భయపడొద్దు .. వచ్చేస్తా, అరెస్ట్‌కు ముందు స్నేహారెడ్డికి ముద్దు .. భార్యే అల్లు అర్జున్ ధైర్యం
పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట చోటు చేసుకుని రేవతి అనే వివాహిత చనిపోగా.. ఆమె కుమారుడి పరిస్ధితి విషమంగా ఉంది. ఈ కేసుకు సంబంధించి టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ పరిణామాలతో తెలుగు చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు.
ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన అల్లు అర్జున్ ఓ వీడియో సందేశాన్ని రిలీజ్ చేశారు. బాధిత కుటుంబానికి అండగా నిలుస్తామని తెలిపారు. అలాగే ఆ కుటుంబానికి రూ. 25 లక్షల నష్టపరిహారం అందిస్తామని, త్వరలోనే రేవతి ఫ్యామిలీని వ్యక్తిగతంగా కలుస్తానని అల్లు అర్జున్ తెలిపారు. పుష్ప 2 సక్సెస్ మీట్‌లోనూ ఆయన ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. అటు పోలీసులు చట్టప్రకారం తమ పని తాము చేసుకుంటూ వెళ్లారు.

మృతురాలు రేవతి భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిక్కడపల్లి పోలీసులు రంగంలోకి దిగారు. తొక్కిసలాటపై అల్లు అర్జున్, అతని సిబ్బంది, సంధ్య థియేటర్ యాజమాన్యంపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే అల్లు అర్జున్ ఆ ప్రాంతానికి వస్తున్నట్లు తమకు ముందస్తు సమాచారం ఇవ్వలేదని పోలీసులు చెబుతున్నారు. పెద్ద ఎత్తున గుమిగూడిన అభిమానులను అదుపు చేసేలా ముందస్తు భద్రతను ఏర్పాటు చేయకపోవడంతోనే తొక్కిసలాట జరిగిందని వారు అంటున్నారు. అయితే ఈ వ్యాఖ్యలను సంధ్య థియేటర్ యాజమాన్యం ఖండిస్తోంది. డిసెంబర్ 4, 5 తేదీల్లో భద్రత కల్పించాల్సిందిగా తాము 2వ తేదీనే చిక్కడపల్లి ఏసీపీకి లేఖ రాశామని దానిని ఇప్పుడు బయటపెట్టింది.
ఈ కేసులో అరెస్ట్ తర్వాత అల్లు అర్జున్‌కి గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం నాంపల్లి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. అటు తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను కొట్టేయాల్సిందిగా బన్నీ దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఏ క్షణాన ఏం జరుగుతుందోనని తెలుగు నాట ఉత్కంఠ నెలకొంది. పరిస్ధితుల దృష్ట్యా అల్లు అర్జున్ నివాసం, నాంపల్లి కోర్టు, తెలంగాణ హైకోర్టు, చంచల్‌గూడ జైలు పరిసరాల్లో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

అంతకుముందు శుక్రవారం ఉదయం అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేయడానికి పోలీసులు రావడంతో ఆయన సతీమణి స్నేహారెడ్డి భయాందోళనలకు గురయ్యారు. దీంతో ఆమెను ఓదార్చి, ధైర్యం చెప్పారు బన్నీ. పోలీస్ వ్యాన్ ఎక్కేముందు భార్యను ముద్దాడి బయల్దేరారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఇది చూసిన అభిమానులు భార్య అంటే అర్జున్‌కు ఎంత ప్రేమో అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరైతే స్నేహారెడ్డే తన ధైర్యమని అల్లు అర్జున్ పలు సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తున్నారు.


Click it and Unblock the Notifications











