ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ప్రకటన: ఈ సారి ఒరిజినల్ సూపర్ హీరో కథతో వస్తున్నాడు
విలక్షణ సినిమాలతో తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ. సరికొత్త పాయింట్లతో సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్న అతడు.. ఒకదాని తర్వాత ఒకటి ఇలా ప్రయోగాత్మక చిత్రాలను తెరకెక్కిస్తున్నాడు. అలా దర్శకుడిగా సక్సెస్ అవడంతో పాటు వరుస విజయాలను కూడా అందుకుంటున్నాడు. ఇప్పటికే 'అ!', 'కల్కి', 'జాంబీ రెడ్డి' వంటి సినిమాలను అందించిన ప్రశాంత్ వర్మ.. తన నాలుగో సినిమాను కూడా లైన్‌లో పెట్టేసుకున్నాడు. తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది.
విభిన్న తరహా చిత్రాల దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తోన్న కొత్త చిత్రం 'హనుమాన్'. ఈరోజు ఈ యంగ్ డైరెక్టర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటనను వెల్లడించారు. సీతారాములను కలిపిన హనుమంతుడి కథతో ఈ సినిమా రూపొందుతోంది. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా తెలిపిన ప్రశాంత్.. 'ఈ సారి నాకు ఇష్టమైన జోనర్‌తో వస్తున్నాను. క్రొత్త సినిమాటిక్ విశ్వంలోకి ప్రవేశించడానికి మీ సీట్ బెల్టులను కట్టుకోండి. హనుమాన్.. తెలుగులో మొట్ట మొదటి ఒరిజినల్ సూపర్ హీరో సినిమా' అంటూ అందులో పేర్కొన్నాడు.

ఇందుకోసం ఓ వీడియోను సైతం విడుదల చేసింది చిత్ర యూనిట్. ఇందులో హిమాలయ పర్వతాలను చూపిస్తూ చేసిన పిక్చరైజేషన్ ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ ఒక్క వీడియోతోనే సినిమాపై అంచనాలను పెంచేశాడు ప్రశాంత్ వర్మ. ఇక, ఈ వీడియో చివర్లో 'కరోనా సమయంలో అండగా నిలుస్తోన్న రియల్ హీరోలకు ఇది అంకితం' అంటూ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన గత చిత్రం 'జాంబీ రెడ్డి' సూపర్ డూపర్ హిట్ అయింది. అలాగే, కలెక్షన్ల పరంగానూ దుమ్ము దులిపేసింది. అదే సమయంలో బుల్లితెరపైనా సత్తా చాటి రికార్డు క్రియేట్ చేసింది.


Click it and Unblock the Notifications











