బైక్ తెచ్చిన తంటా.. ఏదో అనుకుంటే మరేదో జరిగింది.. అడ్డంగా బుక్కయిన ప్రియదర్శి
తన బైక్ చోరీకి గురైందంటూ ప్రియదర్శి తన ట్విట్టర్ వేదికగా చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. తాను ఇష్టపడి కొనుక్కున్న బైక్‌ని ఇంటి బయట పార్క్ చేయగా ఎవరో చోరీ చేశారంటూ ప్రియదర్శి ట్వీట్ చేశాడు. ఈ మేరకు బైక్ దొంగిలిస్తున్న తాలూకు వీడియో కూడా జత చేశాడు. అయితే ఆ వీడియోనే ప్రియదర్శికి లేనిపోని తంటాలు తెచ్చిపెట్టింది.
తన బైక్ పోయిందని స్వయంగా ప్రియదర్శి పేర్కొనడంతో సోషల్ మీడియాలో ఈ వీడియోను తెగ షేర్ చేశారు నెటిజన్లు. అలా అలా ఈ వీడియో పోలీసుల కంట పడటంతో.. బైక్ తాలూకు ఆనవాళ్లు చెప్పాలంటూ ప్రియదర్శిని కోరారు హైదరాబాద్ పోలీసులు. దీంతో వెంటనే సదరు వీడియోను ట్విట్టర్ ఖాతా నుంచి డిలీట్ చేశాడు ప్రియదర్శి. ఆ తర్వాత రంగంలోకి దిగిన సందీప్ కిషన్ ప్రియదర్శి షేర్ చేసిన ఆ వీడియో నిజమైంది కాదని, 'నిను వీడని నీడను నేనే' సినిమా ప్రమోషన్ లో భాగంగా ఈ వీడియో షేర్ చేయడం జరిగిందని వివరణ ఇచ్చాడు.
నిజానికి ముందుగా ప్రియదర్శిని ఈ సినిమాలో నటించేందుకు తీసుకున్నారట. కానీ డేట్స్ సర్దుబాటు కాకపోవడం కారణంగా ప్రియదర్శి ఈ సినిమాలో నటించలేదని, అందుకే ఆయన బైక్ వాడుకున్నామని సందీప్ కిషన్ పేర్కొన్నాడు. సినిమా ప్రమోషన్స్‌లో కూడా ఈ బైక్‌కి స్థానం కల్పించాలనే ఈ వీడియో షేర్ చేయడం జరిగింది. క్షమించండి అని సందీప్ కిషన్ అన్నాడు. ఇదంతా చూసి సినిమా ప్రమోషన్స్ కోసం ఇలా ఆట పట్టించడం సరికాదంటూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు.

వైవిధ్యమైన కథాంశంతో థ్రిల్లింగ్ కథాంశంగా 'నిను వీడని నీడను నేనే' ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్రంలో నటిస్తూ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు సందీప్ కిషన్. కార్తీక్ రాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అన్యాసింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. వి స్టూడియోస్, విస్తా డ్రీమ్ మర్చంట్స్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తుండగా.. ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ నెల 12 వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











