సోషల్ మీడియాను షేక్ చేసిన వీడియో.. ఎందుకు వైరల్ అయిందో తెలియదు.. ప్రియా వారియర్ కామెంట్స్
ప్రియా వారియర్.. అన్నా ప్రియా ప్రకాష్ వారియర్ అన్నా అందరికీ తెలిసే ఉంటుంది. భారత దేశాన్ని ఓ కన్నుగీటుతోనే ఊపేసిన ఈ సుందరి ఎంతో మంది కుర్ర హృదయాలను కొల్లగొట్టింది. ముద్దు గన్ను పేల్చి ఇంకెంతో మంది గుండెల్ని పేల్చేసింది. ఇలా ప్రియా చేసిన పనులు అన్నీ ఇన్నీ కావు. అయితే ఇవన్నీ ఒరు అదార్ లవ్ అనే చిత్రం విడుదల కాకముందే. ఆ చిత్రం రిలీజ్ అయిన తరువాత ప్రియ పరిస్థితి దారుణంగా పడిపోయింది.

క్రేజ్ పెరగడంతో స్క్రిప్ట్‌లో మార్పులు..
కన్నుగీటే వీడియో, ముద్దు గన్ను పేల్చే సీన్ విడుదల చేశాక.. ప్రియాకు ఎక్కడా లేని క్రేజ్ పెరిగిపోయింది. దీంతో మేకర్స్.. ఆమె క్రేజ్‌ను క్యాష్ చేసుకుందామని భావించారు. దానిలో భాగంగా.. కథలో కీలక మార్పులు చేశారు. ఆమె చుట్టూ కథ తిరిగేలా కథనాన్ని మార్చేశారు. అయినా సరే.. ప్రియాకు మాత్రం పెద్ద ఎదురు దెబ్బ తగిలింది.

సినిమా విడుదలయ్యాక పరిస్థితి తారుమారు..
లవర్స్ డే సినిమా రిలీజ్ అయ్యాక ప్రియా పరిస్థితి తారుమారైంది. అప్పటి వరకు క్యూ కట్టిన నిర్మాతలు చేతులెత్తేశారు. ప్రియా వైపు చూడాలంటే కూడా భయపడే స్టేజ్‌కు ఆమె పరిస్థితి దిగజారిపోయింది. ఆ రెండు సీన్లు తప్పా.. సినిమాలో ప్రియా చేసిందేమీ లేదని తెలిసిపోయిడంతో అందరూ వెనక్కి తగ్గారు.

నాటి పరిస్థితులను..
ప్రియా ప్రస్తుతం లవ్ హ్యాకర్స్ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ క్రమంలో మీడియాతో ముచ్చటిస్తూ నాటి సంగతులను గుర్తు చేసుకుంది. ‘ఓరు అడార్ లవ్' సినిమా నుంచి కన్ను కొట్టిన వీడియోను ఓ రోజు రాత్రి సమయంలో విడుదల చేశారని తెలిపింది. ఆ తర్వాత రోజు ఉదయాన్నే తనకు ఎన్నో ఫోన్ కాల్స్, మెస్సేజ్‌లు వచ్చాయని చెప్పుకొచ్చింది. తన గురించి ఛానెల్స్, పత్రికల్లో వార్తలు వచ్చాయని అప్పటి సంగతులను గుర్తు చేసుకుంది. తన వీడియో ఓవర్‌నైట్‌లో ఇంటర్నెట్ సెన్సేషన్ అయ్యిందని అప్పుడు తెలిసిందని పేర్కొంది.

ఏముందో ఇప్పటికీ తెలియడం లేదు..
ఆ వీడియోకు ముందు సోషల్‌మీడియాలో తనకు కేవలం 1000 మంది ఫాలోవర్స్ మాత్రమే ఉండేవారని, కానీ ఆ వీడియో విడుదలయ్యాక 7.4 మిలియన్ల మంది ఫాలో అవుతున్నట్లు పేర్కింది. తన మీద ఎన్నో ట్రోల్స్, మీమ్స్ కూడా వచ్చాయని నిర్మోహమాటంగా చెప్పుకొచ్చింది. వాటిని చూసి నవ్వుకునేదాన్నని తెలిపింది. ఈ వీడియో చూశాక తన పేరెంట్స్ రియాక్షన్ ఇప్పటికీ బాగా గుర్తుందని చెప్పుకొచ్చింది. ఆ సమయంలో తన తల్లిదండ్రులు ఒకటే అడిగారని, అంతగా వైరల్ అయ్యేలా ఆ వీడియోలో ఏముందని ప్రశ్నించారని తెలిపింది. ఆ వీడియో ఎందుకు వైరలైందో.. మా తల్లిదండ్రులకు ఇప్పటికీ తెలియడం లేదంటూ చెప్పుకొచ్చింది.


Click it and Unblock the Notifications











