Anubhavinchu Raja OTT: విడుదలైన మూడు వారాలకే ఓటీటీలోకి.. ఎందులో రాబోతుందంటే!
చాలా కాలం క్రితమే తెలుగు సినీ ఇండస్ట్రీలోకి 'ఉయ్యాల జంపాల' అనే యూత్ ఫుల్ లవ్ స్టోరీ మూవీతో హీరోగా పరిచయం అయ్యాడు రాజ్ తరుణ్. మొదటి చిత్రంతోనే భారీ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న ఈ స్టార్ హీరో.. ఎన్నో అవార్డులను కూడా అందుకున్నాడు. ఆ తర్వాత వరుస పెట్టి సినిమాలు చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలోనే 'కుమారీ 21F'తో బిగ్గెస్ట్ హిట్‌ను దక్కించుకున్నాడు. ఆ తర్వాత కూడా ఎన్నో సక్సెస్‌లను కూడా సొంతం చేసుకున్నాడు. అయితే, కొంత కాలంగా అతడు వరుస పరాజయాలతో సతమతం అవుతూనే ఉన్నాడు. దీంతో అతడి గ్రాఫ్ క్రమంగా పడిపోతూనే వస్తోంది.
కెరీర్ ఆరంభంలో పలు విజయాలను అందుకుని సత్తా చాటిన రాజ్ తరుణ్.. ఈ మధ్య కాలంలో మాత్రం ఫ్లాపుల మీద ఫ్లాపులను చవి చూస్తూ తెగ ఇబ్బందులు పడుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సారి ఎలాగైనా విజయాన్ని సొంతం చేసుకోవాలన్న పట్టుదలతో ఉన్నాడు. ఇందులో భాగంగానే ఇటీవల అతడు 'అనుభవించు రాజా' అనే మూవీలో నటించాడు. శ్రీను గవిరెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రం పల్లెటూరి నేపథ్యంతో తెరకెక్కింది. రిలీజ్‌కు ముందే మంచి బజ్‌ను సొంతం చేసుకున్న ఈ సినిమా కొన్ని అంచనాలతో గత నెల 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.
ఫుల్ లెంగ్త్ ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన'అనుభవించు రాజా' మూవీ అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌లో తెరకెక్కింది. దీంతో ఈ సినిమాపై అంచనాలు మంచిగానే ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే దీనికి బిజినెస్ కూడా అనుకున్న దాని కంటే ఎక్కువగానే జరిగింది. అలాగే, సినిమాను కూడా గ్రాండ్‌గానే విడుదల చేశారు. కానీ, ఈ చిత్రం మాత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఫలితంగా రూ. 4 కోట్ల టార్గెట్‌తో థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీకి దాదాపు కోటి రూపాయలకు పైగానే నష్టాలు వచ్చాయని తెలిసింది. ఈ మూవీ రిజల్ట్‌తో హీరో రాజ్ తరుణ్ ఖాతాలో మరో పరాజయం వచ్చి పడినట్లైంది.

'అనుభవించు రాజా' మూవీ నవంబర్ 26నే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, థియేటర్లలో సరైన రెస్పాన్స్‌ను అందుకోవడంలో విఫలమైన ఈ చిత్రం అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తోంది. దీని డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు కొనుగోలు చేసుకున్న ఆహా సంస్థ తాజాగా రిలీజ్ డేట్‌ను ప్రకటించింది. ఈ చిత్రం డిసెంబర్ 17 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కాబోతుంది. అంటే.. థియేటర్లలో విడుదలైన 22 రోజుల్లోనే ఇది ఓటీటీలోకి రాబోతుంది. ఇలా ఈ మధ్య కాలంలో ఏ సినిమా కూడా ఇంత త్వరగా స్ట్రీమింగ్ కాకపోవడం గమనార్హం.
ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'అనుభవించు రాజా' సినిమాలో రాజ్ తరుణ్ రెండు పాత్రల్లో కనిపించి మెప్పించాడు. ఇక, ఇందులో అతడికి జోడీగా కశీష్ ఖాన్ నటించింది. అలాగే, బిగ్ బాస్ బ్యూటీ ఆరియానా గ్లోరీ కీలక పాత్రను పోషించింది. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, శ్రీ వేంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుప్రియ యార్లగడ్డ నిర్మించారు. గోపీ సుందర్ ఈ మూవీకి సంగీతం అందించాడు. పోసాని కృష్ణ మురళీ, అజయ్, సుదర్శన్, టెంపర్ వంశీ తదితరులు కీలక పాత్రలను పోషించారు.


Click it and Unblock the Notifications











