బడా ఓటీటీ సంస్థ మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. మళ్ళీ వెంకీ సినిమాపై ప్రభావం
ఓటీటీ సంస్థలు టైమ్ చూసుకొని పెద్ద సినిమాలను లాగేసుకునేందుకు గట్టిగానే ప్రయత్నం చేస్తున్నాయి. ఒకవైపు నిర్మాతలు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న సమయంలోనే వారి కష్టాల నుంచి గట్టెక్కించే విధంగా ఆఫర్లు ప్రకటిస్తున్నారు. ఆలస్యమైతే నష్టపోయే అవకాశం ఉందేమో అనే అనుమానాలతో నిర్మాతలు కూడా వారి సేవలను ఈజీగా ఓటీటీ సంస్థల చేతుల్లో పెట్టేస్తున్నారు. ఇటీవల కాలంలో కొన్ని మీడియం బడ్జెట్ సినిమాలు డైరెక్ట్ గా ఓటీటీలో విడుదలైన విషయం తెలిసిందే. అయితే పెద్ద సినిమాలపై కూడా ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. ముఖ్యంగా డిస్ని ప్లస్ హాట్ స్టార్ త్వరలోనే కొన్ని తెలుగు సినిమాలను దక్కించుకోవాలని అనుకుంటోంది. ఇప్పటికే నితిన్ రీమేక్ మూవీ అందాదున్ అయినటువంటి మాస్ట్రోను డైరెక్ట్ గా హాట్ స్టార్ లో విడుదల చేసిన విషయం తెలిసిందే.
ఇటీవల రామ్ చరణ్ తేజ్ బ్రాండ్ అంబాసిడర్ గా సెట్ చేసుకున్న హాట్ స్టార్ సంస్థ మరిన్ని కొత్త సినిమాలతో జనాలను ఎట్రాక్ట్ చేసేందుకు సిద్ధమవుతోంది. త్వరలోనే వెంకటేష్ కొత్త సినిమా కూడా దక్కించుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు టాక్ అయితే వస్తోంది. ఆ సినిమా మరేదో కాదు. వెంకటేష్ పూర్తి చేసిన మలయాళం హిట్ మూవీ దృశ్యం 2 అని తెలుస్తోంది. ఇదివరకే వెంకటేష్ నటించిన తమిళ్ రీమేక్ మూవీ అయినటువంటి నారప్ప డైరెక్ట్ గా అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన విషయం తెలిసిందే. ఆ సినిమా విడుదలకు ముందు హీరో వెంకటేష్ అయితే నిర్మాతలతో గట్టిగానే పోరాడాడు. నిర్మాతల్లో అన్నయ్య అయినటువంటి సురేష్ దగ్గుబాటి ఉన్నప్పటికీ వెంకటేష్ ధైర్యం చేసి సినిమాను ఎట్టి పరిస్థితుల్లో కూడా థియేటర్స్ లో విడుదల చేయాలని గట్టిగా వాదించారు.

కానీ పరిస్థితులు కూడా అనుకూలంగా లేకపోవడంతో వెంకటేష్ కూడా వెనక్కి తగ్గాల్సి వచ్చింది. అయితే ఈ సినిమా వరకే ఇలా జరిగిందని తదుపరి సినిమా విషయంలో మరొకసారి ఇలా జరగదని ఇప్పటికే వెంకీ అభిమానులకు క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం వెంకటేష్ తదుపరి సినిమా దృశ్యంకు కూడా ఓటీటీ ఆఫర్స్ గట్టిగానే వస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్ టికెట్ రేట్ల విషయంలో ఇంకా సరైన సమాధానం రాకపోవడంతో నిర్మాత సురేష్ బాబు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. అసలు ఈపాటికె దృశ్యం 2 థియేటర్స్ లో విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కరోనా ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్ లో మార్కెట్ కు పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్ల వెనక్కు తగ్గాల్సి వస్తోంది.
ఇక ఇటీవల డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఒక భారీ ఆఫర్ ను అయితే ప్రకటించినట్లు తెలుస్తోంది. సాధారణంగా ఇంట్రెస్ట్ లేకపోతే నిర్మాతలు వెంటనే ఆఫర్ ను రిజెక్ట్ చేస్తారు. కానీ నిర్మాత సురేష్ బాబు మాత్రం దృశ్యం 2 విషయంలో ఇంకా ఆ నిర్ణయానికి రాలేదట. అందుకే హాట్ స్టార్ ఆఫర్ ను వెయిటింగ్ లిస్టులో పెట్టినట్లు తెలుస్తోంది. త్వరలోనే మరొకసారి చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు అయితే గట్టిగానే కథనాలు వెలువడుతున్నాయి. పరిస్థితులు ఇలాగే కొనసాగితే మరో సారి వెంకటేష్ సినిమా డైరెక్ట్ గా ఓటీటీ లోకి వెళ్లే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.


Click it and Unblock the Notifications











