డార్లింగ్ కనిపించాడు, సెల్ఫీలు కురిపించాడు... లాక్ డౌన్ లో ప్రభాస్ సందడి
లాక్ డౌన్, సోషల్ డిస్టెన్స్ అనే పదాలు ప్రస్తుతం జనాల నరనరాన్నా జీర్ణించుకుపోయాయి. పాక్షికంగా లాక్ డౌన్ ఎత్తేసినప్పటికీ నలుగురిలోకి వెళ్లాలంటేనే జనాలు ఇంకా జంకుతున్నారు. ఇక సినీ జనాలు అయితే సెల్ఫ్ ఐసోలేషన్ నుంచి బయటకు వచ్చేందుకు ఇష్టపడటంలేదు. అయితే మన డార్లింగ్ ప్రభాస్ మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నాడు.
ఇటీవలే ప్రభాస్ హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లో ఆర్టీఏ ఆఫీస్ లో అకస్మాత్తుగా ప్రత్యక్షమయ్యాడు. ఓ వ్యక్తిగత పనిమీద ఆఫీస్ కు విచ్చేసిన డార్లింగ్, తగిన రక్షణా చర్యలు తీసుకున్నాడు. ముఖానికి మాస్క్ ధరించి, భౌతిక దూరాన్ని పాటిస్తూ తన పని తాను చేసుకున్నాడు. అయితే, ఇన్ని రోజుల తరువాత డార్లింగ్ ను చూసిన ఆనందంలో అభిమానులు ఒక్క ఫొటోకు ఫోజు ఇస్తారా అన్న చిన్న కోరికను ప్రభాస్ ముందు ఉంచకుండా ఉండలేకపోయారు. దీనికి డార్లింగ్ కూడా అంతే స్వీట్ గా రెస్పాండ్ అవ్వడం మరో విశేషం.

అభిమానులు ప్రేమగా అడిగిన చిన్ని కోరికను మన్నించిన ప్రభాస్ వారితో ఫొటోలు దిగేందుకు అంగీకరించాడు. అయితే, ఎవరికి వారు భౌతిక దూరాన్ని పాటిస్తూనే డార్లింగ్ తో ఫొటోలు దిగారు. ఈ తతంగమంతా పూర్తవ్వడానికి కాస్త సమయం పట్టినా, ప్రభాస్ ఓపిగ్గా అడిగిన వారందరితో ఫొటోలు దిగాడు. ఇక ఎప్పటిలాగానే కాజువల్ లుక్ లో సూపర్ డీసెంట్ గా కనిపిస్తున్న డార్లింగ్, ముఖానికి మాస్క్ వేసుకున్నా సూపర్ హ్యాండ్సమ్ గానే ఉన్నాడని చెప్పాలి. మరి వరుసగా భారీ బడ్జెట్ సినిమాలను లైన్ అప్ చేసిన ప్రభాస్ అదే రేంజ్ లో బాక్సాఫీస్ ను షేక్ చేస్తాడేమో చూడాలి.


Click it and Unblock the Notifications











