టికెట్ ధరలపై స్టార్ ప్రొడ్యూసర్ వివరణ.. రూపాయిలో నిర్మాతకి మిగిలేది ఎంతంటే?
Producer SKN Explains Movie Ticket Pricing: ఐబొమ్మ రవి అరెస్ట్ తర్వాత సినిమా టికెట్ల ధరలపై పెద్ద ఎత్తున చర్చ ప్రారంభమైంది. "థియేటర్లలో రేట్లు ఎక్కువ.. అందుకే పైరసీ చూస్తున్నాం" అంటూ కొంతమంది నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తుండగా, మరోవైపు "థియేటర్లలోకి వెళ్లాలంటే కుటుంబంతో ఖర్చు భరించలేం" అంటూ మధ్యతరగతి ప్రేక్షకులు తమ వాదన వినిపిస్తున్నారు. ఇలా భిన్నాప్రాయాలు వెలువడుతున్న వేళ టాలీవుడ్ నిర్మాత ఎస్.కే.ఎన్ (Producer SKN) టికెట్ల ధరలపై, దాని వల్ల ఎవరికి లాభం వస్తుందనేదానిపై తనదైన శైలీలో విశ్లేషించాడు. ఇంతకీ ఏమన్నారంటే..
టాలీవుడ్ నిర్మాత ఎస్కేఎన్ (Producer SKN) తన ఎక్స్ (ట్విట్టర్) పోస్ట్‌తో ఈ చర్చకు స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఎస్కేఎన్ షేర్ చేసిన మల్టీప్లెక్స్ బిల్లు ప్రకారం.. నలుగురు సభ్యులు ఉన్న కుటుంబం ఒక సినిమాకు వెళితే మొత్తం ఖర్చు రూ. 2,178. ఇందులో టికెట్ల ధర రూ. 880 కాగా, పాప్కార్న్, నాచోస్, కోల్డ్ డ్రింక్స్ వంటి ఫుడ్,బేవరేజెస్ రూ. 1,298 వరకు చేరాయి. ఈ లెక్కను చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. సినిమాలో కూర్చుని గడిపిన రెండున్నర గంటలకు కంటే, లాబీలో కొనుగోలు చేసే వస్తువులే ఎక్కువ ఖర్చు అవుతున్నాయి. టికెట్ ధరల్లో నిర్మాతకు ఎంత వస్తుందనే విషయంలో ఎస్కేఎన్ మరింత స్పష్టత ఇచ్చాడు.

' ఇందులో రూ 880 టికెట్ అమౌంట్‌లో జీఎస్‌టీ రూపంలో రూ. 134, థియేటర్/మల్టీప్లెక్స్ వాటాగా రూ. 374 పోతాయని, చివరికి నిర్మాత చేతికి పడేది కేవలం రూ. 372 మాత్రమేనని లెక్కలు చూపించాడు. అంటే మొత్తం రూ. 2,178లో నిర్మాతకు వస్తున్నది సుమారుగా 17.08% మాత్రమే, మిగిలిన 83% మల్టీప్లెక్స్ యాజమాన్యం, పన్నులు, ఆన్‌లైన్ బుకింగ్ ఛార్జీలుగా వెళ్లిపోతాయని చెప్పాడు పైగా పాప్‌కార్న్, సమోసా, కూల్‌డ్రింక్స్, థియేటర్ యాడ్స్ వంటివి అన్నీ పూర్తిగా ఎగ్జిబిటర్‌కే లాభమని, నిర్మాతకు ఒక్క రూపాయి కూడా రాదని స్పష్టం చేశాడు.
వాటితో నిర్మాతలకు సంబంధమే లేదు
నిర్మాత ఎస్కేఎన్ స్పష్టం చేసిన మరో కీలక అంశం ఏమిటంటే..? థియేటర్‌లో ఫుడ్, బేవరేజెస్ పై ఖర్చు చేసే వాటిలో నిర్మాతకు ఒక్క రూపాయి కూడా రాదు. పాప్‌కార్న్, కోల్డ్ డ్రింక్స్, నాచోస్, కాఫీ ఏ వస్తువైనా 100% మల్టీప్లెక్స్ ఆదాయం. పార్కింగ్ ఛార్జీలు, థియేటర్‌లో కనిపించే ప్రీ-షో యాడ్స్ కూడా ఎగ్జిబిటర్ వాటానే. నిర్మాతకు దానిలో ఏ భాగస్వామ్యం ఉండదని ఆయన తెలిపాడు. "థియేటర్‌లో ఖర్చు చేసే ప్రతి రూపాయిలో 83 పైసలు ఎగ్జిబిటర్ల జేబులో పడుతున్నాయి. నిర్మాతకు 17 పైసలు మాత్రమే" అంటూ తన వాదన చెప్పే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఈ నిర్మాత పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
నెటిజన్ల రియాక్షన్
నిర్మాత ఎస్కేఎన్ పోస్ట్ వైరల్ కాగానే నెటిజన్లు నుంచి విభిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. "థియేటర్‌లో సినిమా చూస్తే కనీసం పాప్‌కార్న్ కూడా కొనలేని పరిస్థితి. టికెట్ రేట్లు, ఫుడ్ రేట్లు తగ్గించాలి" అని కొందరూ కామెంట్స్ చేయగా.. దానికి ఎస్కేఎన్ రిప్లై ఇస్తూ.. "పాప్‌కార్న్ ధరను మేము నిర్ణయించము. అది ఎగ్జిబిటర్ల నిర్ణయం. నిర్మాతను తప్పుపట్టడం సరైంది కాదు." అని వివరణ ఇచ్చారు. మరికొందరూ "4 వారాలు ఆగితే OTTలో వస్తుంది. థియేటర్‌కు ఎందుకు వెళ్లాలి?" అని కామెంట్స్ పై ఎస్కేఎన్ స్పందించారు. "OTT చూడొచ్చు.. అది సమస్య కాదు. కానీ పైరసీని జస్టిఫై చేయొద్దు. టికెట్ ధరల పాపాన్ని నిర్మాతలపై మాత్రమే మోపడం కాదు' అని కామెంట్ చేశారు.
చర్చకు మరో రకమైన కోణం కూడా వెలుగులోకి వచ్చింది. కొందరు నిర్మాతలే బడ్జెట్ పెంచుతున్నారని కామెంట్స్ చేయగా.. "స్టార్లకు కోట్ల రెమ్యూనరేషన్‌లు, అంటు మరికొందరూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరూ "ఒకే సినిమాలో రెండు రాష్ట్రాల్లో రెండు రెట్లు ధర ఎందుకు?" అని ప్రశ్నిచారు. మొత్తానికి ఓ ట్విట్ తో ఎన్నో వాదనలు వెల్లువెత్తాయి. ఏదిఏమైనా.. పైరసీ, ఓటీటీ, స్టార్ల రెమ్యూనరేషన్, థియేటర్ ఖర్చులు అన్ని కలిసి సినిమా భవిష్యత్తును నిర్ణయిస్తాయని చెప్పవచ్చు.


Click it and Unblock the Notifications











