ప్రభాస్, హను రాఘవపూడి మూవీ.. సింగిల్ పోస్టర్‌తో స్టోరీ చెప్పేశారుగా
టాలీవుడ్ స్టార్ హీరోలు ఎక్కడ వేసిన గొంగొళి అక్కడే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఏడాది 18 సినిమాలు రిలీజ్ చేసిన హీరోలున్న చరిత్ర మనది . అలాంటిది నేటితరం రెండు, మూడేళ్లకో సినిమా చేస్తూ అభిమానులను ఊసూరుమనిపిస్తున్నారు. అయితే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మాత్రం తాను వేరు అంటున్నారు. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో దూసుకెళ్తున్నారు. ఈ ఏడాది ఇప్పటికే కల్కి 2898 ఏడీతో ప్రేక్షకులను పలకరించిన ఆయన మరికొన్ని సినిమాలను సెట్స్‌పైకి తీసుకెళ్తున్నారు.
మారుతితో రాజా సాబ్, ప్రశాంత్ నీల్‌తో సలార్ -2 వర్క్స్‌లో బిజీగా ఉన్న ప్రభాస్.. కల్కి -2, సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ సినిమాలను లైన్‌లో పెట్టారు. తాజాగా శనివారం మరో మూవీని మొదలుపెట్టాడు. సీతారామం ఫేం హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఫోటోలను, వీడియోలను రిలీజ్ చేసింది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన సోషల్ మీడియా సెన్షేషన్ ఇమాన్వీ హరోయిన్‌గా నటిస్తున్నారు.

పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతుండటంతో అందుకు తగినట్లుగానే క్యాస్టింగ్‌ను సెట్ చేస్తున్నారు మేకర్స్ . ఇందులో బాలీవుడ్ సీనియర్ హీరో మిథున్ చక్రవర్తి, అలనాటి అందాల తార జయప్రద కీలకపాత్రలు పోషిస్తున్నారు. సినిమా సెట్స్‌పైకి వెళ్లిన తర్వాత అవసరాన్ని బట్టి మరికొందరు వచ్చి చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదు. సీతారామంతో ప్రేక్షకులను తన మెలోడీలతో మెస్మరైజ్ చేసిన విశాల్ చంద్రశేఖర్ .. ప్రభాస్ మూవీకి స్వరాలు సమకూరుస్తున్నారు.
అయితే ప్రభాస్ - హను రాఘవపూడి మూవీ సబ్జెక్ట్ ఏంటీ అనే దానిపై ప్రస్తుతం నెట్టింట హాట్ డిస్కషన్ నడుస్తోంది. డార్లింగ్ అభిమానులు , నెటిజన్లు రకరకాల పోస్టులు పెడుతున్నారు. పీరియాడికల్ యాక్షన్ లవ్‌స్టోరీగా ఈ సినిమా తెరకెక్కుతుందని అంటున్నారు. నిజాం సంస్థానం భారతదేశంలో విలీనం అయ్యే సమయంలో చోటు చేసుకున్న అంశాలు, రజాకార్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా ఉంటుందని ఫిలింనగర్ టాక్.

ఇంతలో ఈ ఊహాగానాలకు చెక్ పెడుతూ చిత్ర యూనిట్ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. అందులో స్టోరీ ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చేసింది. ఆధిపత్యం కోసం యుద్ధం జరుగుతున్నప్పుడు .. ఒక యోధుడు మాత్రమే పోరాటం ఎందుకో చెబుతాడని క్యాప్షన్ పెట్టారు. ఓ కోటలో ఫిరంగుల గర్జనలు, సైనికులు పోరాడుతున్న వేళ.. కోటపై బ్రిటీష్ జాతీయ పతాకం కాలిపోతున్నట్లుగా పోస్టర్ చూపించారు. భారత స్వాతంత్య్ర సంగ్రామం ఉద్ధృతంగా ఉన్న వేళ 1940లలో జరిగినట్లుగా ఉండే ఓ ఊహాజనిత కథకు, ఫిక్షన్ జోడించి ప్రభాస్ హను మూవీని తెరకెక్కిస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











