Dil Raju: దిల్ రాజు ప్లాన్ అదుర్స్.. 25 చిన్న సినిమాలతో ఓటీటీ రంగంలోకి ఎంట్రీ?
ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు అనే తేడా లేకుండా పోతుంది. కథ, కంటెంట్ బాగుంటే చిన్న చిత్రాలు కూడా సూపర్ డూపర్ హిట్లుగా నిలుస్తున్నాయి. బాక్సాఫీసు వద్ద భారీ స్థాయిలో కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి. అలాగే కథ బాలేకపోతే ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా, వేలు, వందల కోట్ల భారీ చిత్రాన్ని అయినా ఎవరూ చూడట్లేదు. ఇక ఓటీటీలు వచ్చినప్పటి నుంచి అయితే ఆ హవా మరింత ఎక్కువైంది. థియేటర్లలో విడుదల చేయలేని వారు ఓటీటీల వేదికగా తమ చిత్రాలను విడుదల చేసి ఫుల్ క్రేజ్ దక్కించుకుంటున్నారు.
దీంతో ఓటీటీ రంగాలపై క్రేజ్ అంతకంతకూ పెరిగిపోయింది. అలాగే చాలా మంది ప్రజలు థియేటర్లకు వెళ్లకుండా కాస్త ఆలస్యమైనా ఇంట్లోనే కూర్చొని అద్భుతమైన చిత్రాలన్నీ చూడొచ్చని అనుకుంటున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి అన్ని సినిమాలను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ విషయం గుర్తించిన ఓ టాప్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్.. ఇప్పటికీ ఓటీటీ రంగంలోకి అడుగు పెట్టాడు. ఆహాను తీసుకొచ్చి అనేక వెబ్ సిరీస్ లు, అద్భుతమైన ప్రోగ్రాంలతో పాటు సినిమాలను విడుదల చేస్తున్నారు. అయితే తాజాగా మరో టాప్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ను ఫాలో అవబోతున్నారు.

తెలుగు సినీ రంగానికి చెందిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు.. గురించి అందరికీ తెలిసిందే. డిస్ట్రిబ్యూటర్ గా కెరియర్ ప్రారంభించిన ఇతడు.. ప్రస్తుతం టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్నాడు. శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ నిర్మాణ సంస్థపై హిట్ సినిమాలను నిర్మిస్తూ.. దూసుకెళ్తున్నారు. పాన్ ఇండియా చిత్రాలకు కూడా దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
అద్భుతమైన చిత్రాలను నిర్మించిన ఇతడికి సినీ రంగంలో అపార అనుభవం ఉంది. ఆ అనుభవంతోనే చిన్న సినిమాలను కూడా నిర్మిస్తూ పెద్ద ఎత్తున లాభాలు ఆర్జిస్తున్నారు. ఈక్రమంలోనే ఆయన కూడా ఓటీటీ రంగంలోకి రావాలని ప్లాన్ చేస్తున్నారట. ముఖ్యంగా చిన్న సినిమాల కోసం ఈ డిసీషన్ తీసుకున్నట్లు అంతా అనుకుంటున్నారు. అయితే దిల్ రాజు ఒక్కరే ఈ దీన్ని మొదలు పెడతారా లేదా ఇంకెవరితోనైనా కలిసి ప్రారంభిస్తారా అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.

ఇప్పటికే ఓటీటీ రంగంలోకి ప్రవేశించేందుకు పనులు కూడా ప్రారంభించారని టాలీవుడ్ కోడై కూస్తోంది. 5 కోట్ల రూపాయల లోపు బడ్జెట్ తో దాదాపు 25 చిత్రాలు నిర్మించి వాటిని ఈ ఓటీటీ వేదికగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అయితే ప్రత్యేక ఓటీటీ ప్రారంభం అయ్యేసరికి చాలానే సమయం పడుతుంది. వచ్చే ఏడాది అంటే 2024వ సంవత్సరంలో అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే గనుక నిజం అయితే ఆయన నిర్మించే సినిమాలతో పాటు డిస్ట్రిబ్యూట్ చేసే చిత్రాలన్నీ ఆ ఓటీటీ వేదికగానే విడుదల అవుతాయి.


Click it and Unblock the Notifications











