అతి అభిమానం ఆరోగ్యానికి హానికరం.. బండ్ల గణేష్ షాకింగ్ పోస్ట్
వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలుస్తుంటారు టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేష్. ఎవరు ఏమనుకున్నా సరే తన మనసుకి నచ్చినట్లుగా మాట్లాడేస్తుంటాడు. మైక్ అందుకుంటే పూనకం వచ్చినట్లు ఊగిపోయే బండ్ల గణేష్‌ను కొందరు సినిమా ఈవెంట్స్‌కి కూడా పిలవడం మానేశారు. అయితే సోషల్ మీడియా ద్వారా తను చెప్పాల్సినవి చెబుతూ బాంబు పేలుస్తున్నారు బండ్ల గణేష్. తాజాగా ఆయన చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..
కమెడియన్ నుంచి స్టార్ ప్రొడ్యూసర్‌గా
తొలుత కమెడియన్‌గా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు బండ్ల గణేష్. హీరోలకు ఫ్రెండ్‌గానో, ఇతర చిన్న పాత్రల్లో నటిస్తూ వచ్చారు. ఈ దశలో ఏకంగా నిర్మాతగా మారిపోయి షాకిచ్చాడు. పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రవితేజ వంటి స్టార్స్‌తో సినిమాలు తీయడంతో బండ్ల గణేష్ రేంజ్ మారిపోయింది. నిన్నటి వరకు చిన్నా చితకా పాత్రలు వేసిన వాడు స్టార్ హీరోలతో కోట్లాది రూపాయల ప్రాజెక్ట్స్ ఎలా చేస్తున్నాడంటూ ఇండస్ట్రీ జనాలే ముక్కున వేలేసుకున్నారు. ఆయన వెనుక ఎవరున్నారు? ఎవరు సినిమాలు తీయిస్తున్నారంటూ రకరకాల గాసిప్స్ వైరల్ అయ్యాయి.

సినిమాలకు దూరంగా
సినిమాల్లోకి వచ్చేసరికే మా కుటుంబానికి ఫౌల్ట్రీ వ్యాపారం ఉందని, ఆర్ధికంగా బలమైన ఫ్యామిలీ అని సినిమాలపై ఇష్టంతోనే ఇటువైపు వచ్చానని బండ్ల గణేష్ అందరి నోళ్లు మూయించాడు. వరుస బ్లాక్ బస్టర్స్‌తో ఇండస్ట్రీని వణికించిన ఆయన.. చివరిసారిగా ఎన్టీఆర్‌తో టెంపర్ సినిమా తీశాడు. ఈ చిత్రం ఘన విజయం సాధించినప్పటికీ కలెక్షన్స్ నామమాత్రంగానే వచ్చాయి. అప్పటి నుంచి సినిమాల నిర్మాణానికి దూరంగా ఉంటున్న బండ్ల గణేష్ రాజకీయాల వైపు వెళ్లారు. కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రచారం కూడా నిర్వహించారు. ఏదో ఒక పదవి వస్తుందని ఆశించినప్పటికీ నిరాశే ఎదురైంది.
పవన్‌ను దూరం చేశారంటూ ఆవేదన
మెగా కుటుంబానికి, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌కు వీర విధేయుడైన బండ్ల గణేష్ ఆయనపై ఈగ వాలనివ్వరు. పవన్‌ను ఎవరైనా ఏమైనా అంటే ఊరుకోరు. కొన్ని శక్తులు కలిసి తనను, పవన్ కళ్యాణ్‌కు దూరం చేశాయని బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల థియేటర్ల పర్సంటేజ్ విధానం సమయంలోనూ పవన్ కళ్యాణ్‌ను ఇబ్బంది పెట్టే పరిస్థితులు కనిపించడంతో బండ్ల గణేష్ ఫైర్ అయ్యారు. సింహాన్ని దూరం నుంచి చూడండి తప్పులేదు.. కానీ దగ్గరికి వెళ్లి కెలికితే మీ ఇష్టం అంటూ సినిమా డైలాగ్‌తో వార్నింగ్ ఇచ్చారు. అలాగే ఆస్కార్ నటులు, కమల్ హాసన్లు ఎక్కువైపోయారు, వీళ్ల నటన చూడలేకపోతున్నాం అంటూ పలువురిని ఉద్దేశించి ఇన్‌డైరెక్ట్‌గా కామెంట్ చేశాడు బండ్ల గణేష్.
అతి ప్రేమ హానికరం
తొలి నుంచి బండ్ల గణేష్ ట్వీట్స్ తల తోక లేకుండా ఓ పజిల్ మాదిరిగా ఉంటాయి. దీంతో ఆయన ఎవరిని ఉద్దేశించి పోస్టులు పెడుతున్నారన్న సందేశం కలుగుతుంది. తాజాగా ఆయన చేసిన ట్వీట్ అలాగే ఉంది. అతి ప్రేమ, అతి అభిమానం, అతి విశ్వాసం, అతి నమ్మకం ఆరోగ్యానికి హానికరమంటూ బండ్ల గణేష్ రాసుకొచ్చాడు. ఇది ఎవరిని ఉద్దేశించి చేసింది మాత్రం చిన్న హింట్ కూడా ఇవ్వలేదు. దీంతో ఈ ట్వీట్ కాస్తా ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.


Click it and Unblock the Notifications











