మేమే సాఫ్ట్ టార్గెట్.. రజనీకాంత్‌తో ఆ విషయాన్ని మాట్లాడించలేం.. ఏపీ రాజకీయాలపై పవన్ కల్యాణ్
సినీ పరిశ్రమ సమస్యలు, సినీ ప్రముఖులు ఎదుర్కొంటున్న ఇబ్బుందులు, ఏపీ రాజకీయాలపై జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతీ విషయంలోను సినీ పరిశ్రమను టార్గెట్ చేస్తున్నారని అన్నారు. మహా టీవీ ప్రారంభించిన ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్ మాహ మ్యాక్స్ ప్రారంభం సందర్భంగా పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ...
తెలుగు మీడియాలోకి న్యూస్ ఛానెల్స్ వచ్చిన తర్వాత ఎంటర్‌టైన్‌మెంట్‌కు డెడికేటెడ్ ఛానెల్ లేదు. న్యూస్ ఛానెల్‌లోనే సినిమా వార్తలను ప్రసారం చేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ప్రత్యేకంగా మహా మ్యాక్స్ అనే ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్‌ను ప్రారంభించిన మహా టెలివిజన్ చానెల్‌కు శుభాకాంక్షలు. సినిమా పరిశ్రమకు సంబంధించి ఓ ఛానెల్ రావడం ఆనందంగా ఉంది అని పవన్ కల్యాణ్ అన్నారు.

సినిమా పరిశ్రమకు, రాజకీయ రంగానికి సంబంధాలు ఉన్నాయి. నా మూలాలు చిత్ర పరిశ్రమ. టెలివిజన్ ఛానెల్‌లో డిబేట్‌కు వచ్చిన నటీనటులు, సినిమా ప్రముఖులు కొన్నిసార్లు ఏదో మాట్లాడి ఇబ్బందికి గురి అవుతారు. సినిమా పరిశ్రమ ఎప్పటికీ అందరికీ సాఫ్ట్ టార్గెట్. రాజకీయ పరిణామాలపై ఎవరైనా స్పందిస్తే.. వారిని టార్గెట్ చేస్తారు. ఆ సమయంలో సినీ పరిశ్రమకు చెందిన వారు చాలా ఇబ్బందిలో పడుతారు. అలాంటి వారికి మీ ఛానెల్ అండగా నిలువాలి అని పవన్ కల్యాణ్ సూచించారు.
మీడియా వివాదాలను బేస్ చేసుకొని టీఆర్పీ సాధించకుండా.. కళను అమ్మి సినీ పరిశ్రమకు అండగా నిలువాలని కోరుకొంటున్నాను. సమాజంలో అసహ్యం పెరిగింది. సినిమా పరిశ్రమకు సెన్సార్ ఉంది. ప్రజలకు ఏది చూపించాలో.. ఏది చూపించకూడదో ప్రమాణాలు ఉన్నాయి. కానీ మీడియాకు అలాంటి సెన్సార్ లేదు. టీవీలో వచ్చే న్యూస్‌కు సెల్ఫ్ రెగ్యులేషన్ ఉండాలి అని పవన్ కల్యాణ్ సలహా ఇచ్చారు.
సినీ పరిశ్రమను, సినీ ప్రముఖులను టీఆర్పీకి వాడుకొంటున్నారు. కానీ పరిశ్రమ బాధలను, సమస్యలపై దృష్టి పెట్టడం లేదు. అలాంటి విషయాలను మహా మ్యాక్స్ ఛానెల్‌లో చూపించాలి. అలాగే ఏపీలో రాజకీయ పరిణామాలపై సినీ ప్రముఖులు మాట్లాడటం లేదనే విషయాన్ని అడిగితే.. నేను ఒకటే చెప్పాను. సినీ పరిశ్రమలో ఉండేవారు విపత్కర పరిస్థితుల్లో ఉంటారు. వారు ఏం మాట్లాడితే ఏం జరుగుతుందనే భయం ఉంటుంది. రజనీకాంత్ గారిని తీసుకొచ్చి మాట్లాడించలేం అని పవన్ కల్యాణ్ అన్నారు.
వినోదం లేకపోతే జీవితం లేదు. సమాజాన్ని సినిమా ప్రభావితం చేస్తుంది. సినిమా పరిశ్రమకు సేవలందించిన గూడవల్లి రామబ్రహ్మం, రఘుపతి వెంకయ్యనాయుడు లాంటి సినీ ప్రముఖుల జీవితాలు భవిష్యత్ తరాలకు చూపించాలి. మీ చానెల్ అద్బుతంగా కొనసాగాలని కోరుకొంటున్నాను అని పవన్ కల్యాణ్ చెప్పారు.


Click it and Unblock the Notifications











