RB Choudary Passed Away: ప్రముఖ నిర్మాత ఆర్బీ చౌదరీ దుర్మరణం.. షాక్‌లో పవన్ కల్యాణ్!
దక్షిణాది సినిమా పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకొన్నది. తెలుగు, తమిళం, మలయాళ, కన్నడ, హిందీ రంగాల్లో అద్బుతమైన చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత, సూపర్ గుడ్ ఫిలింస్ అధినేత ఆర్బీ చౌదరీ దుర్మరణం చెందారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన ఆకస్మిక మరణం చెందారు అని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఆర్బీ చౌదరీ మరణ వార్తతో దక్షిణాది సినిమా పరిశ్రమ విషాదంలో కూరుకుపోయింది. ఆయన మరణాన్ని జీర్ణించుకోలేని ప్రముఖులు దిగ్బ్రాంతికి గురయ్యారు. ఆయన మరణానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..
ఆర్బీ చౌదరీ గారు వ్యక్తిగత పనులపై రాజస్థాన్‌లో పర్యటిస్తున్నారు. ఆయన ఉదయ్‌పూర్ సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. కారు ముందు భాగం డివైడర్‌ను ఢీకొట్టడంతో పూర్తిగా ధ్వంసమైంది. దాంతో ఆయనకు తీవ్ర గాయాలు అయ్యాయి. హాస్పిటల్‌కు తరలించే క్రమంలో ఆయన తుదిశ్వాస విడిచారు అనేది తాజా సమాచారం. ఆయన మరణం విషయం తెలుసుకొన్న పవన్ కల్యాణ్, ఇతర నేతలు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు.

తెలుగులో కుటుంబ నేపథ్యం ఉన్న సినిమాలు సుస్వాగతం, సూర్యవంశం, రాజా, శ్రీను, నువ్వు వస్తావని, నిన్నే ప్రేమిస్తా, ప్రియమైన నీకు, సింహరాశి, స్నేహమంటే ఇదేరా, సంక్రాంతి, అన్నవరం, నవ వసంతం, గోరింటాకు, భీమిలి కబాడ్డీ జట్టు తదితర చిత్రాలను ఆయన నిర్మించారు.
దళపతి విజయ్‌తో ఆర్బీ చౌదరీ పలు చిత్రాలను నిర్మించారు. విజయ్ కెరీర్ ఆరంభంలో పూవే ఉనక్కాగ, లవ్ టుడే, తుళ్లాత మనముమ్ తుళ్లుమ్, షాజహాన్, తిరుపాచ్చి, జిల్లా చిత్రాలను నిర్మించారు.
రాజస్థానీ కుటుంబానికి చెందిన ఆర్బీ చౌదరీ చెన్నైలో జన్మించారు. నిర్మాతగా మారక ముందు స్టీల్, ఎగుమతి, దిగుమతుల వ్యాపారం, జ్యువెల్లరీ బిజినెస్‌లో రాణించారు. మలయాళ చిత్ర పరిశ్రమలో సూపర్ అనే బ్యానర్ స్థాపించి తొలిసారి సినిమాను నిర్మించారు. ఆ తర్వాత ఆర్ మోహన్ అనే వ్యాపారవేత్తతో కలిసి తమిళంలో సినిమాల నిర్మాణం చేపట్టారు.
తమిళ కుటుంబానికి చెందిన మహజాబీన్‌ను ఆర్బీ చౌదరీ వివాహం చేసుకొన్నారు. ఆయనకు నలుగురు కుమారులు. జీవన్ వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు. జీతన్ రమేష్, జీవా సినిమా ఇండస్ట్రీలో నటులుగా సుపరితులు. రంగం సినిమా ద్వారా జీవా పాపులారిటీని సంపాదించుకొన్న విషయం తెలిసిందే.
ప్రముఖ నిర్మాత, సూపర్ గుడ్ ఫిల్మ్ అధినేత శ్రీ ఆర్ బి చౌదరి గారు మరణం దిగ్భ్రాంతి కలిగించింది అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీ చౌదరి గారు దుర్మరణం చెందారనే దుర్వార్త నమ్మలేకపోయాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. నేను నటించిన 'సుస్వాగతం' చిత్రాన్ని శ్రీ చౌదరి గారు నిర్మించారు. ఘన విజయం సాధించింది. చిత్ర నిర్మాణం, సంబంధిత వ్యాపారంపై సాధికారత ఆయనకి సొంతం. కుటుంబ సమేతంగా చూడదగ్గ కథలను ఎంపిక చేసుకుని, చక్కటి గీతాలు ఉండేలా చిత్రాలు నిర్మించారు. అన్నవరం చిత్రంలోని సిస్టర్ సెంటిమెంట్ కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇటు తెలుగు, అటు తమిళ చిత్ర పరిశ్రమల్లో నిర్మాతగా ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. శ్రీ ఆర్ బి చౌదరి గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తమ సంతాప సందేశాన్ని విడుదల చేశారు.


Click it and Unblock the Notifications