మా పనైపోయిందని చంకలు గుద్దుకొన్నారు.. దిల్‌రాజు షాకింగ్ కామెంట్స్
తెలుగు చిత్ర పరిశ్రమను కనుసైగతో శాసించగల కొందరు ప్రముఖుల్లో దిల్‌రాజు కూడా ఒకరు. దాదాపు రెండున్నర దశాబ్ధాలుగా దిల్‌రాజు టాలీవుడ్‌లో తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. తొలుత డిస్ట్రిబ్యూటర్‌గా కెరీర్ ప్రారంభించిన ఆయన.. 2003లో దిల్ సినిమాతో నిర్మాతగా మారారు. తొలి చిత్రంతోనే విజయాన్ని అందుకున్న దానినే ఇంటి పేరుగా పెట్టుకున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై చాలా తక్కువ సమయంలోనే 50 సినిమాలకు పైగా తీసి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. దిల్‌రాజు సినిమా అంటే ఖచ్చితంగా ఏదో ఒక విశేషం ఉంటుందని నమ్మి థియేటర్‌కు వచ్చే వారు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఆయన తీసిన సినిమాల్లో దాదాపు 80 శాతం సక్సెస్ రేటు ఉదంటే దిల్‌రాజు జడ్జిమెంట్, ప్లానింగ్‌ను అర్ధం చేసుకోవచ్చు.
సినిమా ప్రొడక్షన్, స్క్రిప్ట్‌పై అంత గ్రిప్ సంపాదించిన దిల్‌రాజు.. వరుస బ్లాక్ బస్టర్స్‌తో దూసుకొచ్చారు. బడా బడ్జెట్ సినిమాల జోలికి వెళ్లకుండా పరిమిత బడ్జెట్‌తో సినిమాలు తీసి విజయాలను అందుకున్నారు దిల్‌రాజు. సినిమాపై నిర్మాత పట్టు పోతోంది అనుకుంటున్న దశలో ప్రొడ్యూసర్‌పై గౌరవం పెంచిన కొందరిలో ఆయన కూడా ఒకరు. తక్కువ సమయంలోనే అగ్ర నిర్మాతగా మారిన ఆయన ఇటీవల కొన్ని ఎదురుదెబ్బలు తిన్నారు.

శ్రీనివాస కళ్యాణం, శాకుంతలం, రౌడీ బాయ్స్, థాంక్యూ, ఫ్యామిలీ స్టార్, లవ్ మీ వంటి సినిమాలు డిజాస్టర్లుగా మిగిలి దిల్‌రాజు కంపెనీకి భారీ నష్టాలను మిగిల్చాయి. ఇక ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన రామ్ చరణ్ - శంకర్‌ల గేమ్ ఛేంజర్ రిజల్ట్ ఏమవుతుందోనన్న టెన్షన్ మొదలైంది. అయితే ఆ సినిమాకు కలెక్షన్లు పుంజుకోవడంతో దిల్‌రాజు ఊపిరి పీల్చుకున్నారు. ఈ నేపథ్యంలో దిల్‌రాజు జడ్జిమెంట్ తప్పుతోందని.. మునుపటిలా స్క్రిప్ట్‌పై పట్టు సాధించడం లేదనే కథనాలు వచ్చాయి.
అన్ని రంగాల్లో ఉన్నట్లే సినీ రంగంలోనూ పోటీ ఉంటుంది. దిల్‌రాజు ఎదుగుదల చూసి కొందరు తట్టుకోలేకపోతున్నారంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. తాజాగా ఇదే అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు దిల్‌రాజు సోదరుడు, నిర్మాత శిరీశ్. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో విక్టరీ వెంకటేష్ హీరోగా, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా.. సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజై ఘన విజయం సాధించింది. మూడు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్చపరిచింది.

ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ శుక్రవారం సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా శిరీశ్ మాట్లాడుతూ.. అనిల్ లేకపోయుంటే ఈరోజు మేం లేమని ఆయనను చిత్ర పరిశ్రమకు పరిచయం చేసిన ఎన్టీఆర్ ఆర్ట్స్ హరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సినిమా మిమ్మల్ని కష్టాల నుంచి గట్టెక్కిస్తుందని అనిల్ చెబుతుండేవారని.. మేం బావిలో పడిపోతున్నామని కొందరు సంతోషిస్తున్న దశలో సంక్రాంతికి వస్తున్నాం మమ్మల్ని ఒడ్డున పడేసిందని శిరీశ్ వ్యాఖ్యానించారు. నిర్మాత కొడుకు కాబట్టి వెంకటేష్ గారు ఎప్పుడు నిర్మాత క్షేమమే కోరుకుంటారని శిరీశ్ తెలిపారు. ఆ వెంటనే దిల్‌రాజు మైక్ అందుకుని ఇకపై నేను వేదికలపై మాట్లాడనని, నేను చెప్పాల్సింది శిరీశ్ చెప్పేశాడని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











