Radhe Shyam: ప్రభాస్ మూవీ నుంచి ఊహించని ప్రకటన.. ఇండియాలోనే తొలిసారి అలాంటి ఈవెంట్
పాన్ ఇండియా స్టార్ అయిన తర్వాత మరింత ఉత్సాహంగా కనిపిస్తున్నాడు టాలీవుడ్ బడా హీరో ప్రభాస్. ఈ జోష్‌లోనే అతడు వరుసగా సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు. 'బాహుబలి' సిరీస్ తర్వాత 'సాహో'తో సత్తా చాటిన అతడు... ఆ తర్వాత ఎన్నో ప్రాజెక్టులను ప్రకటించాడు. అందులో 'రాధే శ్యామ్' ఒకటి. రొమాంటిక్ ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభం అయింది. కానీ, అనివార్య కారణాల వల్ల ఇప్పటి వరకూ ఫస్ట్ కాపీని రెడీ చేయలేకపోయారు. అయినప్పటికీ అన్ని పనులనూ వేగంగా జరుపుతున్నారు.
క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతోన్న 'రాధే శ్యామ్' మూవీని సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ అప్పుడే ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలు పెట్టేశారు. ఇందులో భాగంగానే ఇప్పటికే పలు పాటలను, గ్లిమ్స్ వీడియోను విడుదల చేశారు. వీటన్నింటికీ ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చింది. ఫలితంగా ఎన్నో రికార్డులు కూడా బద్దలైపోయాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ సినిమా నుంచి ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నారు. ఇందుకోసం గతంలో ఎన్నడూ చేయని సరికొత్త ప్రయోగాన్ని చేయబోతున్నారు.

'రాధే శ్యామ్' మూవీ ట్రైలర్‌ను విడుదల చేసేందుకు గానూ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించబోతున్నారు. దీన్ని డిసెంబర్ 23న హైదబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో వైభవంగా జరపబోతున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది. ఆరోజు సాయంత్రం ఆరు గంటల నుంచి దీన్ని మొదలు పెడుతున్నట్లు ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలోనే 'రాధే శ్యామ్' మూవీ ట్రైలర్‌ను కూడా వదలబోతున్నారు. అది కూడా అక్కడకు హాజరయ్యే ఫ్యాన్స్ ద్వారా దీన్ని రిలీజ్ చేస్తున్నారు. భారతీయ చలన చిత్ర చరిత్రలో ఇలా ఎప్పుడూ జరగలేదన్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం 'రాధే శ్యామ్' మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇంకా ఈ సినిమా కోసం ప్రభాస్ డబ్బింగ్ చెప్పాల్సి ఉందని అంటున్నారు. అలాగే, కొన్ని గ్రీన్ మ్యాట్ సీన్స్ కూడా షూట్ చేయాల్సి ఉందన్న టాక్ వినిపిస్తోంది. ఇలా మరో వారం రోజుల్లోనే అన్నింటినీ పూర్తి చేసేసి ఫస్ట్ కాపీని రెడీ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకుందట. ఆ వెంటనే గ్రౌండ్ లెవెల్‌లో ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించాలని భావిస్తున్నారని తెలిసింది. ఇందుకోసం ప్రభాస్, పూజా హెగ్డే డేట్స్‌ను ఇప్పటికే లాక్ చేశారని సమాచారం.
రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న 'రాధే శ్యామ్' మూవీలో ప్రభాస్ జ్యోతిష్యుడిగా నటిస్తోన్నాడు. అలాగే, ఇది టైమ్ ట్రావెల్ కథ అని, పునర్జన్మల నేపథ్యంతో సాగే సినిమా అని అంటున్నారు. దీన్ని కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ పతాకాలపై వంశీ, ప్రమోద్, ప్రశీద నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. వీళ్లతో పాటు సచిన్ ఖేడ్కర్, మురళీ శర్మ, భాగ్యశ్రీ, ప్రియదర్శి, కునాల్ రాయ్ కపూర్, ఫ్లోరా జాకబ్ వంటి వాళ్లు కీలక పాత్రలను చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











