Kantara 2: సమ్మర్ కానుకగా రిషబ్ శెట్టి 'కాంతార 2'.. సీక్వెల్ కాకుండా అలా.. నిర్మాత క్లారిటీ!
మంచి కంటెంట్ ఉన్న సినిమా చిన్నదైనా, అది ఎక్కడ ఉన్నా.. ఏ ఇండస్ట్రీది అయినా సినీ లోకానికి పరిచయం చేసి హిట్ అందిస్తారు ప్రేక్షకులు. ఇటీవల చిన్న సినిమాగా విడుదలై యావత్ దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న చిత్రం కాంతార. కన్నడ హీరో రిషబ్ షెట్టి నటించి స్వీయ దర్శకత్వం వహించిన ఈ సినిమా రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను కొల్లగొట్టిన విషయం తెలిసిందే. ముందుగా కన్నడ నాట రిలీజైన ఈ సినిమాను తర్వాత నిర్మాణ సంస్థ హోంబలే ఫిలీంస్ ప్రాంతీయ భాషల్లోనూ విడుదల చేసింది. దీంతో ఎనలేని క్రేజ్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమాకు సీక్వెల్ వస్తుందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే కాంతార 2 సినిమాపై క్లారిటీ ఇచ్చారు మూవీ నిర్మాత.

15 రోజుల తర్వాత..
కన్నడ చిత్ర పరిశ్రమలో బాక్సాఫీస్ వద్ద రికార్డ్ క్రియేట్ చేసిన కాంతార సినిమా దేశవ్యాప్తంగా అదరగొట్టింది. కన్నడ హీరో, డైరెక్టర్ రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో ఒక చిన్న సినిమాగా కర్ణాటకలో సెప్టెంబర్ 30న విడుదలైంది. అతి తక్కువ సమయంలోనే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. దీంతో 15 రోజుల తర్వాత ఇతర భాషల్లోకి (తెలుగు, హిందీ, తమిళం) డబ్ చేసి విడుదల చేశారు. ఇతర భాషల్లో కూడా తన సత్తా చాటి మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా రూ. 400 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.

హీరోగా-దర్శకుడిగా..
కేవలం రూ. 16 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన కాంతార సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ. 60 కోట్లు సాధించింది. యశ్ నటించిన కేజీఎఫ్ వంటి భారీ బడ్జెట్ సినిమాను తెరకెక్కించిన హోంబలే ఫిలీంస్ ఈ చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. ఫలితంగా హోంబలే ఫీలింస్ సక్సెస్ ఫుల్ నిర్మాణ సంస్థగా పేరు తెచ్చుకుంది. ఈ సినిమాకు హీరోగా, డైరెక్టర్ గా మెస్మరైజ్ చేశాడు రిషబ్ శెట్టి. క్లైమాక్స్ చివరిలో తన నట విశ్వరూపం చూపించి ప్రేక్షకులను ఫిదా చేశాడు. ఈ సినిమాపై ఎంతోమంది సినీ ప్రముకులు ప్రశంసలు కురిపించారు.

సీక్వెల్ కాకుండా..
ఇదిలా ఉంటే కాంతార సినిమాకు సీక్వెల్ రానుందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా కాంతార 2 ఉంటుందని హోంబలే ఫిల్మ్స్ నిర్మాతల్లో ఒకరైన విజయ్ కిరగందూర్ క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ కాంతార 2 సినిమా షూటింగ్, విడుదల తేది గురించి చెప్పుకొచ్చారు. అయితే కాంతార 2 చిత్రం సీక్వెల్ కాకుండా ప్రీక్వెల్ గా తెరకెక్కిస్తున్నారని ఆయన తెలిపారు.

తండ్రి పాత్ర పెంచుతూ..
కాంతార సినిమాలో రిషబ్ శెట్టి తండ్రి పాత్ర కొన్ని నిమిషాలు మాత్రమే ఉంటుంది. అలాగే భూతకోల నేపథ్యాన్ని కూడా ఎక్కువగా వివరించలేకపోయారని టాక్ వచ్చింది. ఈ నేపథ్యంలో సీక్వెల్ కు బదులు ప్రీక్వెల్ తెరకెక్కిస్తే బాగుంటుందని దర్శకనిర్మాతలు భావించారట. ప్రీక్వెల్ చిత్రంలో రిషబ్ శెట్టి తండ్రి పాత్రను పెంచడంతోపాటు భూతకోల గురించి మరింత వివరంగా చూపిస్తారట. అందుకోసం ఇప్పటికే రిషబ్ శెట్టి కథ కూడా రాసుకున్నాడని సమాచారం.

కాంతార 2పై వర్క్ స్టార్ట్..
కాంతార 2 చిత్రంలో పంజర్లీ దైవం మధ్యం ఒప్పందం, భూమిని దానం చేసిన తర్వాత అతని వారసులు మళ్లీ భూమిని లాక్కునే ప్రయత్నం చేయడం, అది అడ్డుకునేందుకు రిషబ్ శెట్టి తండ్రి చేసే పోరాటం చూపించే అవకాశం ఉంది. ఇంటర్వ్యూలో విజయ్ కిరగందూర్ మాట్లాడుతూ.. రిషబ్ శెట్టి ఇప్పటికే కాంతార 2పై వర్క్ స్టార్ట్ చేశాడు. మేము కూడా షూటింగ్ కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం అని ఆయన పేర్కొన్నారు.

సమ్మర్ కానుకగా..
కాంతార 2 చిత్రంలో కొన్ని కీలక సన్నివేశాలు వర్షంలో ఉండనున్నాయి. అందుకోసం సన్నివేశాలు నేచురల్ గా ఉండేందుకు జూన్ లో చిత్రీకరణ ప్రారంభించాలని నిర్ణయించుకున్నాం. పాన్ ఇండియా మూవీగా కాంతార 2ని వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో విడుదల చేస్తాం. ఒకవేళ కుదరకపోతే మే నెలలో కచ్చితంగా రిలీజ్ చేస్తాం అని తెలిపారు నిర్మతా విజయ్ కిరగందూర్. అంటే కాంతార 2 సినిమా ప్రీక్వెల్ గా 2024 సంవత్సరంలో జున్ లో కానీ, లేదా సమ్మర్ కానుకగా మేలో ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











