గేమ్ ఛేంజర్‌పై నెగిటివ్ పబ్లిసిటీ.. మరోసారి బ్లాస్ట్ అయిన దిల్‌రాజు
ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ నటించిన సినిమా కావడంతో పాటు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన స్ట్రెయిట్ తెలుగు మూవీ కావడంతో గేమ్ ఛేంజర్‌పై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా పలు అవాంతరాలను దాటుకుని ఈ ఏడాది సంక్రాంతికి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే మిక్స్‌డ్ టాక్ కారణంగా గేమ్ ఛేంజర్ దారుణ పరాజయాన్ని మూటకట్టుకుంది.
గేమ్ ఛేంజర్‌లో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించగా అంజలి , ఎస్‌జే సూర్య, శ్రీకాంత్, సునీల్ కీలక పాత్రలు పోషించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దాదాపు రూ.450 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో గేమ్ ఛేంజర్ నిర్మించారు దిల్‌రాజు. మార్నింగ్ షో నుంచే మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న గేమ్ ఛేంజర్‌కు సోషల్ మీడియాలో ఓ వర్గం పనిగట్టుకుని చేసిన నెగిటివ్ ప్రచారం మరింత దెబ్బ కొట్టింది. రిలీజై గంటలు గడవకముందే గేమ్ ఛేంజర్ హెచ్‌డీ ప్రింట్ ఆన్‌లైన్‌లో ప్రత్యక్షం కావడం చిత్ర పరిశ్రమను ఉలిక్కిపడేలా చేసింది.

గత కొన్నేళ్లుగా దిల్‌రాజు బ్యానర్ నుంచి వచ్చిన సినిమాలు ఫ్లాప్ కావడంతో ఆయన ఆర్ధిక సమస్యల్లో ఉన్నారు. అయినప్పటికీ శంకర్ బ్రాండ్- రామ్ చరణ్ ఛరిష్మా, పైగా సంక్రాంతి సీజన్ కావడంతో ఖర్చుకు వెనుకాడకుండా గేమ్ ఛేంజర్‌ను నిర్మించారు. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడటంతో దిల్ రాజు మరిన్ని కష్టాల్లో ఇరుక్కున్నారని ఫిలింనగర్ టాక్. ఈ సమస్యల సుడిగుండంలోనే ఆదాయపు పన్ను శాఖ అధికారులు దిల్‌రాజు ఇళ్లు, కార్యాలయాలపై దాడులు నిర్వహించడం మరింత కృంగదీసింది.
రోజులు గడుస్తున్నా గేమ్ ఛేంజర్ ఎఫెక్ట్ నుంచి దిల్‌రాజు బయటికి రాలేకపోతున్నారు. తాజాగా మరోసారి ఈ సినిమాపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు ఈ స్టార్ ప్రొడ్యూసర్. వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై విక్టరీ వెంకటేష్, మహేశ్ బాబు హీరోలుగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాను దాదాపు 12 ఏళ్ల తర్వాత రీ రిలీజ్ చేయనున్నారు. మార్చి 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా దిల్‌రాజు మీడియాతో మాట్లాడారు.

ప్రేక్షకులు సినిమాను చూసే విధానం పూర్తిగా మారిపోయిందన్నారు. ఎంత పెద్ద సినిమా తీసినా అది నచ్చకుంటే మార్నింగ్ షోకే దానిని తిరస్కరిస్తున్నారని దిల్‌రాజు తెలిపారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో సినిమాలపై ట్రోలింగ్ ఓ రేంజ్‌లో జరుగుతోంది. ఒక సినిమాను నాశనం చేసే వరకు నిద్రపోవడం లేదని పరోక్షంగా గేమ్ ఛేంజర్ రిజల్ట్‌పై ఆయన వ్యాఖ్యానించారు. ఆన్‌లైన్ బుకింగ్‌ను బట్టి సినిమా రిజల్ట్ ముందే తెలిసిపోతుందని దిల్‌రాజు తెలిపారు. సీతమ్మ వాకిట్లో సినిమాను రీ రిలీజ్‌లో చూడాలని మహేశ్, వెంకటేష్ అభిమానులు కోరుకుంటున్నారు కాబట్టే అది సాకారమైందన్నారు. ఇప్పటికే 10 థియేటర్లు హౌస్‌ఫుల్ అయ్యాయని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం దిల్‌రాజు వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











