‘97 టేక్స్‌తో మహేష్ బాబు, నేను.. ఒక్క రోజంతా ఒకే సీన్‌తో రాజమౌళి’
మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, టాలెంటెడ్ హీరోయిన్ పార్వతి తిరువోతు జంటగా నటించిన క్రైమ్, యాక్షన్ డ్రామా ఐ నోబడీ (I, Nobody). ఈ చిత్రానికి నిసమ్ బషీర్ దర్శకత్వం వహించారు. పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్, E4 ఎక్స్‌పెరిమెంట్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాను సుప్రియ మీనన్, ముఖేష్ ఆర్ మెహతా, సీవీ సారథి నిర్మాతలుగా వ్యవహించారు.
ఈ సినిమా సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. మ్యూజిక్: జేక్స్ బిజోయ్, ఎడిటర్: రమీస్ ఎంబీ, సినిమాటోగ్రఫి: దినేష్ పురుషోత్తమన్, ఆర్ట్: అర్షద్ నక్కోత్, క్యాస్టుమ్: ధన్య బాలకృష్ణన్, యాక్షన్: యానిక్ బెన్, కలై కింగ్సన్, అమిత్ జాలీ బాస్టిన్ , సౌండ్ డిజైన్: నిక్సన్ జార్జ్ తదితరులు తమ బాధ్యతలను నిర్వర్తించారు. ఈ సినిమా జూలై 9వ తేదీన తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాను నటిస్తున్న వారణాసి సినిమా షూటింగ్ విశేషాలను పంచుకొన్నారు. సుకుమారన్ చెప్పిన విషయాలు ఏమిటంటే?

దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న వారణాసి సినిమాలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రాతోపాటు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం.. గ్లోబల్ ట్రాటర్ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో విలన్ పాత్రలో కనిపిస్తారు. అయితే ఈ సినిమా షూటింగ్‌లో జరిగిన కష్టాలను ఆయన తాజా ఇంటర్వ్యూలో చెబుతూ.. రాజమౌళి డెడికేషన్ గురించి చెప్పారు.
వారణాసి సినిమా భారీ సినిమాగా చూపుతిప్పుకోలేనంతగా తెరకెక్కుతున్నది. భారీ సినిమా అంటే చాలా తక్కువ మాట. బిగ్ అనే పదం ఈ సినిమా ముందు చాలా చిన్నది. నా కెరీర్‌లో ఇప్పటి వరకు ఇంత పెద్ద స్కేల్ ఉన్న మూవీని ఎన్నడూ చూడలేదు. చూస్తాననే నమ్మకం కూడా లేదు. రాజమౌళి సార్ విజన్‌కే అది సాథ్యం అని సుకుమారన్ అన్నారు.
రాజమౌళి డెడికేషన్ ఎలాంటిదంటే.. ఆయన సీన్ విషయంలో కాంప్రమైజ్ కాలేడు. ఈ చిత్రంలో ఓ సీన్ ఉంది. నాపై మహేష్ బాబుపై ఓ సన్నివేశాన్ని షూట్ చేస్తున్నారు. ఆ సీన్ ఏమిటో నేను చెప్పను. ఉదయం సీన్ షూట్ మొదలైంది. కానీ ఆ సీన్ ఓకే కాలేదు. లంచ్ బ్రేక్ ఇచ్చారు. లంచ్ పూర్తి చేస్తుండగా.. ఇంకా తింటుండగానే షాట్ రెడీ అన్నారు. దాంతో భోజనం మధ్యలోనే వదిలేసి వచ్చాం. సాయంత్రం 6.30 గంటల దాటింది, ఏడు అయింది. అయినా రాజమౌళి సీన్‌ను ఒకే చేయలేదు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఏం జరుగుతుంది అని గొణుకుతున్నాడు. సీన్ ఒకే కాకపోతే ప్యాకప్ చెప్పారు.. ఆ ఒక్క సీన్ మొత్తాన్ని ఒక్క రోజంతా షూట్ చేశారు. ఆ సీన్ సరిగా రాకపోతే తదుపరి రోజుకు వాయిదా వేశారు. మహేష్ బాబు దాదాపు 97 టేక్స్ తీసుకొన్నాడు అని పృథ్వీరాజ్ సుకుమారన్ చెప్పారు.


Click it and Unblock the Notifications