నటుడిగా మారిన నిర్మాత దిల్ రాజు.. అతిథి పాత్రతో ఏ సినిమాలో అంటే?
తెలుగు సినిమా పరిశ్రమలో పాపులర్ ప్రొడ్యూసర్, డిస్టిబ్యూటర్‌గా విశేషంగా సేవలు అందిస్తున్న సినీ ప్రముఖుడు దిల్ రాజు గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. అయితే ఇండస్ట్రీలో అనతికాలంలోనే అగ్ర నిర్మాతగా మారారు. ఆయన కేవలం నిర్మాతగానే కాకుండా తెలుగు సినిమా పరిశ్రమలో భాగమయ్యారు. అటు సినిమా రంగానికి, తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు వారధిగా నిలిచారు. అలా తనదైన సేవలు అందిస్తున్న దిల్ రాజు తాజాగా నటుడిగా మారారు. గతంలో ఎన్నోసార్లు నటించాలని పలువురు రిక్వెస్ట్ చేసినా.. రిజెక్ట్ చేశారు. కానీ తాజాగా ఓ చిత్రంలో ఓ స్పెషల్ అప్పీయరెన్స్‌తో తెర మీద కనిపించబోతున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..
దిల్ రాజు కెరీర్ విషయానికి వస్తే.. డిస్టిబ్యూటర్‌గా పవన్ కల్యాణ్ నటించిన తొలి ప్రేమ, ఖుషీ లాంటి సినిమాలను పంపిణీ చేసిన పాపులర్ అయ్యారు. ఆ తర్వాత దిల్ చిత్రానికి నిర్మాతగా మారి ఇంటి పేరునే దిల్‌గా మార్చుకొన్నారు. దిల్ చిత్రం తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సుమారుగా 50 చిత్రాలను నిర్మించారు పలు అవార్డులు, రివార్డులు అందుకొన్నారు.

తెలుగు సినీ పరిశ్రమతో ఉన్న అనుబంధం, ఇండస్ట్రీపై ఉన్న పట్టు, పరిశ్రమకు అందించిన సేవలను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం ఆయనకు తెలుగు ఫిలిం డెవలప్‌మెంట్ చైర్మన్‌గా నియమించింది. తన పదవీ కాలంలో సినిమా పరిశ్రమలోని పలు సంక్షోభాలను, సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు వెళ్తున్నారు. ప్రభుత్వానికి, సినీ పరిశ్రమకు వారధిగా నిలిచారు.
అయితే నటుడిగా ఎన్నో ఆఫర్లు తన ముందుకు వచ్చినా గానీ.. వాటిని తిరస్కరించారు. అడపదడపా చాలా తక్కువ నిడివి పాత్రలో కనిపించారు. కానీ పూర్తిస్థాయిలో అతిథి పాత్రలో నటించలేదు. కానీ తాజాగా ఓ యువ నిర్మాత కోరిక మేరకు, పాత్ర డిమాండ్ చేయడంతో దిల్ రాజు నటించేందుకు ఒప్పుకొన్నారు. ఆయన ప్రస్తుతం మిత్ర మండలి అనే చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించారని తెలిసింది.
మిత్ర మండలి సినిమా విషయానికి వస్తే.. ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ స్థాపించిన బీవీ వర్క్స్ సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై అభిరుచి గల నిర్మాతలు కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప, డా విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్నారు. సోమరాజు పెన్మెత్స సహ నిర్మాత. ఈ వినోదభరిత చిత్రానికి నూతన దర్శకుడు విజయేందర్ ఎస్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రియదర్శి, నిహారిక ఎన్ఎమ్, విష్ణు ఓఐ, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
వెండితెరపై నవ్వుల టపాసులు పేల్చడానికి, దీపావళి కానుకగా అక్టోబర్ 16న 'మిత్ర మండలి' చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్ సందర్భంగా ఈ చిత్రంలో ప్రముఖ వ్యక్తి నటిస్తున్నారు అంటూ నిర్మాత బన్నీ వాసు హింట్ ఇచ్చారు. అయితే ఆయన సినీ ప్రముఖుడి పేరు గోప్యంగా ఉంచినప్పటికీ.. ఆ సినీ ప్రముఖుడు దిల్ రాజు అనే విషయం బయటకు వచ్చింది.


Click it and Unblock the Notifications











