Elections 2024 గులాబీ పువ్వుతో కంగన రనౌత్.. స్టేజ్ మీద క్వీన్‌కు షాకిచ్చిన ప్రధాని మోదీ!
బాలీవుడ్ క్వీన్ కంగన రనౌత్ ఇప్పటి వరకు హిందీ సినిమాలో విభిన్నమైన పాత్రలు, విలక్షణమైన నటనతో ఆకట్టుకొన్నారు. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద హంగామా సృష్టించిన ఈ అందాల భామ సినిమాలు ఇటీవల కాలంలో కలెక్షన్ల సాధించలేక బొక్కా బోర్లా పడ్డాయి. అయితే సినిమా రంగంలో తనకంటూ ఇమేజ్ సొంతం చేసుకొన్న ఆమె ప్రస్తుతం రాజకీయ అరంగేట్రం చేసింది. ఆమె లోక్‌సభ ఎన్నికల్లో తన సొంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ నుంచి బరిలోకి దిగింది. అయితే కంగన రనౌత్‌కు ప్రధాని మోదీ చిన్న ఝలక్ వివరాల్లోకి వెళితే..
కంగన రనౌత్ గత కొద్దికాలంగా బాలీవుడ్‌లో ధిక్కారస్వరం వినిపిస్తున్నది. శివసేన, బీజేపీ వ్యతిరేకులపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ కనిపించింది. అయితే మోదీ ప్రభుత్వానికి సపోర్టుగా, అలాగే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తూ కనిపించింది. అప్పుడే అందరూ బీజేపీలో చేరడం ఖాయమనే వాదన తెరపైకి వచ్చింది.

ఇక బాలీవుడ్‌లో ఆమె ఇటీవల కాలంలో చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. మణికర్ణిక తర్వాత ఆమె నటించిన చిత్రాలు జడ్జిమెంటల్ హై క్యా, పంగా, తలైవి, ధాకడ్, తికు వెడ్స్ షేరు, చంద్రముఖి 2, తేజా చిత్రాలు దారుణంగా ఫ్లాప్ అయ్యాయి. అయితే ఇక ఆమె ఆశలన్నీ ఎమర్జెన్సీ అనే సినిమాపైనే పెట్టుకొన్నది. ఈ చిత్రంలో ఇందిరాగాంధీ పాత్రలో ఆమె ప్రేక్షకులను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, అందరూ ఊహించినట్టే.. కంగన రనౌత్ బీజేపీ అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకొన్నది. దాంతో ఆమెకు ఏకంగా హిమాచల్‌లోని మండి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాలని టికెట్ కేటాయించింది. అయితే ప్రత్యర్థి పార్టీలు ఆమెపై ఘాటుగా స్పందించారు. అయితే వాటికి కంగన రనౌత్ తనదైన శైలిలో సమాధానాలు చెబుతూ ప్రచారంలో దూసుకెళ్లింది.

ఇక బీజేపీ ప్రచారంలో భాగంగా మండి నియోజకవర్గంలో ప్రధాని మోదీ పర్యటనను ఏర్పాటు చేసింది. మండిలో ఏర్పాటు చేసిన సభలో కంగన రనౌత్ తరఫున ప్రసంగించారు. అంతకు ముందు ప్రధానిని ఆహ్వానిస్తూ.. ఒక గులాబీ పువ్వును ఇచ్చేందుకు ప్రయత్నించింది. తన అనుచరులు తీసుకొచ్చిన గులాబీని కంగన అందించడానికి ప్రయత్నిస్తే.. సున్నితంగా తిర్కరిస్తూ మోదీ చేతులెత్తి దండం పెట్టారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది.
కంగనను నెటిజన్లు ట్రోల్ చేస్తూ.. అన్ని వేదికలపైన ఒకేలా ప్రవర్తించకూడదు. పరిస్థితులను బట్టి మారాలి. రాజకీయ సభలు, వేదికల మీద గులాబీ పూలు ఇవ్వడం ఏమిటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వ్యవహారాన్ని కంగన ఎలా తీసుకొంటుందో వేచి చూడాలి. అయితే బలమైన ప్రత్యర్థితో పోరాటం చేస్తున్న ఆమె విజయం సాధిస్తుందా? లేదా అనే ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications











