‘రాధే శ్యామ్’ నుంచి క్రేజీ అప్‌డేట్: సినిమా కోసం పక్కా ప్లాన్‌తో రాబోతున్న ప్రభాస్
పాన్ ఇండియా హీరో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నటిస్తోన్న చిత్రం 'రాధే శ్యామ్'. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభం అయింది. కానీ, ఇప్పటి వరకూ చిత్రీకరణ మాత్రం పూర్తి కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో సినిమా విడుదల కూడా ఆలస్యం అయిపోయింది. కరోనా రెండో దశ ప్రభావం తగ్గిన తర్వాత అంటే ఇటీవలే ఈ సినిమా చివరి షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించారు. ఇందులో పూజా హెగ్డేపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ నేపథ్యంలో తాజాగా 'రాధే శ్యామ్' షూటింగ్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ లీకైంది.
హైదరాబాద్‌లో మొదలైన ఫైనల్ షెడ్యూల్‌లో ఏకధాటిగా టాకీ పార్ట్ మొత్తాన్ని పూర్తి చేస్తారని ప్రచారం జరిగింది. కానీ, దానికి ప్రభాస్ హాజరు కాలేదు. తాజా సమాచారం ప్రకారం.. అతడు జూలై 23 నుంచి 'రాధే శ్యామ్' షూటింగ్‌లో పాల్గొనబోతున్నాడట. అప్పటి నుంచి ఆగస్టు 5 వరకూ డేట్స్ కేటాయించాడని తెలిసింది. ఇందులో కృష్ణంరాజుతో - ప్రభాస్ కాంబినేషన్ సీన్స్‌తో పాటు ఓ యాక్షన్ సీక్వెన్స్, కొన్ని గ్రీన్ మ్యాట్ సీన్స్ చిత్రీకరిస్తారని తెలుస్తోంది. మొత్తంగా ఈ సినిమా షూటింగ్‌ను ఆగస్టు మొదటి వారంలో పూర్తి చేస్తారని సమాచారం. ఆ వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను ప్రారంభించబోతున్నారనే టాక్ వినిపిస్తోంది.

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'రాధే శ్యామ్'.. రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్‌గా రాబోతుంది. ఇందులో ప్రభాస్ కార్ల దొంగగా నటిస్తున్నట్లు ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. దీంతో మూవీపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఇక, ఈ సినిమాను కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ పతాకాలపై వంశీ, ప్రమోద్, ప్రశీద నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా చేస్తోంది. ఇది తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో విడుదల కాబోతుంది.


Click it and Unblock the Notifications











