Prasanth Varma: 8 మంది సూపర్ హీరోలతో మూవీస్.. స్పైడర్ మ్యాన్ వంటివి ఆగిపోవాలి: ప్రశాంత్
తెలుగు చిత్ర పరిశ్రమలో క్రియేటివ్ కాన్సెప్ట్ ఒరియెంటెడ్ చిత్రాలు తెరకెక్కించే డైరెక్టర్లలో ప్రశాంత్ వర్మ ఒకరు. అ!, కల్కి, జాంబీ రెడ్డి వంటి సినిమాలను డైరెక్ట్ చేసిన ఈ యువ దర్శకుడు తాజాగా హనుమాన్ మూవీతో రానున్నాడు. ఇండియన్ సూపర్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో యంగ్ హీరో తేజ సజ్జా ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ఒక యంగ్ డైరెక్టర్.. మరో యంగ్ హీరోతో చేస్తున్న ప్రయోగమే హనుమాన్ కాగా 8 మంది సూపర్ హీరోలతో సినిమాలు చేస్తున్నట్లు తాజాగా ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు.
పోస్టర్లతో పాత్రలు: అ! చిత్రంతో తెలుగు ప్రేక్షకులను వావ్ అనిపించిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఇప్పుడు ఆయన తాజాగా తెరకెక్కించిన చిత్రం హనుమాన్. ఈ సినిమాలో తెజ సజ్జా ప్రధాన పాత్ర పోషిస్తుండగా అంజమ్మగా వరలక్ష్మీ శరత్ కుమార్, మైఖేల్ గా వినయ్ రాయ్, మీనాక్షిగా అమృత అయ్యర్ నటిస్తున్నారు. వీరికి సంబంధించిన పోస్టర్స్, టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

11 భాషల్లో రిలీజ్: హనుమాన్ సినిమాను ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, మరాఠీతోపాటు స్పానిష్, కొరియన్, జపనీస్, చైనీస్ తో కలిపి మొత్తంగా 11 భాషల్లో విడుదల చేస్తున్నారు. మే 29న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ పుట్టినరోజు సందర్భంగా తన హనుమాన్ చిత్రం గురించి పలు కీలక విషయాలు వెల్లడించారు.

చాలా టైమ్: "ఇప్పటికే హనుమాన్ షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. ప్రస్తుతం వీఎఫెఎక్స్ పనులు జరుగుతున్నాయి. జూన్ చివరి వరకు అన్ని పనులు పూర్తవుతాయి. మూవీ టీజర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. అంతకంటే మెరుగ్గా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తాం. మొదట్లో తెలుగులోనే సినిమా అనుకున్నాం. కానీ టీజర్ రిలీజ్ తర్వాత అన్ని భాషల్లో విడుదల చేయాలని భావించాం. వీఎఫెక్ట్స్ కోసం చాలా టైమ్ పడుతుంది. సమయం తీసుకుని చేస్తే ప్రతీ సీన్ అద్భుతంగా వస్తుంది" అని ప్రశాంత్ వర్మ తెలిపారు.

నో ఎఫెక్ట్: "హనుమంతుడి జీవితంలో జరిగిన ఓ సంఘటన ఆధారంగా కథ రాసుకున్నాను. చాలా మంది హనుమంతుడిని చూడాలని కలలు కంటారు. వారికి ఈ సినిమాలో హనుమాన్ ను చూపించనున్నాను. హనుమాన్ పాత్ర కోసం ఏడాది పని చేశాం. ఆ పాత్ర అద్భుతంగా వచ్చింది. ఆదిపురుష్ ప్రభావం హనుమాన్ పై ఉండదు. హనుమాన్ మొదలుపెట్టినప్పుడు ఆదిపురుష్ లేదు. ఒక మూవీ ఎఫెక్ట్ మరో సినిమాపై ఉంటుందని అనుకోను" అని ప్రశాంత్ వర్మ అన్నారు.
10 స్క్రిప్ట్స్ మీద: "ఒక సాధారణ హీరోకు పవర్స్ వచ్చి అందరినీ కొడుతుంటే చూసేందుకు చాలా బాగుంటుంది. అదే స్టార్ హీరోకు పవర్స్ వచ్చినా పెద్దగా ఆసక్తిగా అనిపించదు. తేజ సజ్జా పాత్రకు నూరుశాతం న్యాయం చేశాడు. తేజతో మరో సినిమా కూడా చేస్తున్నాను. హనుమాన్ తర్వాత అధీరా చేస్తాను. ప్రస్తుతం 10 స్క్రిప్ట్స్ పై వర్క్ చేస్తున్నా. జాంబీరెడ్డి 2 వంటి సినిమాలు లైనప్ లో ఉన్నాయి" అని పేర్కొన్నారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.

ఆగిపోయేలా: "ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ పేరుతో ఒక స్టూడియోను నిర్మిస్తున్నాను. వచ్చే కొద్ది సంవత్సరాల్లో 8 మంది సూపర్ హీరోస్ సినిమాలు తీస్తాను. రానున్న రోజుల్లో మన సూపర్ హీరోల మూవీలు వస్తున్నాయంటే స్పైడర్ మ్యాన్ వంటి సినిమాలు కూడా ఆగిపోయేలా ఉండాలి" అని యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మనసులో మాట చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











