Police Case on RGV: రాంగోపాల్ వర్మపై కేసు నమోదు.. పవన్ ట్వీటే కారణం
కెరీర్ ఆరంభంలో గొప్ప గొప్ప చిత్రాలనే చేసినా.. ఈ మధ్య కాలంలో మాత్రం ఎన్నో వివాదాల్లో తల దూర్చుతూ కాంట్రవర్శీ దర్శకుడిగా మారిపోయాడు సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ. సోషల్ మీడియా వేదికగా కొందరు రాజకీయ నాయకులను టార్గెట్ చేస్తున్న అతడు.. సున్నితమైన అంశాలతో సినిమాలు చేస్తూ గొడవలకు కారణం అవుతున్నాడు. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతిపక్ష నాయకులపై వర్మ తనదైన రీతిలో విమర్శలు చేస్తున్నాడు. అందులో జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను ఎక్కువగా టార్గెట్ చేస్తున్నాడు.
ఇటీవలే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్‌లోని వాలంటీర్ వ్యవస్థపై కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రాల్లో కలకలమే రేగింది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ జనసేన అధినేతపై రాంగోపాల్ వర్మ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాడు. ఇలా దాదాపు మూడు నాలుగు రోజులుగా పవన్‌ను టార్గెట్ చేస్తూ ట్విట్టర్‌లో పోస్టులు చేస్తున్నాడు. దీంతో ఇది పెద్ద వివాదంగా మారిపోయింది. ఈ పరిస్థితుల్లో తాజాగా సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మపై మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను షేర్ చేస్తూ రాంగోపాల్ వర్మ చేస్తున్న ట్వీట్లపై సమాచార హక్కు సంఘం జాతీయ అధ్యక్షుడు గంగాధర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతేకాదు, మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్‌లో ఆయన కంప్లైంట్ కూడా ఇచ్చారు. వాలంటీర్ వివాదంపై ఆర్జీవీ చేస్తున్న ట్వీట్లు శాంతి భద్రతలు విఘాతం కలిగించేలా, ప్రజల్ని రెచ్చగొట్టేలా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు తన కంప్లైంట్‌లో ఆ ట్వీట్లకు సంబంధించిన స్క్రీన్ షాట్లను కూడా గంగాధర్ జత చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు.
ఇదే వ్యవహారంపై కృష్ణాయపాలెం వాసులు కూడా దర్శకుడు రాంగోపాల్ వర్మపై కేసు పెట్టారు. ఈ మేరకు వాళ్లు మంగళగిరి పోలీస్ స్టేషన్‌కు రిజిస్టర్ పోస్ట్ ద్వారా తమ కంప్లైంట్ కాపీని పంపించారు. దీన్ని కూడా స్వీకరించిన పోలీసులు.. కేసు నమోదు చేసినట్లు తెలిసింది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











