సమంతకు ఫామ్ హౌస్ ఇచ్చా.. ఆ పని చేయకుంటే ఈరోజు..!
టాలీవుడ్‌లోని టాప్ ప్రొడ్యూసర్‌లలో బెల్లంకొండ సురేష్ ఒకరు. ఇప్పుడంటే స్పీడ్ తగ్గింది కానీ, ఒకప్పుడు ఆయన ఇండస్ట్రీ హిట్‌లు ఇచ్చారు. ఇప్పుడు తన కుమారులను హీరోగా సెట్ చేసే పనిలో బెల్లంకొండ సురేష్ బిజీగా ఉన్నారు. ఇటీవల వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్న బెల్లంకొండ .. తన కెరీర్, ఇండస్ట్రీలో జరుగుతున్న పరిణామాలు ఇతర అంశాలతో పాటు హీరోయిన్ సమంత గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..
సినిమాలపై ఆసక్తితో సినీ రంగం వైపు అడుగుపెట్టిన బెల్లంకొండ సురేష్ .. మోహన్‌బాబు సాయంతో ప్రొడక్షన్ మేనేజర్‌గా మారారు. నిర్మాణ రంగంలో మెళకువలు , వ్యాపార లావాదేవిలు నేర్చుకున్న సురేష్ నిర్మాగా మారారు. తన చిన్న కుమారుడు సాయి గణేష్ పేరు మీద శ్రీ సాయి గణేష్ ప్రొడక్షన్స్ పేరు మీద సినిమాలు తీయాలని అనుకున్నారు. దీనిలో భాగంగా రియల్ స్టార్ డాక్టర్ శ్రీహరి హీరోగా తెరకెక్కిన సాంబయ్యను నిర్మించారు సురేష్. ఈ చిత్రం మంచి విజయం సాధించడంతో ఇక వెనుదిరిగి చూసుకోలేదు.

మా అన్నయ్య, ఆది, చెన్నకేశవరెడ్డి, లక్ష్మీ నరసింహా, నా ఆటోగ్రాఫ్, భలే దొంగలు, రైడ్, శంభో శివ శంభో, గోలిమార్, నాగవల్లి, కందిరీగ, బాడీగార్డ్, బస్‌స్టాప్, జబర్దస్త్, తడాఖా, అల్లుడు శీను, రభస వంటి చిత్రాలు నిర్మించారు. అప్పట్లో భారీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన బెల్లంకొండ జీవితంలో అగ్రనటులు బాలకృష్ణ నివాసంలో చోటు చేసుకున్న కాల్పుల ఘటన దుమారం రేపింది. 2004 జూన్ 3న హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బెల్లంకొండ సురేష్.. హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుని కోలుకున్నారు. అయితే దాదాపు ఐదేళ్ల వరకు ఆయన సినిమాలకు దూరమయ్యారు.
తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ.. తాను నిర్మాతగా మారి 25 ఏళ్లు పూర్తి చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. అయితే తొలి సినిమా దర్శకుడు నాగేశ్వరరావు, హీరో శ్రీహరి ఇద్దరి మధ్య లేకపోవడం బాధగా ఉందన్నారు. శ్రీనివాస్ కెరీర్‌లో నిలదొక్కుకున్నాడని, త్వరలో పెళ్లి కూడా చేసుకుంటాడని చెప్పారు. రెండో అబ్బాయి గణేష్ చేతిలో మంచి ప్రాజెక్ట్‌లు ఉన్నాయని ఆయన తెలిపారు.

ఇదే ఇంటర్వ్యూలో స్టార్ హీరోయిన్ సమంత గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బెల్లంకొండ. భారతీయ చిత్ర పరిశ్రమ చెప్పుకునే విధంగా నా కొడుకు లాంచింగ్ ఉండేలా ప్లాన్ చేసినట్లు తెలిపారు. స్టార్ హీరోల పక్కన నటిస్తున్న సమయంలో తన కుమారుడు సాయి శ్రీనివాస్ సరసన నటించేందుకు సమంతను ఒప్పించినట్లు తెలిపారు సురేష్. అలాగే తమన్నాను వెళ్లి అడగ్గానే ఆమె కూడా ఐటెం సాంగ్ చేసేందుకు అంగీకరించారని ఆయన వెల్లడించారు.
ఈ సినిమా కోసం నేను నా ఫామ్ హౌస్‌ను అమ్మాలని అనుకున్నానని.. అది సమంతకే విక్రయించినట్లు బెల్లంకొండ చెప్పారు. అప్పట్లో కోటి యాభై లక్షలకు దానిని విక్రయించానని.. మొత్తం 1250 గజాలు ఉంటుందని, ఇప్పుడు ఆ ప్రాంతంలో గజం రూ.2 లక్షలు ఉంటుందని సురేష్ తెలిపారు. ఈ లెక్కన అది రూ.15 కోట్లపైనే ఉంటుందని ఆయన పేర్కొన్నారు. రెమ్యునరేషన్ కింద ఫాంహౌస్ ఇచ్చినట్లుగా బెల్లంకొండ సురేష్ తెలిపారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











