అమ్మాయిని లేపుకొస్తే నేనే డీల్ చేశా .. స్టార్ హీరో తమ్ముడిపై పోసాని సంచలనం
పోసాని కృష్ణమురళి .. పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. రచయితగా, దర్శకుడిగా, నటుడిగా , రాజకీయ నాయకుడిగా తనదైన ముద్ర వేశారు. బుల్లెట్స్ లాంటి డైలాగ్స్‌తో రైటర్‌గా షేక్ చేసిన ఆయన ఆపరేషన్ దుర్యోధన వంటి సినిమాలతో విలక్షణ దర్శకుడిగానూ పేరు తెచ్చుకున్నారు. నటుడిగా విలన్ రోల్స్‌తో పాటు కమెడియన్‌గానూ కడుపుబ్బా నవ్విస్తారు. సెపరేట్ డైలాగ్ డెలివరీతో , కామెడీ టైమింగ్‌తో అలరించడం పోసాని స్టైల్. అలాగే వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలోనూ, ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడటం కృష్ణమురళి శైలి.
గుంటూరు జిల్లా పెదకాకానికి చెందిన పోసాని ఎంఏ చేసిన అనంతరం సినిమాలపై ఆసక్తితో మద్రాస్‌లో అడుగుపెట్టారు. కెరీర్ ప్రారంభంలో తొలుత సత్యానంద్ దగ్గరికి వెళ్లగా.. ఆయన నాలుగు సంవత్సరాల తర్వాత రమ్మన్నారు. అయితే పోసాని మాత్రం పరుచూరి బ్రదర్స్ దగ్గరికి వెళ్లి ప్రయత్నించారు. తొలి ప్రయత్నంలోనే పరుచూరి బ్రదర్స్ కంట్లో పడ్డారు పోసాని. ఓ సినిమాకు సంబంధించి కొన్ని డైలాగ్స్ రాయమనగా.. పోసాని ఏమాత్రం టైం తీసుకోకుండా 70 డైలాగ్స్ రాసేశారు. వాటిలో 35 వరకు వాడుకున్నారంటే ఆయన టాలెంట్ అర్ధం చేసుకోవచ్చు.

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన గాయంతో రైటర్‌గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన పోసాని కృష్ణమురళి ఆ తర్వాత స్టార్ రైటర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. రక్షణ, పోలీస్ బ్రదర్స్, అల్లుడా మజాకా, ఖైదీ ఇన్స్‌పెక్టర్, పవిత్ర బంధం, తాళి, ప్రేమించుకుందాం రా, గోకులంలో సీత, పెళ్లి చేసుకుందాం, మాస్టర్, పెళ్లి కానుక, ఆటో డ్రైవర్, సీతారామరాజు, సాంబయ్య, రావన, మనోహరం తదితర చిత్రాలకు రైటర్‌గా పనిచేశారు. ధర్మక్షేత్రంలో తొలిసారి నటుడిగా నటించిన ఆయన రైటర్‌గా కంటే మంచి పేరు తెచ్చుకున్నారు. వెండితెరతో పాటు బుల్లితెరపై జడ్జిగానూ మెప్పించారు.
చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరి చిలకలూరిపేట నుంచి పోటీ చేసి ఓటమి పాలైన పోసాని ఆ తర్వాత సైలెంట్ అయ్యారు. వైఎస్ జగన్ సారథ్యంలోని వైసీపీలో చేరి 2019లో పార్టీ అధికారంలోకి రావడంతో ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్‌గా చేశారు. ప్రత్యర్ధులపై వాడి వేడి విమర్శలు చేయడంలో పోసాని ముందుండేవారు. అయితే కులాలు, రాజకీయ పార్టీల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారంటూ పోసాని కృష్ణమురళిని ఇటీవల ఏపీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కోర్టులో బెయిల్ పలుమార్లు తిరస్కరణకు గురికావడంతో పాటు పలు స్టేషన్‌లో కేసులు ఉండటంతో ఆయన నెల రోజుల పాటు ఏపీలోని పలు జైళ్లలో ఉండాల్సి వచ్చింది. ఎట్టకేలకు బెయిల్ రావడంతో కొద్దిరోజుల క్రితం విడుదలయ్యారు.
ఇండస్ట్రీలోని అందరితోనూ పోసానికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. హీరో రవితేజ సోదరుడు భరత్‌కు పోసాని మంచి ఫ్రెండ్. రోడ్డు ప్రమాదంలో మరణించిన భరత్ గురించి గతంలో పోసాని కృష్ణమురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. పరుచూరి బ్రదర్స్ దగ్గర పనిచేస్తున్న సమయంలో వెంకటేశ్వరరావు గారి అబ్బాయి రవికి భరత్ ఫ్రెండ్ . పరుచూరి బ్రదర్స్ ఇచ్చిన రూమ్‌లోనే తాను చెన్నైలో ఉండేవాడినని.. ఓ రోజున రవి తన దగ్గరికొచ్చి రవితేజ తమ్ముడు భరత్ తన లవర్‌తో చెన్నై వచ్చాడని ఆమె ఓ బిగ్‌షాట్ కుమార్తె , పేరు శిరీష అని చెప్పాడట.
ఇంట్లో ఒప్పుకోకపోవడంతో పారిపోయి వచ్చారని.. వారికి నీ రూమ్‌లో ఆశ్రయం ఇస్తే సోమవారం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని వెళ్లిపోతారని రవి చెప్పారట. ఆ మాటలతో పోసాని భయపడిపోయి.. నేను ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో ఎదుగుతున్నానని, వాళ్లిద్దరూ నిజంగా ప్రేమించుకున్నారో నాకు తెలియదని అన్నారట. అయితే వాళ్లిద్దరితో మాట్లాడిన తర్వాత తనకు నమ్మకం కుదరడంతో నా రూమ్‌లో ఆశ్రయం కల్పించడంతో వాళ్లిద్దరూ పెళ్లి చేసుకుని వెళ్లిపోయారని పోసాని తెలిపారు. అయితే ఈ విషయాన్ని కొందరు పరుచూరి బ్రదర్స్ దగ్గరకు మరోలా చెప్పారని.. దాంతో నేను రూమ్‌కి అమ్మాయిలను తెచ్చుకుంటున్నానని భావించి తిట్టి పంపించేశారని పోసాని కృష్ణమురళి తెలిపారు.


Click it and Unblock the Notifications











