ప్రమాదానికి గురైన రాజశేఖర్ కారు.. గతంలో ఆ కారుపై ఎన్ని చలాన్లు ఉన్నాయో తెలుసా?
హీరో రాజశేఖర్ కారు గత రాత్రి కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. హైదరాబాద్ ఔటర్ రింగు రోడ్డులో పెద్ద గోల్కొండ అప్పా జంక్షన్ వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఆ కారులో రాజశేఖర్ ఒక్కరే ప్రయాణిస్తుండటం, ఆయన స్వల్ప గాయాలతో బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది.
మితిమీరిన వేగం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో తేల్చారు. ప్రమాదం జరిగిన ఆ సమయంలో రాజశేఖర్ కారు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నట్లు గుర్తించారు. ఆయన బెంజ్ కారు TS07FZ1234 లో ప్రయాణించారని, ప్రమాదం జరగగానే కారులోని బెలూన్స్ తెరుచుకోవడం కారణంగా రాజశేఖర్‌కి ప్రమాదం తప్పిందని పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే రాజశేఖర్ ప్రయాణించిన ఆ కారు(TS07FZ1234)పై కొన్ని చలాన్లు కూడా ఉన్నాయని గుర్తించడం జరిగింది. గతంలో 3 సార్లు ఈ కారుపై ఓవర్‌స్పీడ్ చలాన్లు ఉన్నట్లుగా ప్రముఖ మీడియా సంస్థ తెలిపింది. రాచకొండ పరిధిలో ఒకటి, సైబరాబాద్ పరిధిలో మరో రెండు చలాన్లు ఉన్నాయని పేర్కొన్నారు. మొత్తంగా చూస్తే 3వేల రూపాయల జరిమానా పెండింగ్‌లో ఉందని తెలిసింది.
ప్రస్తుతం ప్రమాదం జరిగిన ఆ కారును పోలీస్ స్టేషన్‌కి తరలించడం జరిగింది. తాను సేఫ్‌గా ఉన్నానని రాజశేఖర్ తెలిపారు. గతంలో గరుడ వేగ సినిమా సమయంలో కూడా రాజశేఖర్ కారు ప్రమాదానికి గురయ్యారు. దేంతో ఈ ఇష్యూ ఫిలిం నగర్‌లో హాట్ టాపిక్ అయింది


Click it and Unblock the Notifications











