ప్రభాస్ మూవీ నుంచి పాకిస్థానీ హీరోయిన్‌ను తీసేయండి .. వివాదంలో ఫౌజీ
జమ్మూకాశ్మీర్‌లోని అనంత్ నాగ్ జిల్లాలోని పర్యాటక కేంద్రం బైసరన్ లోయలో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి .. భారత్‌తో పాటు ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. తీవ్రవాదుల కాల్పుల్లో 28 మంది ప్రాణాలు కోల్పోగా.. పదుల సంఖ్యలో పర్యాటకులు గాయపడ్డారు. ఈ ఘటనతో దేశ ప్రజలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. దెబ్బకు దెబ్బ తీయాలని , భారత్ మీద ఇలాంటి దాడి జరగకుండా బుద్ధి చెప్పాలంటూ రోడ్లు మీదకి వస్తున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో ఉగ్రవాదులను అంతం చేయాలంటూ కామెంట్స్ పెడుతున్నారు. పాకిస్తాన్, ఐఎస్ఐ, ఉగ్రవాదులపై విరుచుకుపడుతున్నారు.
ఉగ్రదాడికి భారత్ గట్టి బదులిస్తుందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరించారు. ఉగ్రవాదాన్ని తుదముట్టించే వరకు భారత్ నిద్రపోదని.. కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధితులకు దేశం అండగా ఉంటుందని రాజ్‌నాథ్ తెలిపారు. మరోవైపు.. దాడి తర్వాత అడవుల్లోకి పారిపోయిన ఉగ్రవాదుల కోసం సైన్యం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టింది. అటు సౌదీ నుంచి హుటాహుటిన ఢిల్లీకి తిరిగొచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ ఎయిర్‌పోర్ట్‌లోనే సమీక్షా సమావేశం నిర్వహించారు. బుధవారం సాయంత్రం మోడీ అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ కానుంది.

ఉగ్రవాద దాడిని ఖండిస్తూ కాశ్మీర్ ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. పార్టీలు, కుల, మతాలకు అతీతంగా వారు రోడ్లపైకొచ్చి నిరసనలు చేశారు. పీడీపీ అధినేత మెహబూబా ముఫ్తీ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. కాశ్మీర్ ఆర్ధిక వ్యవస్ధను దెబ్బతీసేందుకు ఉగ్రవాదులు కుట్ర చేస్తున్నారని ప్రజలు మండిపడ్డారు. ఉగ్రవాదంపై పోరులో భాగంగా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తామంతా అండగా నిలుస్తామని వారు తెలిపారు. అనేక చోట్ల హిందూ, ముస్లింలు కలిసి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిరసనలు చేయడం గమనార్హం. అయితే 2019 వరకు కాశ్మీర్‌లో బంద్‌లు సర్వసాధారణం. అయితే ఆర్టికల్ 370 రద్దు తర్వాత పరిస్ధితులు చక్కబడుతున్న వేళ ఉగ్రదాడితో కాశ్మీర్ ఉలిక్కిపడింది.
పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్, ఐఎస్ఐలపై దేశ ప్రజలు రగిలిపోతున్నారు. సోషల్ మీడియాలో దారుణంగా కామెంట్స్ పెడుతూ.. దెబ్బకు దెబ్బ తీస్తామని హెచ్చరిస్తున్నారు. దీని ప్రభావం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మూవీ ఫౌజీ, ఈ సినిమా హీరోయిన్‌పై పడింది. ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో గతేడాది ఓ సినిమా ప్రారంభమైంది. 1940లలో భారత స్వాతంత్య్ర సంగ్రామం బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా ఉంటుందని నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఇప్పటికే తెలిపింది. ఈ సినిమాలో మిథున్ చక్రవర్తి, జయప్రద, అనుపమ్ ఖేర్ వంటి దిగ్గజ నటులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.
అయితే ఈ సినిమాప్రారంభోత్సవం రోజునే ప్రభాస్ సరసన హీరోయిన్‌గా నటించే అమ్మాయిని పరిచయం చేశారు. ఆమె పేరు ఇమాన్వీ ఇస్మాయిల్. ఆమె ఉండేది ఢిల్లీలోనే అయినా .. ఇమాన్వీ తండ్రి పాక్ మిలటరీ మాజీ ఉద్యోగి అని ఆన్‌లైన్‌లో సమాచారం అందుబాటులో ఉంది. ప్రస్తుతం పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఆమె పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాకిస్తాన్ మూలాలున్న ఇమాన్వీ నటిస్తోన్న ఫౌజీ సినిమాని బాయ్‌కాట్ చేయాలని కొందరు, ఇకపై ఇమాన్వీకి సినిమాల్లో ఆఫర్లు ఇవ్వకూడదని మరికొందరు , అసలు భారతీయ సినిమాల్లో పాక్ నటీనటులకు అవకాశాలు ఇవ్వకూడదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం దేశ ప్రజలు ఆగ్రహావేశాలతో ఉన్న నేపథ్యంలో పౌజీ సినిమా, ఇమాన్వీ కెరీర్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. మరి ఫౌజీ దర్శక నిర్మాతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











