. ఆయనను ఓడించేందుకు వైసీపీ అధినేత, సీఎం జగన్ సైతం అదే స్థాయిలో వ్యూహాలు అమలు చేశారు. కాకినాడ ఎంపీగా ఉన్న వంగా గీతను పిఠాపురంలో బరిలో నిలిపారు. క్లీన్ ఇమేజ్ ఉండటంతో పాటు కాపు సామాజికవర్గం, పైగా స్థానికురాలు కావడంతో గీత కూడా పవన్‌కు గట్టిపోటీ ఇచ్చారని విశ్లేషకులు అంటున్నారు.

జూన్ 4న లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. మరోసారి అధికారాన్ని నిలబెట్టుకుంటామని జగన్, వైసీపీని గద్దె దించుతామని కూటమి గట్టి పట్టుదలగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో బెట్టింగ్ జోరుగా సాగుతోంది. వైసీపీ, కూటమికి వచ్చే ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు.. మెజారిటీలపై పందాలు కాస్తున్నారు. రాష్ట్రంలోని వీఐపీ స్థానాలైన కుప్పం, పులివెందుల, హిందూపురం, నగరి, మంగళగిరి, పిఠాపురం, గుడివాడ, గన్నవరం స్థానాలపై కాయ్ రాజా కాయ్ అంటూ బెట్టింగులు కడుతున్నారు.
ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురం నియోజకవర్గంపైనే రూ.వందల కోట్ల బెట్టింగ్ జరుగుతున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా గెలిచి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెడతారని జనసైనికులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు నేమ్ ప్లేట్లు, స్టిక్కర్లతో వారు హల్‌చల్ చేస్తున్నారు.. ''పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా '' అంటూ బైక్ వెనుక స్టిక్కరింగ్ చేయించుకుని సంబరపడుతున్నారు పవన్ అభిమానులు. అటు లోకల్ వైసీపీ కేడర్, వంగా గీత అభిమానులు కూడా ఏమాత్రం తగ్గడం లేదు. ''డిప్యూటీ సీఎం గారి తాలూకా '', '' మా ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం '' అనే స్టిక్కర్లు వేయించుకుంటున్నారు.

ఇదిలావుండగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు ఖాయమంటున్నారు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత ఎస్వీఎస్ఎన్ వర్మ. ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. పవన్ గెలుస్తారని తన యావదాస్తిని పందెం కాస్తానని, డౌట్ ఉంటే ఎవరైనా కాగితాలు తీసుకుని రావొచ్చునని వర్మ సవాల్ విసిరారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పవన్ , జనసేన అభిమానులు వర్మ వీడియోను ట్రెండ్ చేస్తున్నారు. ఆయన అంత కాన్ఫిడెంట్‌గా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గెలుపును ఎవరూ ఆపలేరని ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.
నిజానికి పిఠాపురంలో టీడీపీ నుంచి బరిలో దిగాలని వర్మ భావించారు. ఐదేళ్లుగా వైసీపీ నేతలకు ఎదురొడ్డి నిలిచి, నియోజకవర్గంలో పార్టీని పటిష్టం చేశారు వర్మ. ఈసారి ఆయన గెలవడం పక్కా అని భావిస్తున్న వేళ.. కూటమి పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ పిఠాపురం సీటును ఆశించడంతో వర్మ అభిమానులు తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. చంద్రబాబు హామీతో వెనక్కి తగ్గిన వర్మ .. పవన్ విజయం కోసం ఎంతో శ్రమించారు. పవన్‌ను ఓడించాలని వైసీపీ నుంచి తనపై భారీ స్థాయిలో ఒత్తిడి వచ్చిందని వర్మ ఓ ఇంటర్వ్యూలో అన్నారంటే పరిస్ధితి అర్ధం చేసుకోవచ్చు. తనకు ఇద్దరు అధ్యక్షులున్నారని.. ఒకరు చంద్రబాబు, మరొకరు పవన్ కళ్యాణ్ అని వర్మ చెప్పారు. వారిద్దరూ తనకు ఏ బాధ్యత అప్పగించినా తూచా తప్పకుండా నిర్వర్తిస్తానని వర్మ కుండబద్ధలు కొట్టారు.


Click it and Unblock the Notifications











