నీ బాత్‌రూమ్‌లోకి రాలేను.. హీరోయిన్‌తో అసభ్యంగా .. కొత్త వివాదంలో నిర్మాత ఎస్‌కేఎన్
వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తుంటారు టాలీవుడ్ యువ నిర్మాత ఎస్‌కేఎన్. జర్నలిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ టాలీవుడ్‌లోని ప్రముఖ నిర్మాతల్లో ఒకరిగా నిలిచారు. ఈ రోజుల్లో, భలే భలే మగాడివోయ్ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా, మహానుభావుడు, ప్రతిరోజు పండగే, పక్కా కమర్షియల్ సినిమాకు కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు ఎస్‌కేఎన్. మాస్ మూవీ మేకర్స్ ప్రొడక్షన్ హౌస్ బ్యానర్‌పై రొమాన్స్, మంచి రోజులొచ్చాయ్, 3 రోజెస్, బేబీ సినిమాలు నిర్మించారు. బేబీ సినిమా భారీ బ్లాక్ బస్టర్ కావడంతో ఇండస్ట్రీలో ఆయన పేరు మారుమోగిపోయింది. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ సినిమా భారీ లాభాలను తెచ్చిపెట్టింది.
తెలుగు హీరోయిన్‌లపై వ్యాఖ్యలు
తక్కువ బడ్జెట్‌లోనే మంచి సినిమాలు తీస్తాడన్న పేరు తెచ్చుకున్న ఎస్‌కేఎన్ వేదికలపై మైక్ అందుకుంటే పూనకం వచ్చినట్లు ఊగిపోతారు. కొద్దిరోజుల క్రితం ప్రదీప్ రంగనాథన్ నటించిన రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ అనే సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు వచ్చిన ఎస్‌కేఎన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలుగు అమ్మాయిలను ఇకపై ఎంకరేజ్ చేయనని, వారిని ఎంకరేజ్ చేస్తే ఏం జరుగుతుందో బాగా బుద్ధొచ్చిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే వేదికపై ఆ సినిమా హీరోయిన్ కాయదు లోహర్‌పై డబుల్ మీనింగ్ డైలాగ్స్ కొట్టారు.

కాయదు లోహర్‌పై ఎస్‌కేఎన్ సెటైర్లు
ఈ సినిమా హీరోయిన్ కాయల్.. కాయలా? పళ్లా.. తెలుగులో కాయలు, పళ్లు అంటే చాలా అర్ధాలు ఉంటాయంటూ వ్యాఖ్యానించారు ఎస్‌కేఎన్. ఈ వ్యాఖ్యలు వివాదాస్పదం కాగా.. నెటిజన్లు ట్రోలింగ్‌కు దిగారు. హీరోయిన్ రేఖా భోజ్ ఘాటుగా స్పందించారు. ఎస్‌కేఎన్ మాటలు చూస్తుంటే టాలీవుడ్‌లో తెలుగు అమ్మాయిలపై అనధికార నిషేధంలా ఉన్నాయని మండిపడ్డారు. ఇంటా బయటా విమర్శల నేపథ్యంలో ఎస్‌కేఎన్ స్పందించారు. టాలీవుడ్‌లో తెలుగు అమ్మాయిల్ని ప్రోత్సహించే వారిలో తాను కూడా ఒకరినని చెప్పారు. తన సంస్థ నుంచి దాదాపు 12 మంది హీరోయిన్స్ ఎంట్రీ ఇచ్చారని.. దాదాపు 25 మందిని ఇండస్ట్రీకి పరిచయం చేయాలన్నది తన టార్గెట్ అని చెప్పారు.
కేతిక బాత్‌రూమ్‌లోకి యాక్సెస్ ఉండదంటూ కామెంట్స్
తాజాగా కార్తీక్ రాజు దర్శకత్వంలో శ్రీవిష్ణు, ఇవానా, కేతిక శర్మలు నటించిన సింగిల్ సినిమా సంచలన విజయం సాధించింది. చిన్న సినిమాగా వచ్చి నిర్మాతలకు భారీ లాభాలను అందిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర యూనిట్‌ను ఎస్‌కేఎన్ సరదాగా ఇంటర్వ్యూ చేశారు. దీనికి శ్రీవిష్ణు, ఇవానా, కేతిక శర్మ, వెన్నెల కిషోర్ హాజరవ్వగా.. కేతికను కొన్ని ప్రశ్నలు వేశారు ఎస్‌కేఎన్. ఈ క్రమంలో ఓ ప్రశ్న అసభ్యకరంగా అనిపించింది. మీరు బాత్‌రూం సింగర్ అని టాక్.. మీ బాత్‌రూమ్‌లోకి మాకు ఎలాగూ యాక్సెస్ ఉండదు కాబట్టి మా కోసం ఇక్కడే ఓ పాట పాడండి అని ఎస్‌కేఎన్ అడిగారు.
ఎస్‌కేఎన్‌పై నెటిజన్ల ట్రోలింగ్
ఊహించని ఈ ప్రశ్నతో సింగిల్ మూవీ యూనిట్ షాకైంది. కేతిక కూడా కాస్త ఇబ్బందిగానే ఫీలైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా హీరోయిన్‌ను పాట పాడమని అడిగే విధానం ఇదేనా? అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ వివాదం ఎటు దారి తీస్తుందో? నిర్మాత ఎస్‌కేఎన్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











