Kota Srinivasa Rao: కోట శ్రీనివాసరావు అందరికీ నచ్చడు.. ప్రకాష్ రాజ్ షాకింగ్ కామెంట్స్
లెజండరీ యాక్టర్ కోట శ్రీనివాసరావు మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. ఆదివారం తెల్లవారుజామున కోట మరణ వార్త తెలిసి తెలుగు ప్రజలు షాక్‌కు గురయ్యారు. దాదాపు నాలుగున్నర దశాబ్థాల పాటు తన నటనతో అలరించిన కోట శ్రీనివాసరావు శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సినీ ప్రముఖులు, అభిమానులు, సన్నిహితులు ఆయనకు కడసారి వీడ్కోలు పలికేందుకు తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో విలక్షణ నటడు ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..
తెలుగువాళ్లకి ఏం తక్కువ?
కోట శ్రీనివాసరావు ఏ విషయాన్ని అయినా ఉన్నది ఉన్నట్లుగా ముక్కుసూటిగా చెబుతారు. ఈ విషయంలో ఎన్ని విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గరు. ఎవరైనా ఎంతటి పెద్దవాళ్లయినా మొహమాటం లేకుండా చెప్పేస్తారు. ముఖ్యంగా తెలుగు చిత్ర పరిశ్రమలో తెలుగు నటీనటులకు అవకాశాలు ఇవ్వాలని ఆయన తొలి నుంచి వాదిస్తున్నారు. తెలుగు భాషను, తెలుగు నటీనటులను కించపరిచేలా మాట్లాడితే కోట అగ్గిమీద గుగ్గిలం అయిపోతారు. ప్రాధాన్యత ఉండి వేరే గత్యంతరం లేక పరభాషా నటులను తీసుకొస్తే తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. నసిరుద్దీన్ షా, నానాపటేకర్ లాంటి వాళ్లు అయ్యుండాలని అంతే తప్పించి తెలుగువారితో ఏమాత్రం పోటీపడటానికి అర్హత లేని వాళ్లను తీసుకొస్తే ఒప్పుకోనని కోట పలుమార్లు తెలిపారు.

పిల్లలకు అన్యాయం జరగకూడదు
తెలుగు వారు ఏ క్యారెక్టర్‌కు పనికిరారంటే కుదరదన్నారు. కొత్త పిల్లలకు అన్యాయం జరుగుతున్నా వాళ్లు ఏం మాట్లాడలేరని, కానీ అనుభవం ఉండి నేను మాట్లాడకపోతే బాగుండదని కోట శ్రీనివాసరావు చెప్పేవారు. తెలుగులో నటించాలనుకునే నటీనటులు, టెక్నీషియన్లు ఎవరైనా సరే.. ఇక్కడే ఉండాలని ఒక తీర్మానం చేసుకున్నామని గుర్తుచేశారు. దీని అమలు కూడా ఇప్పుడు సరిగా లేదని కోట శ్రీనివాసరావు విమర్శలు గుప్పించారు.
మా ఎన్నికల్లో విష్ణుకి మద్ధతు
ఇక మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్- మంచు విష్ణులు పోటీపడినప్పుడు మరో మాట లేకుండా తన మద్ధతును మంచు విష్ణుకే ఇచ్చారు కోట శ్రీనివాసరావు. ఈ సమయంలో ప్రకాశ్ రాజ్‌కు మద్ధతుగా నిలిచిన మెగా ఫ్యామిలీపైనా ఆయన విమర్శలు చేశారు. ప్రకాష్ ఎప్పుడూ సెట్‌కు రాడని, టైమ్‌కి అందుబాటులో ఉండడని మండిపడ్డారు. లోకల్ - నాన్ లోకల్ అనే విషయాన్ని కూడా ఆలోచించుకోవాలని కోట శ్రీనివాసరావు తెలిపారు. మంచు విష్ణుకి ఓటేసి గెలిపించాలని నటీనటులను రిక్వెస్ట్ చేస్తూ కోట మీడియా సమావేశం పెట్టడం అప్పట్లో సంచలనం సృష్టించింది.
కోట అందరికీ నచ్చడు
ప్రకాష్ రాజ్‌తో తొలి నుంచి అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ ఇద్దరూ కలిసే నటించారు. ఈ నేపథ్యంలో కోట మరణవార్త తెలుసుకున్న ప్రకాష్ రాజ్.. ఆయన నివాసానికి వెళ్లి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ 'సినిమాలో నాలుగు దశాబ్ధాల ప్రయాణం. తెలుగు ఇండస్ట్రీకి వచ్చేముందు బెంగళూరు నుంచి ఆయన సినిమాలు చూసేవాడిని. ఆయన తీక్షణత, ఇయన ఇంటెన్సిటీ నన్ను బాగా ఇన్‌ఫ్లూయెన్స్ చేసింది. ఆ తర్వాత వచ్చి రెండు మూడు దశాబ్థాలుగా ఆయనతో పనిచేసిన అనుభవం. చాలా విశిష్టమైన వ్యక్తి, అందరికీ నచ్చడు.. నాకు తెలిసి ఎవరినీ మెప్పించే ప్రయత్నం చేయలేదు. అద్భుతమైన నటుడు.. ఆయనకంటూ ఒక అవగాహన ఉండేది, ఆయనకంటూ ఓ సెటైర్ ఉండేది' అని ప్రకాష్ రాజ్ గుర్తుచేసుకున్నారు.
కోట ఎవరినీ వదిలిపెట్టడు
'పరిశ్రమలో మనం చాలా మంది నటుల్ని చూస్తాం. కానీ ఏదో ఒక డైలాగ్ రాసిస్తే అలాగే చెప్పడం కాదు. ఆయనది ఒక ప్రెజెన్స్.. నాకు చాలా నచ్చేది.. ఎవరినీ వదిలిపెట్టడు. అంబేద్కర్ సినిమా రిలీజైంది ఎందుకో చూడటం లేదంటే .. అలాంటి మంచి సినిమా చూడరని ఒక ఆవేదన ఉండేది. తెలుగుభాష, తెలుగు నటీనటులు, తెలుగు ప్రతిభకు పెద్ద ఎత్తున ఛాన్స్ దొరకట్లేదని అంతా కుళ్లు అనుకునేవారు. కానీ ఆయన ఆవేదన నిజమైనదేనని నాకు అనిపించింది. ప్రకాష్ రాజ్ గారు పరభాషా నటులు కదా అని ఎవరో అడిగితే.. ఆయన తెలుగు నేర్చుకున్నారు కదా? మనోడు అయిపోయాడు కదా? అని అనేవారు' అని ప్రకాష్ రాజ్ తెలిపారు.
తెలుగు జాతి గర్వించదగ్గ నటుడు
'భాషను తప్పుగా పలికేస్తారు.. మన అవకాశాల్ని ఎత్తుకెళ్లిపోతారని .. నా మీద కూడా సెటైర్లు వేసేవారు. ఓ షూటింగ్‌లో అలీ, బ్రహ్మానందం, బ్రహ్మాజీతో ఉన్నప్పుడు కోటగారు గుర్తొచ్చి ఆరా తీస్తే.. ఒంట్లో బాగోలేదని నాతో చెప్పారు. ప్రొడక్షన్ నుంచి బండి పంపిస్తే సరదాగా సెట్‌లో కూర్చొని బాగా మాట్లాడరు. తెలుగు సినిమా, తెలుగు జాతి గర్వించదగ్గ కళాకారుడు. ఆయన పాత్రలు, ఆయన సెటైర్లు మనం మరచిపోలేం. తన జీవితంలో, ఇంట్లో చాలా పెయిన్ చూసినా ఆ నొప్పిని ఎప్పుడూ వాడుకోలేదు. నాకు నచ్చినట్లు బతుకుతా అనేవారు అరుదుగా ఉంటారని.. కోటగారిని మిస్ అవుతున్నాం' అని ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











