‘‘ బాలయ్య హ్యాట్రిక్.. ఎన్టీఆర్‌ను అలా దించేశాడు, వన్స్ హీ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్ ’’
అన్న నందమూరి తారక రామారావు నట వారసుడిగా తెలుగు తెరపై ఎంట్రీ ఇచ్చారు బాలకృష్ణ. 1974లో తండ్రి స్వీయ దర్శకత్వంలో వచ్చిన ''తాతమ్మ కల '' సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమయ్యారు బాలయ్య. తండ్రిలాగే పౌరాణిక, జానపద, సాంఘిక, చారిత్రాత్మ, సోషియో ఫాంటసీ వంటి అన్ని రకాల జోనర్స్‌లలో నటించారు. ఈ తరంలో పౌరాణిక చిత్రాల్లో నటించిన అరుదైన హీరో బాలయ్య. తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి ఐదు దశాబ్ధాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సెప్టెంబర్ 1న టాలీవుడ్ ఆయనను సన్మానించనుంది.
60 ప్లస్‌లోనూ కుర్ర హీరోలకు మించి శ్రమిస్తున్నారు . రెండేళ్లకొకసారి సినిమాలు చేయడం తన డిక్షనరీలోనే లేదని చెబుతూ ఏడాది రెండు లేదంటే కనీసం ఒక్క సినిమా అయినా రిలీజ్ చేయాలనే సూత్రాన్ని తూచా తప్పకుండా ఫాలో అవుతున్నారు. ఆహా ఓటీటీ ఫ్లాట్‌ఫాంపై అన్‌స్టాపబుల్ అంటూ అడుగుపెట్టి దానికి తిరుగులేని క్రేజ్ తీసుకొచ్చారు. సెలబ్రిటీలతో బాలయ్య చేసే సందడి ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం అన్‌స్టాపబుల్ షో కారణంగానే ఆహా రేటింగ్స్, సబ్‌స్క్రైబర్లు పెరిగారంటే అతిశయోక్తి కాదు. త్వరలోనే అన్‌స్టాపబుల్ 3తో మనముందుకు రానున్నారు ఈ నందమూరి అందగాడు.

ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ .. బాబీ దర్శకత్వంలో తన 109వ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీలో బాలయ్య మూడు గెటప్స్‌లో కనిపించనున్నారని టాక్. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్, పోస్టర్స్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. సినిమాలు, షూటింగ్సే కాదు బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రి ఛైర్మన్‌గా వేలాది మందికి నాణ్యమైన వైద్యం అందేలా చేస్తున్నారు. క్యాన్సర్ పరిశోధన, చికిత్సలలో ఈ సంస్థ దేశంలోనే అగ్రగామిగా దూసుకెళ్తోందంటే అందుకు బాలకృష్ణ కృషి ఎంతో ఉంది. ఇక తండ్రి అడుగు జాడల్లోనే రాజకీయాల్లోకి ప్రవేశించి తన కుటుంబానికి కంచుకోట వంటి హిందూపురం నుంచి వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ అందుకున్నారు.
ఇదిలాఉండగా.. బాలకృష్ణ పొలిటికల్ లైఫ్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు సీనియర్ నిర్మాత కైకాల నాగేశ్వరరావు. ఓ ఛానెల్‌తో ఆయన మాట్లాడుతూ.. సినిమా వాళ్లలో రెండోసారి పోటీ చేసి గెలిచిన వారు చాలా తక్కువన్నారు. గతంలో కొంగర జగ్గయ్య, సూపర్‌స్టార్ కృష్ణ, కృష్ణంరాజు ఓడిపోయారని గుర్తుచేశారు. కానీ ఒక్క బాలయ్య మాత్రమే హ్యాట్రిక్ విక్టరీ కొట్టారని ప్రశంసించారు. సినిమాలను , రాజకీయాలను బ్యాలెన్స్ చేయడం సామాన్యమైన విషయం కాదన్నారు.
గతంలో ప్రజలు ప్రకృతి విపత్తుల బారిన పడినప్పుడు ఎన్టీఆర్ ముందుండి బాధితులకు బాసటగా నిలిచేవారని నాగేశ్వరరావు గుర్తుచేశారు. సొసైటీపై కళాకారుడికి బాధ్యత ఉంటుందన్న తండ్రి బాటలోనే బాలకృష్ణ కూడా బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రిని అభివృద్ధి చేస్తున్నారని నాగేశ్వరరావు ప్రశంసించారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నందమూరి ఫ్యాన్స్ ఈ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











