100 కోట్లు అలా నష్టపోయా.. ‘రాజా సాబ్' ప్రొడ్యూసర్ కామెంట్స్ వైరల్..
సినీ ఇండస్ట్రీలో సాధారణంగా నిర్మాతలు నష్టాల గురించి బహిరంగంగా మాట్లాడేందుకు వెనకాడుతుంటారు. కానీ ప్రొడ్యూసర్ టీజీ విశ్వ ప్రసాద్ (TG Vishwa Prasad) మాత్రం ఇందుకు భిన్నం. తన బ్యానర్ పిపుల్స్ మీడియా ఫ్యాకర్టీ (People Media Factory) ద్వారా వరుస సినిమాలు నిర్మిస్తున్న ఆయన, లాభనష్టాలను దాచకుండా ఉన్నది ఉన్నట్లుగా చెప్పడమే తన నైజమని మరోసారి నిరూపించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఒకే ఏడాదిలో దాదాపు 100 కోట్ల రూపాయల వరకు నష్టపోయానని చెప్పడం సినీ వర్గాల్లో సంచలనంగా మారింది.
అమెరికాలో వ్యాపార రంగంలో స్థిరపడిన టీజీ విశ్వప్రసాద్, సినిమాలపై ఉన్న ప్యాషన్‌తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీని స్థాపించి, 100 సినిమాలు నిర్మించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. ఈ ప్రయాణంలో కొన్ని సినిమాలు హిట్‌లుగా నిలిచినా, మరికొన్ని ఫ్లాప్‌లు, డిజాస్టర్లుగా మారాయని ఆయన అంగీకరించారు. 'లాభనష్టాలతో సంబంధం లేకుండా నేను సినిమాలు చేస్తూనే ఉంటాను' అని స్పష్టంగా చెప్పారు.

తాజాగా ఓ ఇంటర్య్వూ ప్రొడ్యూసర్ టీజీ విశ్వ ప్రసాద్ తన చేదు అనుభవాలను వివరించారు. ఈగల్ (Eagle) సినిమాను ఉదాహరణగా ప్రస్తావించారు. ఈ సినిమా టేబుల్ ప్రాఫిట్ సుమారు 20 కోట్ల వరకు ఉందని, కానీ బిజినెస్ సరిగ్గా చేయలేకపోవడం వల్ల ఆ లాభాన్ని కోల్పోయామని చెప్పారు. ముఖ్యంగా నాన్-థియేట్రికల్ మార్కెట్ అకస్మాత్తుగా క్లోజ్ కావడం, ఆ రైట్స్ కొనడానికి ఎవరూ ముందుకు రాకపోవడం వల్ల దాదాపు రూ. 30-35 కోట్ల వరకు నష్టం వచ్చిందని వెల్లడించారు. ఈ సినిమాలో హీరోగా మాస్ మహారాజు రవి తేజ( Ravi Teja)నటించారు.
అలాగే మిస్టర్ బచ్చన్ (Mr Bachchan) సినిమా కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొందని తెలిపారు. కంటెంట్ పరంగా ఈ సినిమా చాలా బాగుందని, నిజానికి ఇది సక్సెస్ అవ్వాల్సిన మూవీనే అని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే బిజినెస్ పరంగా మాత్రం నష్టాలు తప్పలేదని చెప్పారు. చిన్న చిన్న సినిమాల్లో కూడా ఒక్కో సినిమాకు రూ.10నుంచి 20 కోట్ల వరకు నష్టం వచ్చిందని వివరించారు.
'ఒకే సంవత్సరంలో రెండు సినిమాల్లో రూ. 30-40 కోట్లు, మరో రెండు సినిమాల్లో మరో 15-15 కోట్లు నష్టపోయాను. మొత్తంగా చూస్తే దాదాపు రూ. 100 కోట్ల వరకు నష్టం వచ్చింది' అంటూ టీజీ విశ్వప్రసాద్ తన నష్టాలను బయటపెట్టారు. సినిమా బిజినెస్ అనేది చాలా కఠినమని, ఇది అంత ఈజీ కాదని కూడా అన్నారు. 'నేను ఉద్యోగ స్థాయి నుంచి కెరీర్ ప్రారంభించాను. వెనక తాతల ఆస్తులు, వారసత్వ సంపద ఏమీ లేవు. ఇలాంటి వరుస అపజయాలు నిజంగా ఒక కోలుకోలేని దెబ్బలాంటివి' అని తన మనోవేదనను వెల్లడించారు.
సినిమాలు ఎందుకు ఫెయిల్ అవుతున్నాయన్న ప్రశ్నకు ఆయన ఆసక్తికర సమాధానం ఇచ్చారు. 'మిస్టర్ బచ్చన్ సినిమా వరకు నేను కంటెంట్ విషయంలో పెద్దగా జాగ్రత్తలు తీసుకోలేదు. ఫైనాన్షియల్‌గా చెక్‌లపై సంతకం పెట్టాలా లేదా అన్నదే చూసేవాడిని. కానీ ఆ సినిమా ఫెయిల్యూర్ తర్వాత నుంచి కంటెంట్‌పై కూడా గట్టిగా ఫోకస్ చేస్తున్నాను'అని చెప్పారు. ముఖ్యంగా ఆ సినిమాలో హిందీ పాటలు పెట్టడం పెద్ద మైనస్ అయిందని, ఆడియోస్ ప్రేక్షకులకు కనెక్ట్ కాలేకపోయాయని విశ్లేషించారు.
ఇకపై కంటెంట్ విషయంలో మరింత కఠినంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. 'మనకు కొంచెం నచ్చితే ఆలోచించాలి, ఇంకా బాగా నచ్చితేనే సినిమాలో పెట్టాలి. అనుమానంగా అనిపిస్తే ఆ ఐడియాను వదిలేయడమే బెటర్. యూనిక్‌నెస్ లేకపోతే సినిమాలు తీయడం వేస్ట్' అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. గత ఫెయిల్యూర్స్ తర్వాత ఏం తప్పు జరిగిందో క్షుణ్ణంగా విశ్లేషించానని కూడా చెప్పారు.
ప్రస్తుతం ఆయన నిర్మాణంలో ది రాజా సాబ్ (The Raja Saab)వంటి భారీ సినిమాలు ఉన్నాయి. స్టార్ హీరో ప్రభాస్ (Prabhas)నటిస్తున్న ఈ మూవీతో మరోసారి గట్టి కమ్‌బ్యాక్ ఇవ్వాలనే లక్ష్యంతో టీజీ విశ్వప్రసాద్ ముందుకెళ్తున్నారు. మొత్తానికి.. నష్టాలను కూడా దాచకుండా నిజాయితీగా మాట్లాడిన ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.


Click it and Unblock the Notifications











